ఆదిమ తెగ గిరిజనులకు ‘అంత్యోదయ కార్డులేవీ’ ?

Published on

రాజమహేంద్రవరం :  ‘ఒకే దేశం  ఒక రేషన్‌ కార్డు’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఊదరగొడుతున్నా సమాజంలో అట్టడుగున వున్న ఆదిమ తెగ గిరిజనులకు రేషన్‌ కార్డులు సైతం లేని దుస్థితి నెలకొనడం విషాద వాస్తవం. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో ఆదిమ తెగ గిరిజనుల (పర్టిక్యులర్‌ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌ – పివిటిజి) గుర్తింపు కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వేలో విస్తు గొలిపే నిజాలు వెల్లడయ్యాయి. నిబంధనల రీత్యా పివిటిజి కుటుంబాలకు అంత్యోదయ అన్న యోజన కార్డులివ్వాల్సి వుండగా ఏజెన్సీలో 3,661 కుటుంబాలకు (13.7%) నేటికీ ఆ కార్డులు లేవని సర్వేలో తేలింది. జిల్లాలో చింతూరు, రంపచోడవరం ఐటిడిఎ ప్రాంతాల్లో 26,569 పివిటిజి కుటుంబాలున్నట్లు అధికారులు గుర్తించారు. సర్వే ప్రకారం 69,649 మంది నివసిస్తున్నారని, ఇందులో 33,786 మంది పురుషులు, 35,865 మంది మహిళలు ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఆదిమ తెగలను గుర్తించి, వారి జీవన స్థితిగతులను తెలుసుకుని, వారి భవిష్యత్తు అవసరాలకు తగిన ప్రణాళికలు రూపొందించేందుకు తొలిసారిగా సాంకేతిక పద్ధతుల్లో సర్వే చేపట్టినట్టు అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, గ్రామ వాలంటీర్లతో ఈ సర్వే చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత విలీన మండలాలు జిల్లాలో కలవడంతో గిరిజన తెగల సంఖ్య జిల్లాలో పెరిగింది.

ప్రభుత్వ పథకాలకు దూరంగా!
అంత్యోదయ అన్న యోజన నిబంధనల ప్రకారం పివిటిజిలకు ఆ కార్డులు మంజూరు చేయాలి. కాని తూర్పుగోదావరి ఏజెన్సీలో 3,661 కుటుంబాలకు ఆ కార్డులు లేవని సర్వేలో స్పష్టమైంది. అంటే దాదాపు ప్రతి ఏడు కుటుంబాల్లో ఒక కుటుంబానికి ఎఎవై కార్డు లేదన్నమాట. ‘ఒకే దేశం- ఒకటే కార్డు’ అని మోడీ ప్రభుత్వం గొప్పలు చెబుతోంటే ఆచరణలో నిరుపేదల స్థితి ఇలా వుందన్నమాట. అయితే, వీరిలో 1,501 కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డులుండడం కొంత ఊరట. అలా లెక్కేసినా ఇంకా 2,160 కుటుంబాలకు నేటికీ ఎలాంటి రేషన్‌ కార్డులు లేవు. కనీసం ఆహార భద్రత లేని కుటుంబాలు 2,457 ఉన్నట్టు సర్వేలో తేలింది. ఆధార్‌ కార్డులేని వారు 4,788 వరకూ ఉండగా, 2,826 మందికి బ్యాంక్‌ ఖాతాల లేవు. వీటితోపాటు గిరిజనుల జీవన విధానం, వారికున్న వ్యవసాయ పద్ధతులు, అందుతున్న మౌలిక సదుపాయాలను గుర్తించామని, వీటి ఆధారంగా ప్రణాళికలు రూపొందించి పివిటిజిల భవిష్యత్తు అవసరాలు తీరుస్తామని రంపచోడవరం ఐటిడిఎ ఎపిఒ వెంకటస్వామినాయుడు ‘ప్రజాశక్తి’కి తెలిపారు. అంత్యోదయ కార్డుల మంజూరుకు తగు చర్యలు తీసుకుంటామని అధికార్లు చెప్పారు.

సర్వేలో వెల్లడైన పివిజిటిల వివరాలు కొన్ని ...
ప్రభుత్వ పథకాలు                               రంపచోడవరం                    చింతూరు
కనీస అవసరాలు                            ఐటిడిఎ పరిధిలో                ఐటిడిఎ పరిధిలో        మొత్తం
పివిటిజి కుటుంబాలు                          24,847                        1,722                    26,569
జనాభా                                           64,862                         4,787                   69,649
అంత్యోదయ కార్డులున్న కుటుంబాలు     21,432                         1,476                  22,908
ఏ రేషన్‌ కార్డు లేని కుటుంబాలు            1,938                            222                     2,160
ఆధార్‌ పొందని వారు                           4,141                            647                    4,788
బ్యాంక్‌ ఖాతాలు లేనివారు                  2,562                              264                    2,826

Courtesy Prajashakti

Search

Latest Updates