మోడీ హయాంలో ముస్లింలపై పెరిగిన దాడులు

Published on

భారత్‌లో మైనార్టీల హక్కులకు పెరిగిన ముప్పు
సౌత్‌ ఏసియా స్టేట్‌ ఆఫ్‌ మైనార్టీస్‌ 2020 నివేదిక

న్యూఢిల్లీ : మోడీ సర్కార్‌ పాలనలో ముస్లింలపై దాడులు పెరిగాయని, భారత్‌లో మైనార్టీల పౌర హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో పడ్డాయని ‘సౌత్‌ ఏసియా స్టేట్‌ ఆఫ్‌ మైనార్టీస్‌, 2020’ నివేదిక తేల్చింది. గత కొన్నాండ్లుగా భారతీయ ముస్లీంలు హింసకు గురవుతున్నారని, ఆందోళన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని, దీనిని…పౌరసత్వ సవరణ చట్టం మరింత తీవ్రతరం చేసిందని నివేదిక అభిప్రాయపడింది. పౌర హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను ముస్లిం మైనార్టీలు ఆయా దేశాల్లో ఏ స్థాయిలో పొందుతున్నారనే విషయంపై దక్షిణాసియా దేశాల్లో అధ్యయనం జరిపి ఈ నివేదికను రూపొందించారు. ఆసియా దేశాలైన ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఇండియా, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంకలో అధ్యయనం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కులు ప్రమాదంలో పడ్డాయని నివేదికలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయితే భారత్‌ విషయానికొస్తే, ముస్లిం, క్రిస్టియన్‌, దళితుల పౌర హక్కులు ప్రమాదంలో పడ్డాయని, గత కొన్నేండ్లుగా మైనార్టీలను లక్ష్యంగా చేసుకోవటం పెరిగిందని నివేదిక తెలిపింది. మోడీ సర్కార్‌ పౌరసత్వ సవరణ చట్టం చేయటం ద్వారా ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నదని, జాతీయ పౌర జాబితా రూపకల్పన అన్నది ముస్లింల మనుగడను మరింతగా ప్రమాదంలో పడవేసిందని నివేదిక తెలిపింది.

విద్వేష ఘటనలు పెరిగాయి..
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో ముస్లింలపై విద్వేష ఘటనలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. క్రిస్టియన్లు, దళితులు, ముస్లింలపై మూకదాడులు జరుగుతున్నాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ అత్యంత వివాదాస్పద చట్టాల్ని చేస్తోంది. మత మార్పిళ్ల పేరుతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. అతివాద హిందూత్వ సంస్థలు విద్వేష ప్రచారాన్ని చేపడుతున్నాయి. ముస్లింలు, దళితులను లక్ష్యంగా చేసుకొని సుమారుగా 60వరకు గోరక్షణ చట్టాలు చేశారు.

Courtesy Nava Telangana

Search

Latest Updates