నీటిలో మునిగి తొమ్మిది మంది మృతి

Published on

చెరువు దగ్గర సెల్ఫీ దిగుతూ నీళ్లలో పడి..  ముగ్గురు బాలికలు మృతి

నిజామాబాదు: ఎడపల్లి మండలం అలీసాగర్ లో విషాధ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సెలవు రోజున సరదాగా గడిపేందుకు వచ్చిన ముగ్గురు బాలికలు చెరువులో పడి మృతి చెందారు. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు బాలికలు బోధన్ రాకాసిపేట్ లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. బంధువుల ఇంటికి వచ్చిన సందర్భంగా బోధన్ కు చెందిన తమ బంధువుల అమ్మాయితో కలసి ముగ్గురు బాలికలు పార్కు చూసొస్తామని ఇంట్లో చెప్పి ఎడపల్లి మండలం అలీసాగర్ చెరువు వద్దకు వచ్చారు. సరదాగా సెల్ఫీ తీసుకుందామని ప్రయత్నించి ఒకరి వెనుక మరొకరు నీళ్లలో పడినట్లు స్థానికుల సమాచారం.  మృతులు జుబేరా (16), మాహెరా (14), మెహరాజ్ (12) అని చెబుతున్నారు. మృతులు ముగ్గురు దాదాపు ఒకే ఈడు వయసు బాలికలుగా కనిపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బర్త్ డే వేడుకల్లో విషాదం..ఈతకు వెళ్లిన నలుగురు యువకులు మృతి

ములుగు జిల్లా రంగరాయపురంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో ఈతకు వెళ్లి గల్లంతైన నలుగురి మృతదేహాలు గుర్తించారు. నిన్న ఇద్దరు,ఇవాళ మరో ఇద్దరి  మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదానికి ముందు నిన్న స్నేహితుడి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. నిన్నటి నుంచి గల్లంతైన వారి కోసం రాత్రంతా గాలించి ఇద్దరి మృతదేహాలను వేలికి తీయగా..ఇవాళ మరో ఇద్దరిని వెలికితీశారు.  మృతి చెందిన వారు శ్రీకాంత్, తుమ్మ కార్తీక్, అన్వేష్, ప్రకాష్‌లుగా గుర్తించారు.వీరంత వెంకటాపురం మండలం రంగరాయపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గోదావరి తీరం కుటుంభ సభ్యుల ఆర్తనాదాలతో నిండిపోయింది.

పండుగ పూట విషాదం.. చెక్‌డ్యామ్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి

సంగారెడ్డి: దీపావళి పండుగ వేళ సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్ర‌మాద‌వ‌శాత్తు చెక్‌డ్యామ్‌లో పడి మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని న్యాల్కల్ మండలం రేజింతల్‌లో జ‌రిగింది. పండుగ పూట ఆ కుటుంబం తమ ఇద్దరు చిన్నారులనూ కోల్పోయింది. రేజింతల్‌లో స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు చెక్‌డ్యామ్‌లో జారిపడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందులో ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్ల కావడంలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Search

Latest Updates