- అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రులకు పోటెత్తుతున్న బాధితులు
- 315కు చేరిన బాధితుల సంఖ్య
- చికిత్స పొందుతూ ఒకరి మృతి
- కారణాలపై రాని స్పష్టత
అమరావతి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అంతు చిక్కని వ్యాధితో ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 108 మంది ఆసుపత్రిలో చేరగా ఆదివారం రాత్రి ఈ సంఖ్య 315కు చేరింది. వీరిలో 180 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. మూర్ఛ పోయి ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి (42) మరణించాడు. రెండు రోజులుగా ఈ వింత వ్యాధితో వందల మంది ఆసుపత్రుల పాలవుతున్నా దీనికి కారణాలేమిటో తేలకపోవడం రాష్ట్రవ్యాప్తంగా కలవరం రేకెత్తిస్తోంది. బాధితుల్లో అత్యధికులు 20 నుంచి 30 సంవత్సరాల్లోపు వయసువారే. రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులేవీ లేనివారు ఇలా ఉన్నట్లుండి అస్వస్థతకు గురయి ఆస్పత్రి పాలవడం చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రిపాలైన వారిలో 12 సంవత్సరాల్లోపు చిన్నారులు కూడా దాదాపు 40 మంది వరకు ఉన్నారు. శనివారం ఏలూరు నగరంలోని పలు కాలనీలవారు అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరారు. ఆదివారం కొత్తగా ఇందిరమ్మ కాలనీ, మరడాని రంగారావు కాలనీ, వైఎస్సార్ కాలనీల నుంచి ముగ్గురు ఆస్పత్రిలో చేరడం గమనార్హం. మరోవైపు దెందులూరు పరిధిలోని కేతవరం ప్రాంతం నుంచి నలుగురు వింత వ్యాధి లక్షణాలతో స్థానికంగానే చికిత్స పొంది కోలుకున్నారు.
ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గీతాప్రసాదిని ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలోనే ఉండి బాధితులకు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. రాత్రి పది గంటల సమయంలో విలేకర్లతో మాట్లాడారు. చాలామంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని, ఆసుపత్రిలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ జిల్లా ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు ఆశ్రం వైద్యకళాశాల వైద్యులు ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం 30 మంది వైద్యులు బాధితులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ పేర్కొన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిని విజయవాడ, గుంటూరు జీజీహెచ్‌లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయవాడ ఆసుపత్రిలో ప్రభ (6), చెల్లుబోయిన సురేష్(24), జె.అనూరాధ (27), సింహాచలమ్మ (80) చికిత్స పొందుతున్నారు. అనూరాధ నాలుగు నెలల గర్భిణి. ఈమె వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నలుగురి ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. గుంటూరు జీజీహెచ్‌కు వచ్చిన చలపతిరావు (65), శంభులింగాచారి (51), కుసుమకుమారి (42), రమణమ్మ (59), లక్ష్మీకుమారి(55)లను ఐసీయూలో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, వారికి ప్రాణాపాయం లేదని సూపరింటెండెంట్ ప్రభావతి తెలిపారు.
లక్షణాలను బట్టి చికిత్స
బాధితుల లక్షణాలు, వారి ఆరోగ్య చరిత్రను అనుసరించి చికిత్స అందిస్తున్నారు. వ్యాధి మూలాలు తెలిస్తే అందుకు తగ్గ చికిత్స అందించేందుకు వీలుంటుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం లక్షణాలు అనుసరించి అందిస్తున్న చికిత్స వల్ల రోగులు గంటల వ్యవధిలోనే కోలుకుంటున్నారని పేర్కొన్నారు. వయసులో పెద్దవారికి మాత్రం సీటీస్కాన్ తీస్తున్నారు.
ఎయిమ్స్ బృందంతో వైరస్ నిర్ధారణ పరీక్షలు
కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో బాధితులందరికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఎయిమ్స్ వైద్య బృందం అభిప్రాయపడింది. మంగళగిరి ఎయిమ్స్ నుంచి డాక్టర్ కక్కర్ నేతృత్వంలో వైద్యుల బృందం ఏలూరుకు వచ్చింది. ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గీతాప్రసాదిని, ఇతర అధికారులతో మాట్లాడింది. ఆర్టీపీసీఆర్ ద్వారా నమూనాలు పరీక్షించేందుకు తాము అవసరమైన ఏర్పాట్లతో వచ్చినట్లు వారు తెలిపారు. అప్పటివరకు కొద్దిమందికి మాత్రమే ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఎయిమ్స్ వైద్యులు బాధితుల జీవనోపాధి, వారి నివాస ప్రాంతాలు, ఆహార అలవాట్లు, కరోనా నేపథ్యంలో మందులు ఏమైనా వాడుతున్నారా? నీటి సరఫరా తీరు గురించి అధికారులతో ఎక్కువ సమయం చర్చించారు. ఏ చికిత్స అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. వైరస్ నిర్ధారణ కోసం బాధితుల నుంచి ఎయిమ్స్ వైద్య బృందం నమూనాలు సేకరించింది. కొందరి నుంచి రక్త నమూనాలు కూడా సేకరిస్తున్నట్లు డాక్టర్ కక్కర్ ‘ఈనాడు’తో చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యం), స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆదివారం ఉదయం, సాయంత్రం పరామర్శించారు. వైద్యులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు.
నీటి కాలుష్యమే కారణం!
ఏలూరు ఘటనకు నీరు కలుషితం కావడమే కారణంగా కనిపిస్తోందని సీనియర్ వైద్యులు ఒకరు ఆదివారం రాత్రి అన్నారు. దిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఇక్కడి పరిస్థితుల గురించి ఆరా తీశారు. నీటిని శుద్ధి చేసేందుకు ఉపయోగించే మందు మోతాదు మించి ఉండొచ్చని, ఆ ప్రభావం బాధితులపై కనిపించి ఉండొచ్చని ఎయిమ్స్ వైద్యులు అభిప్రాయపడినట్లు వైద్యులు తెలిపారు. దీనిని ఆర్గానో క్లోరిన్ ప్రభావంగా చెబుతున్నారు.
ఏలూరులో.. ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించాలి: చంద్రబాబు
అమరావతి: పరిస్థితులు మరింత అధ్వానంగా మారకముందే.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించాలని, ప్రత్యేక వైద్య బృందాలు, తాగునీటి పరీక్ష బృందాలు, పారిశుద్ధ్య బృందాల్ని తరలించాలని తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ‘ఏలూరులోని అనేక ప్రాంతాల్లో ఆరేళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు నోట నురగతో.. మూర్ఛ వచ్చినట్లు నేలపై పడి కొట్టుకుంటూ విలవిల లాడుతుంటే మొక్కుబడిగా స్పందించడం సరికాదు’ అని ధ్వజమెత్తారు. ఈ దుర్ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఏపీ సీఎస్‌తో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
దిల్లీ: ఏలూరులో వందలమంది ప్రజలు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో మాట్లాడారు. కారణాలు ఆరా తీసి నివేదిక పంపాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం తరఫున ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కిషన్‌రెడ్డి ఇదే అంశాన్ని ఐసీఎంఆర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. పరిస్థితిని చక్కదిద్దడానికి ఏపీ ప్రభుత్వానికి తగిన చేయూతనందించాలని కోరారు. అవసరమైతే దిల్లీ నుంచి ఐసీఎంఆర్ బృందాన్ని ఏలూరుకు పంపడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు కిషన్‌రెడ్డి కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.
Courtesy Eenadu