కార్పొరేట్ల సంపద యమస్పీడ్

Published on

– తారాజువ్వలా ఎగిసిన ఏడుగురి కుబేరుల ఆస్తులు
– ఏడాదిలో రూ.4.7 లక్షల కోట్లు వృద్ధి
– కరోనా కాలంలో 50 శాతం పెరుగుదల

ముంబయి : కరోనా సంక్షోభ కాలంలో కోట్లాది సాధారణ ప్రజల ఆదాయాలు అమాంతం పడిపోవడం, ఉద్యోగాలు కోల్పోగా.. మరోవైపు భారత కార్పొరేట్ల ఆదాయం మాత్రం తారా జువ్వలా ఎగిసింది. ముఖ్యంగా ముఖేష్‌ అంబానీ, అదానీ, శివనాడార్‌, రాధా కిషన్‌ తదితర ఏడుగురు కుబేరుల సంపద ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ 11 నాటికి ఏకంగా రూ.4.7 లక్షల కోట్లు (64 బిలియన్‌ డాలర్ల) మేర పెరిగింది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలగా.. భారత కుబేరుల సంపద మాత్రం అనూహ్యంగా పెరగడం విశేషం. డిసెంబర్‌ 11 నాటికి అదానీ గ్రూప్‌ చైర్మెన్‌ గౌతమ్‌ అదానీ, రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సైరస్‌ పూనావాలా, హెచ్‌సీఎల్‌ టెక్‌ శివనాడార్‌, విప్రో అజీమ్‌ ప్రేమ్‌జీ, డీమార్ట్‌ అధినేత రాధాకిషన్‌ ధమానీ, సన్‌ ఫార్మా దిలీప్‌ శాంఘ్వీల ఆస్తులు 64 బిలియన్‌ డాలర్లు పెరిగి దాదాపుగా 195 బిలియన్లకు చేరిందని బ్లూంబర్గ్‌ బిలియనీర్‌ సూచీ సోమవారం ఒక రిపోర్ట్‌లో వెల్లడించింది. ఒక్క ఏడాదిలోనే వీరి సంపద 50 శాతం వరకు ఆదాయం పెరిగిందని వెల్లడించింది. గత శుక్రవారం నాటి మారకపు విలువ ప్రకారం..

బిలియన్‌ డాలర్లు రూ.7362 కోట్లకు సమానం. ప్రస్తుత ఏడాది గౌతమ్‌ అదానీ సంపద మునుపెన్నడూ లేని విధంగా పెరిగింది. 2019 చివరి నాటికి 11.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఆయన సంపద.. ఈ ఏడాదిలో 21.1 బిలియన్‌ డాలర్లు (రూ.1.55 లక్షల కోట్లు) పెరిగి ఏకంగా రూ.2.38 లక్షల కోట్లు (32.4 బిలియన్‌ డాలర్ల)కు చేరడం ఆశ్చర్యకరం. కాగా ముఖేష్‌ అంబానీ సంపద 18.1 బిలియన్‌ డాలర్లు (రూ.1.33 లక్షల కోట్లు) పెరిగి రూ.5.64 లక్షల కోట్లకు చేరింది. ఇంతక్రితం ఏడాదిలో ముఖేశ్‌ ఆదాయం రూ.4.31 లక్షల కోట్లు (58.6 బిలియన్‌ డాలర్లు)గా ఉంది. సైరస్‌ పూనావాలా ఆస్తులు 6.97 బిలియన్‌ డాలర్లు పెరిగి 15.6 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. శివ్‌ నాడర్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ సంపద కలిపి 12 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఇందులో శివ్‌ నాడర్‌ సంపద ఈ ఏడాది 6.29 బిలియన్‌ డాలర్లు పెరిగి 22 బిలియన్‌ డాలర్లకు, ప్రేమ్‌జీ ఆస్తి 5.26 బిలియన్‌ డాలర్లు పెరిగి 23.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. డీమార్ట్‌ అధినేత రాధాకిషన్‌ ధమానీ సంపద 4.71 బిలియన్‌ డాలర్లు పెరిగి 14. బిలియన్‌ డాలర్లకు, దిలీప్‌ సింఘ్వీ ఆస్తి 2.23 బిలియన్‌ డాలర్లు పెరిగి 9.69 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

Courtesy Nava Telangana

Search

Latest Updates