కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు యెడియూరప్పకు పోక్సో కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ 17 ఏండ్ల బాలిక పట్ల యెడియూరప్ప అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధిత బాలిక తల్లి మార్చి 14వ తేదీన సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో యెడియూరప్పకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే తాను ఎవర్నీ కూడా లైంగికంగా వేధించలేదని, ఈ కేసు విషయంలో న్యాయ పోరాటం చేస్తానని యెడియూరప్ప గతంలో ప్రకటించారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న బాధితురాలి తల్లి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెలలో చనిపోయారు. ఈ కేసులో బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు నమోదు చేశారు. అయితే యెడియూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, బెంగళూరు రాగానే సీఐడీ ముందు విచారణకు హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు.