దక్షిణ బస్తర్‌లో ఎన్‌కౌంటర్‌…ముగ్గురు మావోయిస్టులు మృతి

Published on

రాయ్‌పూర్/బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మరణించినట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. బీజాపూర్ జిల్లాలో ఇద్దరు నక్సలైట్లను కాల్చి చంపగా, పొరుగున ఉన్న సుక్మా జిల్లాలో మరొకరు మరణించినట్లు సమాచారం.

బీజాపూర్‌లో జిల్లా మిర్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జప్పెమార్క-కామ్‌కనార్ గ్రామాల సమీపంలోని అడవిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) దళాలు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు జిల్లా పోలీసు అధికారి తెలిపారు.

మావోయిస్టుల పశ్చిమ బస్తర్ డివిజన్ సప్లయ్ టీమ్ ఇన్‌చార్జి పాండ్రు, భైరంగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు జోగాతో పాటు మరో 10 నుంచి 15 మంది సాయుధ మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించగా ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు.. సంఘటన స్థలంలో ఆయుధాలు, వైర్‌లెస్ సెట్, బ్యాగులు, మావోయిస్టు యూనిఫాం, మందులు . రోజువారీ ఉపయోగించే వస్తువులను సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

మరోవైపు… సుక్మా జిల్లాలోని బెల్‌పోచ్చా గ్రామ సమీపంలోని కొండపై భద్రతా దళాలు ఒక నక్సలైట్‌ను హతమార్చాయని సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ పిటిఐ వార్త సంస్థకు తెలిపారు.

అయితే ఈ ఘటనలో మృతి చెందిన మావోయిస్టులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉందని, ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన చెప్పారు.

Search

Latest Updates