వ్యవసాయం-స్వేచ్ఛా మార్కెట్‌

Published on

ప్రభాత్‌ పట్నాయక్‌
ప్రభాత్‌ పట్నాయక్‌

మన వంటి పెద్ద దేశం ఆహార భద్రత కలిగి వుండాలంటే ఆ తిండిని మనమే పండించుకోవాలి. మన భూముల మీద ఏ పంటలు పండించాలన్నది స్వేచ్ఛా మార్కెట్‌ శక్తులకు వదిలిపెట్టకూడదు. మన సమాజం సజావుగా నడవాలంటే ఏ పంటలు పండించాలన్న విషయంలో ప్రభుత్వ జోక్యం తప్పకుండా ఉండాలి. ఇటువంటి జోక్యం ఉండాలంటే ప్రభుత్వం ఆహార ధాన్యాల ధరలను కూడా నియంత్రించాలి. వాటిని స్వేచ్ఛా మార్కెట్‌ శక్తులకు విడిచిపెట్టకూడదు.

మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులనూ రద్దు చేయాల్సిందేనంటూ దేశవ్యాప్తంగా రైతాంగం సాగిస్తున్న పోరాటంపై వ్యాఖ్యానిస్తున్న వారిలో అత్యధికులు రైతుల వైఖరిని బలపరుస్తున్నారు. కాని కొంతమంది మోడీ ప్రభుత్వాన్ని బలపరచకపోయినా, వ్యవసాయ రంగంలో స్వేచ్ఛా మార్కెట్‌ విధానం ఎందుకు ఉండకూడదన్న ప్రశ్నను లేవనెత్తుతున్నారు. దానికి సమాధానం ఇదివరకే చెప్పుకున్నాం కాని ఈ సందర్భంలో మరోసారి చర్చించడం ఉపయోగకరంగా ఉంటుంది.

స్వేచ్ఛా మార్కెట్‌ విధానం మొత్తంగా ఆర్థిక వ్వవస్థకి మేలైన పరిష్కారం కాదని కీన్స్‌ ఇదివరకే నిరూపించాడు. అయితే ప్రస్తుతానికి కీన్స్‌ వాదనను కాసేపు పక్కన పెడదాం. రెండు ప్రత్యేక కారణాల రీత్యా ఏ పంటకు ఎంత ధర ఉండాలన్నది స్వేచ్ఛా మార్కెట్‌కు విడిచిపెడితే అది చాలా అనర్థాలకు దారితీస్తుంది. అలాగే ఏ వ్యవసాయ పంట ఎంత పరిమాణంలో పండించాలన్నది స్వేచ్ఛా మార్కెట్‌కు వదిలిపెట్టినా అది కూడా సమాజంలో పలు హానికర పరిణామాలకు దారితీస్తుంది.

స్పష్టత కోసం రెండు అంశాలనూ విడివిడిగా చర్చిద్దాం. ఆహారధాన్యాలు మాత్రమే వ్యవసాయంలో పండిస్తున్నారని అనుకుందాం. ఆహార ధాన్యాలకు డిమాండ్‌ దాని ధరతో నిమిత్తం లేకుండా ఒకే విధంగా ఉంటుంది (మన ఆకలిని బట్టి ఆహారం తీసుకుంటాం తప్ప ఆహారధాన్యం ధరను బట్టి కాదు కదా). అయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి మాత్రం ప్రకృతి సానుకూలంగా ఉందా లేక ప్రతికూలంగా ఉందా అనే దానిని బట్టి ఆధారపడి మారుతూ వుంటుంది. అందువలన ఆహార ధాన్యాల ధరలలో తరుచూ హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇది ఆహార ధాన్యాలకే కాదు, ఏ వ్యవసాయ పంటకైనా వర్తిస్తుంది. ధాన్యానికి ధర తగ్గిపోతే రైతులు అప్పులపాలౌతారు. అదే ధర పెరిగితే వినియోగదారులు కొనలేక ఆకలి చావులపాలౌతారు.

మహా మాంద్యం సమయంలో 1930 దశకంలో రైతులు విపరీతంగా అప్పుల పాలయ్యారు. అదే 1943 నాటి బెంగాల్‌ మహా క్షామం సమయంలో ముప్ఫై లక్షల మంది ఆకలి చావుల పాలయ్యారు. ఈ రెండు సందర్భాలూ పంటలు బాగా ఎక్కువగా పండినందువల్లనో, లేక బాగా దెబ్బ తినడం వల్లనో వచ్చినవి కావు. మహామాంద్యం సమయంలో ధరలు పడిపోయినందు వలన వినియోగదారులకు కలిగిన ప్రయోజనం కూడా ఏమీ లేదు. అదే విధంగా బెంగాల్‌ కరువు సమయంలో రైతులకు అధిక ధరలేమీ దక్కలేదు. ఈ రెండు సంఘటనలూ సర్వనాశనానికే దారితీశాయి.

స్వేచ్ఛా మార్కెట్‌ బాగా పని చేస్తుందని చెప్పి దానిని సమర్ధించేవారు ఇటువంటి పరిస్థితులను ఏమాత్రమూ ఊహించరు. ఒక వస్తువు ధర పెరిగితే దాని ప్రభావం తక్కిన రకాల సరుకుల మీద ఏమీ ఉండదనే వారు భావిస్తారు. తిండిగింజలు అనే తరహా సరుకులు ఉంటాయని వారు పరిగణన లోకి తీసుకోరు. తిండిగింజల ధరలు పెరిగితే దాని పర్యవసానంగా ప్రజలు తక్కిన ఇతర సరుకులను కొనుగోలు చేయగల శక్తిని కోల్పోతారని వారు కనీసం ఊహించరు (ఒకానొక వస్తువు ధర పెరిగితే దాని డిమాండ్‌ తగ్గుతుందని, దాని ధర తగ్గితే డిమాండ్‌ పెరుగుతుందని, మొత్తం మీద చూసుకున్నప్పుడు మార్కెట్‌ సమ తూకంలో కొనసాగుతుందని స్వేచ్ఛా మార్కెట్‌ సమర్థకులు వాదిస్తారు).

స్వేచ్ఛా మార్కెట్‌లో ఉండే సమతూకం ప్రభుత్వ జోక్యం కారణంగా దెబ్బ తింటుందని, అందుకే ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని సదరు సమర్ధకులు వాదిస్తారు. కాని ఆ వాదనలు పూర్తిగా అసంబద్ధం. ఆహార ధాన్యాల ధరలు హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగడానికి ప్రభుత్వ జోక్యం అనివార్యం. అప్పుడే వినాశకర పరిణామాలు జరగకుండా నివారించడం సాధ్యమౌతుంది.

స్వేచ్ఛా మార్కెట్‌ గనుక అమలు లోకి వస్తే వ్యవసాయంలో భూ వినియోగం పెరుగుతుందన్న వాదనను చూద్దాం. స్వేచ్ఛా మార్కెట్‌ విధానంలో సరుకుల ఉత్పత్తి ఆ సరుకును ఎంతమంది కొనుగోలు చేసే అవకాశం ఉంది అన్న దానిని బట్టి ఉంటుంది. అందుచేత వ్యవసాయంలో స్వేచ్ఛా మార్కెట్‌ వలన పశ్చిమ దేశాల ప్రజానీకం వినియోగించే పంటలను కాని, మొత్తంగా సమాజంలో డబ్బున్న వాళ్ళు వినియోగించే పంటలను కాని ఎక్కువగా పండించే వైపు మొగ్గు ఏర్పడుతుంది. అందువలన ఆ మేరకు ఆహార ధాన్యాల ఉత్పత్తి నుండి సంపన్నుల అవసరాలు తీర్చే దిశగా భూవినియోగంలో మార్పు కలుగుతుంది. విదేశాల నుండి దిగుమతి చేసుకోడం ద్వారా ఆహార ధాన్యాల కొరత ఏర్పడకుండా నివారించవచ్చునేమో కాని దేశం కొన్ని దశాబ్దాలుగా సాధించిన ఆహార ధాన్యాల స్వయం సమృద్ధిని మాత్రం ఇది దెబ్బ తీస్తుంది. తిండిగింజల కోసం ఇతర దేశాల మీద ఆధారపడనైనా పడాలి, లేదా ప్రజలు ఆకలితో మాడి చావాలి.

ఆహార పంటల నుండి పండ్లతోటల వైపు భూవినియోగంలో మార్పు వచ్చిందనుకుందాం. ఆహార పంటల సాగుకు ఒక పొలంలో 10 మంది కూలీలు అవసరం అయితే అదే పండ్ల తోటలలో అయిదుగురు సరిపోతారు. ఈ మార్పు ఫలితంగా అయిదుగురు పని కోల్పోతారు. ఫలితంగా వారు ఆహారధాన్యాలను కొనే శక్తిని కోల్పోతారు. ఒకవేళ పుష్కలంగా ఆహారధాన్యాలను దిగుమతి చేసుకున్నా, ఆ విధంగా దిగుమతి చేసుకోడానికి అవసరమైన విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర బాగా పోగుబడి వున్నా, వారు మాత్రం ఆహారాన్ని కొనగలిగే స్థితిలో ఉండరు. ప్రజల ఆకలి పెరుగుతుంది. ఇక వ్యవసాయం బదులు రియల్‌ ఎస్టేట్‌ వైపుగానో, గోల్ఫ్‌ మైదానాల వంటివి ఏర్పాటు చేసే వైపుగానో భూవినియోగం మారితే కోల్పోయే ఉపాధి అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగం, ఆకలి చావులూ ఇంకా పెరుగుతాయి. అయితే స్వేచ్ఛా మార్కెట్‌ వాదులు ఇటువంటి పరిస్థితులను ఎప్పుడూ ఊహించలేరు. వారి దృష్టిలో స్వేచ్ఛా మార్కెట్‌ ఎప్పుడూ సమ తూకంలో ఉంటుంది. అంటే ఎప్పుడూ పూర్తి స్థాయిలో అందరికీ ఉపాధి ఉంటుందని, ఎవరి మనుగడకూ ముప్పు ఉండనే ఉండదని వారు భావిస్తారు.

ఇక ఆహారధాన్యాల విషయంలో దేశ స్వయం సమృద్ధి దెబ్బ తింటుందన్న విషయానికి వద్దాం. ఒకసారి భూవినియోగం ఇతర పంటలవైపు మళ్ళితే, మన దేశ ఆహార అవసరాలకు ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకోవలసి వస్తుంది. ఇందులో రెండు సమస్యలు ఉంటాయి. మొదటిది. మన దేశానికి అవసరమైనప్పుడల్లా ప్రపంచ మార్కెట్‌లో ఆహార ధాన్యాలు తగినంతగా అందుబాటులో ఉంటాయన్న గ్యారంటీ లేదు. మన వంటి అధిక జనాభా గల దేశంలో ఆహార ధాన్యాల అవసరాలు భారీగా ఉంటాయన్నది మరిచిపోకూడదు. మన వంటి దేశాలలో అవసరం పడింది అనగానే ప్రపంచ మార్కెట్‌లో వాటి ధరలు అమాంతం ఆకాశాన్నంటుతాయి.

మన అర్థశాస్త్ర గ్రంథాల్లో రాసుకున్నట్టు ప్రపంచ మార్కెట్‌ ఉండదు. చాలా మంది అమ్మకందారులూ, చాలామంది కొనుగోలుదారులూ మన పుస్తకాల్లో మాత్రమే ఉంటారు. వాస్తవ ప్రపంచంలో ఒకానొక దేశానికి అవసరమైన ఆహార ధాన్యాలు ప్రపంచ మార్కెట్లో దొరుకుతాయా లేదా అన్నది అమెరికా, ఇతర యూరోపియన్‌ దేశాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వుంటుంది. మన దగ్గర విదేశీ మారక నిల్వలు తగినంత మోతాదులో ఉన్నా, ఆహార ధాన్యాలు ప్రపంచ మార్కెట్‌లో ఉన్నా, అవి మనకు దొరకాలంటే మనం అంతకు మించిన మూల్యం (ఇది మార్కెట్‌ సూత్రాలతో సంబంధం లేని మూల్యం సుమా) చెల్లించాల్సి వుంటుంది.

ఈ కారణాల చేత, మన వంటి పెద్ద దేశం ఆహార భద్రత కలిగి వుండాలంటే ఆ తిండిని మనమే పండించుకోవాలి. మన భూముల మీద ఏ పంటలు పండించాలన్నది స్వేచ్ఛా మార్కెట్‌ శక్తులకు వదిలిపెట్టకూడదు. మన సమాజం సజావుగా నడవాలంటే ఏ పంటలు పండించాలన్న విషయంలో ప్రభుత్వ జోక్యం తప్పకుండా ఉండాలి. ఇటువంటి జోక్యం ఉండాలంటే ప్రభుత్వం ఆహార ధాన్యాల ధరలను కూడా నియంత్రించాలి. వాటిని స్వేచ్ఛా మార్కెట్‌ శక్తులకు విడిచిపెట్టకూడదు.

మన దేశంలో చాలా దశాబ్దాల కృషి తర్వాత ఒక వ్యవస్థ ఉనికి లోకి వచ్చింది. అందులో కనీస మద్దతు ధరలు, సేకరణ విధానం, పంపిణీ విధానం, ఆహార సబ్సిడీలు వంటివి ఉన్నాయి. స్వేచ్ఛా మార్కెట్‌ వలన వచ్చే సామాజిక వినాశనాన్ని నివారించి ఒక హేతుబద్ధమైన పరిస్థితిని తీసుకురావడానికి ఈ వ్యవస్థ దోహదం చేస్తుంది. దీనిని పూర్తిగా వ్యతిరేకించే పశ్చిమ దేశాలు మనం ఆ దేశాల భిక్ష మీదనే ఆధారపడాలని కోరుకుంటున్నాయి. కేవలం తమ స్వలాభం తప్ప ఇంకేమీ పట్టని మన స్వదేశీ కార్పొరేట్లు కూడా ఈ ప్రజాహిత వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాయి. మన ఆహారధాన్యాల మార్కెట్‌ను సైతం కొల్లగొట్టి సొమ్ము చేసుకోవాలని అర్రులు చాస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ఆ కార్పొరేట్ల కోసం, సామ్రాజ్యవాదులను సంతృప్తిపరచడం కోసం మన ప్రజాహిత వ్యవస్థను చట్టాల ద్వారా ధ్వంసం చేయడానికి సిద్ధమైంది.

Courtesy Prajashakti

Search

Latest Updates