మోడీ వస్తే..మూడిందే..

Published on

– వారణాసిలో బస్తీవాసుల్ని వెళ్లగొట్టారు..
– నిరాశ్రయులైన 250కిపైగా కుటుంబాలు
– సుందరీకరణ పేరుతో బీజేపీ సర్కార్‌ పేదల ఇండ్లు కూల్చివేత
– చలికి వణుకుతూ ఆరుబయటే వృద్ధులు, చిన్నారులు, మహిళల అవస్థలు

వీవీఐపీలు వస్తుంటే చాలు..రోడ్లపక్కన ఉండే బడుగుజీవులకు ముచ్చెమటలుపడుతున్నాయి. గుజరాత్‌కు ట్రంప్‌ వచ్చినపుడు. ఆమార్గంలో పేద గుడిసెలుంటే..అవి కనపడకుండా పెద్ద సిమెంట్‌ గోడను కట్టారు. ఇపుడు మోడీ తన పార్లమెంట్‌ నియోజకవర్గమైన వారణాసికి వస్తుంటే..ఆ దారిలో ఉన్న బస్తీవాసులను వెళ్లగొట్టారు. తాము ఓటు వేసి గెలిపించిన ఎంపీ, ప్రధాని అయిన మోడీకి మా కష్టాలు తెలియవా..? మమ్మల్ని ఎందుకు తరుముతున్నారంటూ ఆ పేదజనం అధికారులను ప్రశ్నిస్తున్నారు. మీ కష్టాలు మీవే..ప్రధాని వస్తుంటే.. మా పనికి అడ్డం రావొద్దంటూ బూల్‌డోజర్లు, పొక్లయినర్లతో బస్తీవాసులు ఉంటున్న ఇండ్లను కూల్చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ, యూపీలోనూ యోగి సర్కార్‌ ఉన్నదంటూ కమలంపార్టీ పెద్దలు సుందరీకరణ పేరుతో పేద బతుకులను రోడ్డునపడేస్తున్నది.

న్యూఢిల్లీ : దేశ ప్రధాని తమ నగరానికి వస్తున్నారంటే సహజంగా ఆ నగర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే వారణాసి ప్రజలు మాత్రం ప్రధాని మోడీ వస్తున్నారంటే వణికిపోతున్నారు. ఎందుకంటే.. ప్రధాని పర్యటన నేపథ్యంలో బస్తీ ఆవాసాల్ని మొత్తం తొలగించటం, అక్కడ నివసిస్తున్న బడుగు బలహీన వర్గాల్ని బలవంతంగా వెళ్లగొట్టడం జరుగుతున్నాయి. నేడు వారణాసిలో ప్రధాని పర్యటన నేపథ్యంలో, సుజా బాద్‌లో నివసిస్తున్న పేదలు, బలహీన వర్గాలకు చెందిన ఇండ్లను కూలదోసి, ప్రజల్ని బలవంతంగా వెళ్లగొట్టారు. బస్తీ ప్రాంతాన్ని బుల్‌ డౌజర్లతో, ప్రొక్లైన్లతో రాష్ట్ర ప్రభు త్వం చదును చేయించింది. దాంతో అక్కడ నివసిస్తున్న దాదాపు 250కిపైగా పేద కుటుంబాల బతుకులు రోడ్డునపడ్డాయి. ఆరు బయట తీవ్రమైన చలిని భరించ లేక వృధ్ధులు, చిన్నారులు, మహిళలు..ఎంతో వేదనకు గురవుతున్నారు. ఆరుబయట ఉండటం వల్ల, ఇందులో చాలామంది అనారోగ్యం పాలయ్యే అవకాశముందని బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారు.

గంగా నది ఒడ్డున సుజాబాద్‌ ప్రాంతంలో గత ఐదు దశాబ్దాలుగా వందలాది పేద కుటుంబాలు స్థిర నివాసం ఏర్పరుచుకున్నాయి. ఇక్కడ నివసిస్తున్నవారిలో అత్యధికులు దళితులు, మైనార్టీలున్నారు. ప్రధాని వారణాసికి వచ్చినప్పుడల్లా ఈ బస్తీవాసులు భయంతో వణికిపోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ విగ్రహావిష్కరణ కోసం ప్రధాని వారణాసికి వచ్చారు. అప్పుడు బస్తీ వాసుల్ని పోలీసులు బలవంతంగా వెళ్లగొట్టారు. కార్తీకమాసం పురస్కరించుకొని ప్రధాని మళ్లీ వారణాసికి వస్తున్నారు. ఆయన ప్రయాణించే హెలిక్యాప్టర్‌ ల్యాండింగ్‌ కోసం, సుజాబాద్‌ బస్తీని ఖాళీ చేయించారు. బస్తీవాసులను వెళ్లగొట్టడం ఇది రెండోసారి. ప్రధాని మోడీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తమ గోడు వినడానికి ప్రధాని వస్తున్నారనుకుంటే, తమ బతుకుల్నే ఆగం చేశారని బస్తీవాసులు వాపోతున్నారు. వారణాసి నగరంలోప్రధాని ఎక్కడికి వస్తే…అక్కడ సమీపంలోని బస్తీవాసుల్ని బలవంతంగా ఖాళీ చేయించటం పరిపాటిగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బస్తీ ప్రాంతాన్ని బుల్‌ డౌజర్లతో కూలదోయటం, ధ్వంసం చేయటం ఇది రెండోసారి.

ఎక్కడికీ వెళ్లలేం : రేష్మీ (60), గృహిణి
ఫిబ్రవరిలో..మా ఇండ్లను కూల్చేశాక, శాశ్వత నివాసాలు ఏర్పరచుకోలేక పోయాం. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ బతుకుతున్నాం. తాత్కాలిక ఏర్పాట్లుచేసుకొని రోజులు వెళ్లదీస్తున్నాం. కూరగాయల దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నా. తరుచూ అధికారులు వచ్చి బస్తీని ధ్వంసం చేస్తున్నారని, చాలామంది ఇతర గ్రామాలకు వెళ్లిపోయారు. మేం ఎక్కడికి వెళ్లలేక..ఇక్కడే ఉన్నాం. మాకున్న చిన్నపాటి నీడను కూడా దూరం చేస్తున్నారు.

పేదల్ని ఎందుకు వేధిస్తున్నారు ? : అథీరా మురళీ,
‘ఇన్నర్‌ వాయిస్‌ ఫౌండేషన్‌’ సామాజిక కార్యకర్త
భూసేకరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయినా..అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలేవీ ఇక్కడ అమలుకావటం లేదు. బస్తీవాసులకు వేరే చోట పునరావాసం కల్పించాలని కోరుతున్నాం. ప్రతి ఒక్క అధికారి తలుపు తట్టాం. సాయం చేయమని కోరాం. ఎలాంటి స్పందనా రావటం లేదు. పేదల విషయంలో వారికెందుకింత నిర్లక్ష్యమో అర్థం కావటం లేదు. ఈ బస్తీకి చెందిన చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు…వీళ్లంతా ఎటుపోవాలి?

మా గోడు వినేవారే లేరు..
నేను పుట్టిందీ..పెరిగిందీ అంతా ఇక్కడే. ఓటర్‌, ఆధార్‌ కార్డు…ఇక్కడివే. వారణాసికి ఎవరైనా రాజకీయ ప్రముఖుడు వచ్చాడంటే…పోలీసులు మొదట మా బస్తీకే వస్తున్నారు. మా ఇండ్లను పూర్తిగా కూలగొట్టి రోడ్డమీదకు వెళ్లగొడుతున్నారు. మా గోడు వినే వారే లేరు. మా బాధ చెప్పుకునేందుకు దిక్కే లేదు. బుల్డోజర్లతో బస్తీని ధ్వంసం చేయటం ఇది రెండోసారి. మేం ఉండేందుకు మరో చోటు చూపించాలి కదా? అదీ లేదు.
– రామ్‌ విలాస్‌, స్థానికుడు

Courtesy Nava Telangana

Search

Latest Updates