కార్పొరేట్ మీడియా కపటనాటకం

Published on

డి. పాపారావు

దేశ రాజధాని ఢిల్లీని చుట్టు ముట్టిన రైతుల ఆందోళన 20వ రోజుకు చేరింది. కేంద్రం ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులనూ, విద్యుత్‌ చట్టాన్ని రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర పెద్దలకు రైతులకు ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి. అయితే, రైతులు ఈ చట్టాల రద్దుకు మినహా మరి దేనికీ ఒప్పుకోమంటూ , దృఢంగా నిలబడడంతో – చర్చలు ఫలించలేదు.

కాగా, ఇక్కడ ఒక ప్రధాన ప్రశ్న ఈ అంశంలో మీడియా పాత్ర. దీనికి సంబంధించి రైతులు, ప్రజానీకంలోని పెద్ద వర్గం ఇప్పటికే ఆగ్రహంలో ఉన్నారు. స్థూలంగా కోటి మందికి పైగా రైతులు పాల్గొంటున్నారని చెబుతోన్న ఈ ఆందోళనను – మీడియా తగిన మేరకు కవర్‌ చేయడం లేదనేది నిజం. ఈ నేపధ్యంలోనే కొన్ని ఆంగ్ల పత్రికల పాత్రను ఇక్కడ చూడవచ్చు. ఉదాహరణకు ఒక ఆంగ్ల భాషా వాణిజ్య పత్రిక ప్రకారంగా – ఈ ఆందోళనలో ప్రధాన భాగస్వాములు పంజాబ్‌ రైతులే.. కాకుంటే హర్యానా రైతులు కూడా… వీరు దేశంలోని ఇతర రాష్ట్రాల రైతుల కంటే ”సుసంపన్నం”గా ఉన్నారట. వీరు ప్రభుత్వాల చేత అతిగా గారాబం చేయబడుతున్నారంట! అందుకే ఆ రాష్ట్రాల రైతులు చిన్న విషయాలకు కూడా నిరసనలకు దిగుతున్నారంటూ అదే పత్రిక సెలవిచ్చింది. ఈ రైతులు ”సుభిక్షం”గా ఉండటం – ఇతర రాష్ట్రాల వారి రైతు సోదరుల కడగండ్లకు కారణం అంటూ పరోక్షంగా ఆరోపించింది !

అయితే రైతు వ్యతిరేకమైన ఉదారవాద సంస్కరణలకు అనుకూలమైన ఈ నిందారోపణల వెనుక ఉన్న అసలు సత్యం ఏమిటి? కొంచెం పాత గణాంకాలే అయినా 2013 జనవరి – డిసెంబర్‌ తాలూకు దేశంలోని వివిధ రాష్ట్రాల రైతు కుటుంబాల సగటు ఆదాయాలను చూద్దాం. ఈ ఆదాయం నెలవారి, పంజాబ్‌లో రూ.18,059 ఉంది. హర్యానాలో ఈ నెలవారి ఆదాయం రూ.14,434, కాగా దేశంలోని పేద రాష్ట్రాలు అయిన బీహార్‌లో రూ.3,558 గాను, ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.4701, జార్ఖండ్‌లో రూ.4721, ఉత్తరాఖండ్‌లో రూ.4923, పశ్చిమ బెంగాళ్‌లో రూ.3980గా ఉంది. అంటే దేశంలోని అత్యధిక పేద రాష్ట్రాల రైతు కుటుంబాల నెలవారి సగటు ఆదాయం రూ.5000 లోపుగానే ఉంది. దేశవ్యాప్తంగా సగటు రైతు కుటుంబాల ఆదాయం చూస్తే అది ఈ 2013లో రూ.6426గా ఉంది. ఇక ఈ ఆదాయాలు 2018 – 2019 అంచనాల ప్రకారం వివిధ రాష్ట్రాలలో సగటున రూ.10329గా ఉన్నాయి. కాగా ఇక్కడ గమనించవలసినది ఇది రైతు కుటుంబ మొత్తం తాలూకు ఆదాయం. అంటే సాధారణ అంచనాల ప్రకారం సగటు కుంటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నట్లుగా లెక్కిస్తారు. అత్యధిక చిన్న, సన్నకారు, మధ్య తరహా రైతాంగ కుటుంబాల్లో – దరిదాపు కుటుంబ సభ్యులంతా తమ బతుకుతెరువైన సాగుబడిలో పాలుపంచుకుంటారు.

ఇక మరో పక్కన ఈ పరిస్థితిని, నగర ప్రాంతాల కార్మికుల, ఉద్యోగుల పరిస్థితితో పోల్చి చూద్దాం. ఇక్కడ ”2019 వేతన చట్టం” ప్రకారంగా దేశవ్యాప్తంగా కనీస వేతనం రోజువారీ రూ.178గా ఉండాలి. ఇది తలసరి సగటు అనే విషయం మనం మరువరాదు. అంటే కుటుంబ సభ్యులలోని ఇద్దరు గనుక కూలిపని చేస్తే దొరికేది రోజుకు సుమారుగా రూ.356 ఇది నెలకు రూ.10,700 మేరకు ఆదాయంగా ఉంటుంది. అయితే, కనీస వేతనంగా రూ.178ని నిర్ణయించడానికి వ్యతిరేకంగానే బలమైన వాదనలు ఉన్నాయి. నిజానికి కార్మిక మంత్రిత్వశాఖ తాలూకు అత్యున్నత ప్యానల్‌ సిఫార్సు ప్రకారమే ఈ కనీస వేతనం రోజుకు తలకు రూ.375గా ఉండాలి. మరో ప్రక్కన ఏడవ కేంద్ర వేతన సంఘం లెక్కల మేరకు న్యాయబద్ధమైన రోజువారీ వేతనం కనీసం రూ.700గా ఉండాలి. ఈ చివరి సూచన ప్రకారమే చూసినా నగర ప్రాంతాలలో కుటుంబంలోని ఒక్కరు పనిచేసినా నెలవారీ ఆ కుటుంబానికి రూ.21,000 మేర ఆదాయం ఉండాలి. అంటే ప్రస్తుత కనీస వేతన ప్రకారం (రూ.178) కుటుంబంలో ఒక్కరు ఉపాధిలో ఉన్నా ఆ కుటుంబ నెలవారీ ఆదాయం సుమారుగా రూ.5340గా ఉండాలి. ఈ రకంగా చూస్తే దేశంలోని అత్యధిక రాష్ట్రాలలో – రైతు కుటుంబాలలోని వారు మొత్తం పని చేస్తే వచ్చే ఆదాయాలు రూ.5000 లోపుగానే ఉన్నాయి అనేది గమనార్హం. అందుచేత కేవలం పంజాబ్‌, హర్యాన రైతుల ఆదాయాలను, దుర్భర దారిద్య్రంలో వున్న ఇతర రాష్ట్రాల రైతాంగం ఆదాయాలతో పోల్చి ఆ రెండు రాష్ట్రాల రైతులు గారాబం చేయబడ్డారంటూ.. అందుకే వారు చీటికీ మాటికీ నిరసనలకు దిగుతున్నారంటూ విమర్శించటం పరిహాసాస్పదం.

వాస్తవానికి, ప్రస్తుతం దేశంలోని మెజారిటీ రాష్ట్రాల రైతాంగానికి కనీస స్థాయిలో కావాల్సింది పంజాబ్‌, హర్యానా రైతుల తాలూకు ఆదాయ స్థాయి. అంతేగానీ, కుటుంబం మొత్తం పని చేసి కూడా – అంతంత మాత్రం ఆదాయంతోనే బతుకుతున్న పంజాబ్‌, హర్యానాల చిన్న, సన్నకారు, మధ్యస్థాయి రైతుల ఆదాయాలు కూడా – పేద రాష్ట్రాల రైతుల ఆదాయస్థాయి కంటే ఎక్కువే అంటూ విలపించటం తగదు. ఈ తరహా మీడియా పేర్కొంటున్నట్టుగా పంజాబ్‌, హర్యానా రైతులే గనుక – గారాబం చేయబడ్డ, అధిక ఆదాయాల వారై ఉంటే, వారు కూడా ఇతర రాష్ట్రాల రైతులలాగానే వ్యవసాయం కోసం చేసిన అప్పులను తీర్చలేక రుణ మాఫీల కోసం ఎందుకు అడగవలసి వస్తోందో ఈ మీడియా ఆలోచించాలి. పంజాబ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు రుణ మాఫీ జరిగినా ఆ రాష్ట్ర రైతాంగం ఇంకా కడగండ్లలోనే ఉందంటే కారణం ఏమిటో కూడా ఆలోచించాలి. రాను రాను, సంవత్సర సంవత్సరానికి రైతులు వ్యవసాయంలో వాడే ఉత్పాదకాల వ్యయం పెరిగిపోతోంది. మరో పక్కన, ప్రభుత్వం ధాన్యం బాగానే సేకరిస్తోన్నా ఈ సోకాల్డ్‌ ధనిక రాష్ట్రాలలో కూడా రైతాంగానికి దొరికే కనీస మద్దతు ధర మాత్రం తగినంత వేగంగా పెరగడం లేదు. ఈ ఆదాయ వ్యయాల వ్యత్యాసం పెరిగిపోతోండటంతో – వ్యవసాయం సంవత్సర సంవత్సరానికీ, రైతాంగానికి భరించనలవికానిదిగా మారిపోతోంది.

ఈ పై కారణాల వల్లనే, ప్రఖ్యాత పాత్రికేయులు, వ్యవసాయ నిపుణుడైన పి. సాయినాధ్‌ ప్రకారంగా ఈ దేశంలోని రైతాంగం 1971లో ఒక క్వింట పత్తిని అమ్మితే 15గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయగలిగే వాళ్ళు. కాగా నేడు ఎన్ని క్వింటాల పత్తిని అమ్మితే 10గ్రాముల బంగారాన్ని రైతు కొనగలడు అనేది ఇక్కడ ప్రశ్న. అంటే, రాను రాను దేశంలోని గ్రామీణ ప్రాంతాల రైతాంగానికి లభించే ఆదాయాల స్థాయి పడిపోతోంది. ఇటువంటి పరిస్థితికి దారి తీసిన స్థితిని – నగర ప్రాంతాలకు అనుకూలంగానూ , గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగానూ ”వాణిజ్య లావాదేవీల సమతుల్యత” రోజు రోజుకూ మొగ్గుతుండటంగా చెప్పవచ్చు. అంటే ఒక పక్కన గ్రామీణ వ్యవసాయదారులు ఉత్పత్తి చేసే ఉత్పత్తిల ధరలు పడిపోతుండగా, రెండో పక్కన దీనితో పోలిస్తే నగర ప్రాంతాల పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు పెరుగుతోండటం. ఈ పరిణామం ఏమీ సహజ సిద్ధంగా జరుగుతున్నది కాదు. స్థూలంగా ఆర్థిక సంస్కరణల పేరిట నడుస్తున్నదే కార్పొరేట్ల, నగర ప్రాంతాల అనుకూల విధానాలు. ఈ విధానాల కారణంగానే , గ్రామీణ ఉత్పత్తుల ధరలను పెరగకుండా కృత్రిమంగా అదుపు చేస్తున్నారు. దీనంతటికీ కారణం గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గనుక పెరిగితే, నగర ప్రాంతాలలో నిత్యావసరాల ధరలు హెచ్చుగా ఉంటాయి (ఇక్కడ మధ్య దళారుల పాత్రను కాసేపు ప్రక్కన పెడదాం). ఇదంతా నగర ప్రాంతాలలో నిత్యవసరాల ధరలు ఒక పరిమితికి దాటకుండా అదుపు చేయటం ద్వారా, నగర ప్రాంతాలలోని మధ్య తరగతి వారు, కార్మికులు అధిక వేతనాల కోసం కార్పొరేట్లను డిమాండ్‌ చేయకుండా బుజ్జగించేందుకే. తద్వారా కార్పొరేట్లు తాము చెల్లించే వేతన బిల్లులను తక్కువగా ఉంచి, వారి లాభాలను పెంచుకోగలరు. ఇక రెండవ కారణం, గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకు నిరంతరంగా కార్మికుల సరఫాను హామీ చేయటం. దీనికి గాను, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలసలు ఉండాలి. ఇది గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం లాభసాటిగా ఉంటే జరగదు. అటువంటి స్థితిలో గ్రామీణ పేదలు, చిన్న రైతులు అంత సులువుగా నగర ప్రాంతాలకు వలస వెళ్ళరు. ఇదే జరిగితే, నగర ప్రాంతాలలో కార్మికుల, ఉద్యోగుల కొరత ఏర్పడి, వారికి డిమాండ్‌ పెరిగి – అది కార్పొరేట్లపై అధిక వేతనాల డిమాండుకు దారి తీస్తోంది. దీని సారాంశం, నగర ప్రాంతాలకు నిరంతర కార్మికుల సరఫరా ఉండి, వారి సరఫరా స్థాయి – కార్పొరేట్ల డిమాండ్‌స్థాయి కంటే అధికంగా ఉంటేనే కార్మికులు, ఉద్యోగుల వేతన డిమాండ్లను నియంత్రించడం కార్పొరేట్లకు సాధ్యం అవుతుంది. ఇక్కడ ఓ చిన్న ఉదాహరణ, ఇంగ్లాండ్‌లో బలమైన భూస్వామ్య వ్యవస్థ స్థానంలో, పెట్టుబడిదారి పారిశ్రామిక ఉత్పత్తి ఎదిగి, బలపడిన కాలం. ఆ దేశంలో భూస్వామ్య, ఫ్యూడల్‌ వ్యవస్థ బలంగా ఉండగా ”మొక్కజొన్న చట్టం” అనేది ఉండేది. దీని ఉద్దేశ్యం ఇతర దేశాల నుంచి ఇంగ్లాండ్‌లోకి మొక్కజొన్నల దిగుమతిని నియంత్రించడం. తద్వారా ఇంగ్లాండ్‌లోని మొక్కజొన్న రైతులకు మంచి ధర పలికేలా హామీ చేయడం. కాగా, ఎప్పుడైతే ఇంగ్లాండ్‌లో – పారిశ్రామిక ఉత్పత్తి పెరిగిందో, నగర ప్రాంతాలు బలపడ్డాయో – అప్పుడు ఈ ”మొక్కజొన్న చట్టం” రద్దు దిశగా ఒత్తిళ్ళు సాగాయి. అంతిమంగా ఆ చట్టం రద్దయ్యింది. దీనికి కారణం సరళం. అది, నాడు పారిశ్రామిక ఉత్పత్తి పెరిగి, నగరాలు విస్తరించనారంభించిన ఇంగ్లాండ్‌లోని – నగర ప్రాంతాల కార్మికులు, ఉద్యోగు లకు తక్కువ ధరలకు మొక్కజొన్న లభించేలా హామీ చేయడం. దీని కోసమే మొక్కజొన్న చట్టం రద్దు చేసి, ఇతర దేశాల నుంచి ఇంగ్లాండ్‌కి మొక్కజొన్న దిగుమతులను కొత్తఅధికార (పారిశ్రామిక) వర్గం అనుమతించింది. తద్వారా దేశంలో మొక్కజొన్న సరఫరాను పెంచి దాని ధర పడిపోయేలా చేసింది. నేడు మన దేశంలో జరుగుతోందీ అదే ! కాకులను కొట్టి గెద్దలకు వేసినట్టు – గ్రామీణ రైతాంగాన్ని దెబ్బతీసి, నగర ప్రాంతాల కార్పొరేట్లకు అనుకూల విధానాలను అనుసరించటం నేటి ఆర్థిక సంస్కరణ పర్వంలో ఒక భాగం. అలాగే ఈ క్రమంలో నష్టపోయిన రైతాంగాన్ని, వ్యవసాయం నుంచి వైదొలిగేలా చేసి – ఆ స్థానంలో రక్తపాత రహితంగానే కార్పొరేట్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అనేది ఈ విధానాల తాలూకు రెండవ పార్ష ్వం. అదీ కథ.
ఈ కారణాల చేతనే మన దేశవ్యాప్తంగా ఉన్నట్లే పంజాబ్‌, హర్యానాలోని పిల్లలలోనూ సరైన ఆహారం లేక శారీరక ఎదుగుదల తక్కువస్థాయిలో ఉండటం కనబడుతోంది. ఉదాహరణకు దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో సగటున 50శాతం మంది పిల్లలు తమ వయసుకు తగ్గ ఎత్తులేరు, అలాగే వారు తమ ఎత్తుకు తగిన శరీర బరువుని కూడా కలిగి లేరు. కాగా ఈ గణాంకం దేశంలోని నగర ప్రాంతం సుమారుగా 40శాతం ఉంది. అయితే, పంజాబ్‌ హర్యానాలలోని ”ధనిక” గ్రామాలలోనూ పరిస్థితి ఏమీ మెరుగు కాలేదు. హర్యానాలోని గ్రామీణ ప్రాంతాలలో 48శాతం మంది పిల్లలు తమ వయసుకు తగ్గ ఎత్తూ , ఎత్తుకు తగ్గ బరువు లేరు. ఇక పంజాబ్‌లోని గణాంకం 38శాతంగా ఉంది.

స్థూలంగా, కార్పొరేట్‌ అనుకూల, సంస్కరణల అనుకూల మీడియా – కోవిడ్‌ ఆరోగ్య సంక్షోభ కాలంలోనూ, అంతకు ముందరా కూడా ఒక ప్రక్కన సామాన్య ప్రజల ఆదాయాలు పడిపోతూ, మరో ప్రక్కన కొత్తగా బిలియనీర్లు పుట్టుకొస్తుండగా కూడా, అలాగే ధనవంతులు మరింత ధనవంతులు అవుతుండగా కూడా వేలెత్తి చూపలేదు. అందరి ఆదాయాలు పడిపోతున్న కాలంలో, ఈ పిడికెడు మంది కొత్త ధనవంతులు ఎక్కడ నుంచి పుట్టుకొస్తున్నారని ప్రశ్నించలేదు. కానీ, కోట్లాదిమంది సాధారణ రైతులు – తమ జీవన స్థితిగతులను నేడు పెనం మీద ఉన్న స్థితి నుంచి, పొయ్యిలోకి నెట్టొద్దంటూ ఢిల్లీని చుట్టుముట్టుతుంటే.. ప్రశ్నిస్తుంటే.. ఈ మీడియాకు కంపరంగా ఉంది…!! ఈ నేపధ్యంలోనే ఇటువంటి మీడియా గురించి శ్రీశ్రీ మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవచ్చు – ”పెట్టుబడికీ కట్టుకథకీ పుట్టిన విష పుత్రికలు ఈ పత్రికలు” అని ఆయన చురక అంటించాడు…!!

Courtesy Nava Telangana

Search

Latest Updates