42.4% సిజేరియన్‌ కాన్పులే

Published on

  • ఇందులో 63% ప్రైవేటు, 26.6% ప్రభుత్వ ఆసుపత్రుల్లో
  • గత అయిదేళ్లలో రాష్ట్రంలో మెరుగుపడిన పరిస్థితులు
  • మహిళలపై తగ్గిన జీవిత భాగస్వాముల హింస

దిల్లీ : వైద్య ఆరోగ్య పరిస్థితులు నానాటికీ మెరుగుపడుతున్నా ఆంధ్రప్రదేశ్‌లో సిజేరియన్‌ కాన్పులు తగ్గట్లేదు. రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం కాన్పుల్లో 42.4% సిజేరియన్‌ ద్వారానే జరుగుతున్నాయి. గత అయిదేళ్లలో ఈ సంఖ్య 2.3% పెరిగింది. మొత్తం సిజేరియన్‌ కాన్పుల్లో 63% ప్రైవేటు ఆసుపత్రుల్లో, 26.6% ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయి. ఈ విషయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-20)లో తేలింది. 2015-16లో నాటితో పోలిస్తే సంస్థాగత కాన్పులు 5% (91.5% నుంచి 96.5%కి) పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం సగటున ఒక్కొక్కరు రూ.3,105 సొంత డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తోంది. గతం కంటే ఇది రూ.783 అధికం. మొత్తం కాన్పుల్లో 50.4% ప్రభుత్వ వైద్యశాలల్లోనే జరుగుతున్నాయి. ఈ అంశంలో 12.1% వృద్ధి ఉంది.

తగ్గిన శిశుమరణాలు
గత అయిదేళ్లతో పోలిస్తే రాష్ట్రంలో శిశువులు, అయిదేళ్లలోపు పిల్లల మరణాలు తగ్గిపోయాయి. కుటుంబనియంత్రణ పాటించేవారి నిష్పత్తి పెరిగింది. ఎక్కువగా మహిళలకే ఆపరేషన్‌ చేయిస్తున్నారు. పిల్లలకు టీకాలు వేయించడం పెరిగింది. పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టే పిల్లల సంఖ్య అయిదేళ్లలో 12% పెరిగింది. 15 ఏళ్ల లోపు పిల్లల జనాభా గతం కంటే 1.5% తగ్గింది. వైద్యబీమా పరిధిలోకి వచ్చే కుటుంబాల సంఖ్య 4.4% తగ్గింది.
 మహిళల్లో ఊబకాయం సమస్య పెరగ్గా, పురుషుల్లో కొంతమేర తగ్గింది. మహిళల్లో 48.9% మంది, పురుషుల్లో 53% మంది ఊబకాయం ముప్పును ఎదుర్కొంటున్నారు.
 6-59 నెలల పిల్లల్లో రక్తహీనత 63.2%కు పెరిగింది. 15-49 ఏళ్లలోపు వయస్సున్న 59% మంది మహిళలూ ఇదే సమస్యతో సతమతమవుతున్నారు.
 మహిళల కంటే పురుషుల్లో మధుమేహం, బీపీ సమస్య ఎక్కువ.
 సర్వైకల్‌, రొమ్ము, నోటి కేన్సర్‌ పరీక్షలు చేయించుకొనే మహిళల సంఖ్య 10%లోపే ఉంది.
 హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ గురించి మహిళల్లో అవగాహన తక్కువ. కండోమ్‌ ఉపయోగిస్తే ఈ మహమ్మారి బారిన పడే అవకాశం తక్కువని 63% మంది మహిళలకు తెలియగా, పురుషుల్లో ఈ సంఖ్య 82.6% ఉంది.
 47.8% మంది మహిళల పేరున ఇల్లు, భూమి లాంటి ఆస్తులున్నాయి. 81.8% మహిళలకు బ్యాంకు ఖాతాలు, 48.9% మందికి మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి. రుతుక్రమం సమయంలో 85.1% మంది పరిశుభ్రమైన పద్ధతులు పాటిస్తున్నారు.
3.8% మంది మహిళలు, 22.6% మంది పురుషులు పొగాకు వాడుతున్నారు. 0.5% మహిళలు, 23.3% మంది పురుషులు మద్యం తాగుతున్నారు.

లింగ నిష్పత్తి వృద్ధి
గడచిన అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడ్డాయి. పాఠశాలలకు వెళ్లే పిల్లల సంఖ్య పెరిగింది. లింగనిష్పత్తి వృద్ధి చెందింది. గతంలో పెద్దల్లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 1021 మంది మహిళలుండగా, ఇప్పుడా సంఖ్య 1045కి పెరిగింది. పిల్లల్లో ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 914 మంది అమ్మాయిలుండగా ఇప్పుడా సంఖ్య 934కి పెరిగింది. జనన, మరణ రిజిస్ట్రేషన్లు పెరిగాయి. విద్యుత్తు, రక్షిత మంచినీరు, మరుగుదొడ్లు, వంటగ్యాస్‌ సౌకర్యం, అయోడైజ్డ్‌ ఉప్పు వినియోగించే కుటుంబాల సంఖ్య వృద్ధి చెందింది. జీవిత భాగస్వాముల చేతుల్లో శారీరక, లైంగిక హింసకు గురయ్యే మహిళల సంఖ్య 43.4% నుంచి 30%కి తగ్గింది.

18 ఏళ్లలోపు లైంగిక దాడికి గురైన యువతుల సంఖ్య 6.8% నుంచి 3.7%కి తగ్గింది. అక్షరాస్యత, ఇంటర్నెట్‌ వినియోగంలో మహిళల వెనుకబాటుతనం ఎక్కువగా ఉంది. ఆడపిల్లలకు 18 ఏళ్లు రాగానే పెళ్లి చేసేవారి సంఖ్య 29.3% ఉంది. మహిళల సంతానసాఫల్య నిష్పత్తి ముఖ్యంగా పట్టణాల్లో బాగా తగ్గింది.

Courtesy Eenadu

Search

Latest Updates