ఆన్లైన్ విద్య.. అదొక మిథ్య !

Published on

– ఇండియాలో అంతంతమాత్రమే : అజీం ప్రేమ్‌జీ అధ్యయనం
– ప్రభుత్వ సూళ్లలోని 60శాతం విద్యార్థులకు అందుబాటులో లేదు
– విద్యారంగంలో అసమానత మరింత పెరిగే ప్రమాదం : పరిశోధకులు

ఇండియాలో ఇప్పుడున్న ఆన్‌లైన్‌ విద్య కారణంగా, విద్యారంగంలో అసమానతలు మరింతగా పెరిగే ప్రమాదముంది. సాధ్యమైనంత త్వరగా దశలవారీగా పాఠశాలలను తెరవడమొక్కటే పరిష్కారమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, టీచర్లు కరోనా బారినపడకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే తరగతి గది బోధన మొదలవ్వాలని వారు సూచించారు. పాఠశాలలు ప్రారంభించేంత వరకూ…నేరుగా విద్యా బోధనా పద్ధతులు, విద్యార్థుల ముంగిట టీచర్‌ కనపడటం వంటివి అమలుజేయాలని తెలిపారు. న్యూఢిల్లీ : ఇండియాలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్య ఏమాత్రమూ అందుబాటులో లేదనీ, ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న కొద్ది మంది విద్యార్థుల బుర్రల్లోకి పాఠ్యాంశాలు ఎక్కటం లేదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఇండియాలో ఇప్పుడు కొనసాగుతున్న ఆన్‌లైన్‌ పాఠాల బోధన విద్యార్థుల అభివృద్ధికి ఏ విధంగానూ తోడ్పడదని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల్లో 60శాతం మందికి ఆన్‌లైన్‌ విద్య అందుబాటులో లేదని అధ్యయనం తెలిపింది. బెంగుళూరు కేంద్రంగా ఉన్న ‘అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ’కి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.

దేశం నలుమూలల్లో ఉన్న 1522 పాఠశాలల్లో పనిచేస్తున్న 1522 మంది టీచర్ల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదిక రూపొందించినట్టు పరిశోధకులు తెలిపారు. ‘మైథ్స్‌ ఆఫ్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌’ పేరుతో విడుదలైన నివేదికలో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థుల విద్యాభ్యాసం కరోనా సంక్షోభ సమయాన ఎలా కొనసాగుతోందన్న దానిపై పరిశోధకులు ప్రధానంగా దృష్టిసారించారు. టీచర్లలో చాలామంది తరగతి బోధన ఎప్పుడు మొదలవుతుందా అని ఆలోచిస్తున్నారని తెలిసింది. బోధన తీరు మారటంతో (ఆన్‌లైన్‌ విద్య వల్ల) విద్యార్థి-ఉపాధ్యాయుడికి మధ్య ఉండే ఒకరకమైన భావోద్వేగపూరిత బంధం తెగిపోయిందని టీచర్లు భావిస్తు న్నారు. విద్యార్థుల ప్రతిభను అంచనావేయటం సాధ్యం కావ టం లేదని 90శాతం మంది టీచర్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో ఇచ్కే హోమ్‌వర్క్‌, అసైన్‌మెంట్లు విద్యార్థులు పూర్తిచేయలేక పోతున్నారని 50శాతం మంది టీచర్లు చెప్పారు.

విద్యా ప్రమాణాలకు దెబ్బ
ఇండియాలోని ఆన్‌లైన్‌ విద్య నాణ్యతా ప్రమాణాలు సరిగాలేవని అధ్యయనం పేర్కొంది. వివిధ కారణాలు, ఆటంకాల వల్ల రెగ్యులర్‌గా క్లాసులు వినలేకపోతున్నామని విద్యార్థుల్లో 60శాతం మంది చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ లేకపోవటం, కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఒకే స్మార్ట్‌ఫోన్‌ను కలిగివుండటం, ఆన్‌లైన్‌ యాప్స్‌ వాడకం కష్టతరంగా మారటం…మొదలైనవి అడ్డంకులుగా మారాయి. ఈ విషయంలో వికలాంగ విద్యార్థులకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.

రాష్ట్రాల వారీగా చూస్తే..
ప్రభుత్వ స్కూళ్లలో ఆన్‌లైన్‌ విద్యను ఛత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలు అధికారికంగా ప్రారంభించాయి. కర్నాటక, ఉత్తరాఖండ్‌లలో రాష్ట్రస్థాయిలో ఆన్‌లైన్‌ విద్యను అమలుజేయటం లేదు. ఆన్‌లైన్‌ విద్య వేదికపై పాఠ్యాంశాల బోధన ఎలా ఉండాలన్నదానిపై తమకు సరైన శిక్షణ లేదని 54శాతం మంది టీచర్లు చెప్పారు.

వన్‌ వే..
– ఆన్‌లైన్‌ బోధనలో..విద్యార్థి-టీచర్‌ మధ్య కొనసాగుతున్నదంతా కూడా ‘వన్‌ వే కమ్యునికేషన్‌’.
– విద్యార్థులు ఎంత నేర్చుకుంటున్నారన్నది తెలుసుకోవటం సాధ్యం కావటం లేదని టీచర్లు చెప్పారు.
– అంతేగాక బాధాకరమైన అంశం ఏంటంటే..మెజార్టీ విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులు వినటం లేదు.
– క్లాసులకు హాజరు కాని విద్యార్థులకు ఏమైందో..అన్నది కూడా తమకు తెలియటం లేదని టీచర్లు చెప్పారు.
– వాట్సాప్‌లలో పంపిస్తున్న హోమ్‌వర్క్‌ విద్యార్థులు చేయటం లేదు. అనేకమంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలే లేవు.
– విద్యార్థుల్లాగే, వారి తల్లిదండ్రులు కూడా ఆన్‌లైన్‌ విద్యపట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు.
– తల్లిదండ్రుల్లో 70శాతం మంది ఆన్‌లైన్‌ క్లాసులు ప్రభావం చూపటం లేదన్నారు.

మా దగ్గరున్న విద్యార్థుల్లో 20శాతం మందికి మాత్రమే స్మార్ట్‌ఫోన్లున్నాయి. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులంతా కూలీలు, పేదలు. స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత వారికి లేదు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న విద్యార్థులకు కూడా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లో నెట్‌వర్క్‌ చాలా బలహీనంగా ఉంది, ఇక గ్రామాల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Courtesy Nava Telangana

Search

Latest Updates