నోట్లరద్దుతో మోడీ సాధించిందేమిటి?

Published on

ప్రభాత్‌ పట్నాయక్‌
ప్రభాత్‌ పట్నాయక్‌

నోట్లరద్దు చేసి నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా నల్లధనానికి కళ్ళెం వేశామంటూ ప్రధాని మోడీ మరోసారి చెప్పుకున్నారు. కాలం గడిచిపోయినకొద్దీ ప్రజలు వాస్తవాలు మరిచిపోయే వీలుంది గనుక ఇటువంటి ప్రకటనలు చేసినా అడ్డు చెప్పేవారు ఉండకపోవచ్చునని బహుశా మోడీ భావిస్తూ ఉండొచ్చు. కానీ దేశంలో చాలామందికి ఇది అబద్ధం అని స్పష్టంగా తెలుసు.

నల్లధనాన్ని అదుపు చేయడానికే పెద్దనోట్ల రద్దు చేపట్టామని ఆనాడు ప్రకటించారు. నల్లధనాన్ని పెద్దనోట్ల రూపంలో దాచుకునే వారంతా ఇకపైన ఆ నోట్లు చెల్లకుండా పోతాయి గనుక వాటిని కొత్తనోట్లతో మార్పిడి చేసుకోడానికి బైటకు తీయాల్సిందేనని, ఆ సందర్భంలో వారికి ఆ ధనం ఏ విధంగా వచ్చిందో వెల్లడి చేయాల్సిందేనని, అప్పుడు వారి అక్రమాలు వెలుగు లోకి వస్తాయని మోడీ ప్రకటించారు. ఒకవేళ దొరికిపోకుండా ఉండేందుకు వారు గనుక ఆ నల్లధనాన్ని కొత్తనోట్లతో మార్పిడి చేయకుండా వదిలేస్తే అవి చెల్లకుండా పోతాయని, ఆ మేరకు మార్కెట్‌లో నల్లధనం చలామణీ కాకుండా నిలిచిపోతుందని వివరించారు. ఏ విధంగా చూసినా, పెద్దనోట్ల రద్దు నల్లధనం మీద ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం వంటిదని చెప్పుకున్నారు.

చలామణీలోకి రాకుండా నల్లధనం గనుక ”చచ్చిపోతే” (అంటే కొత్త నోట్లతో మార్చుకోకుండా విడిచిపెట్టేస్తే) ఆ మేరకు రిజర్వు బ్యాంకు కొత్త నోట్లను ముద్రించి దానిని ప్రభుత్వానికి అందించవచ్చునని, అలా సమకూరిన ధనంతో ప్రభుత్వం పేదలను ఆదుకోవచ్చునని కూడా ప్రచారం చేసుకున్నారు. ఈ నోట్ల రద్దు మీద బీజేపీ ఎంత ఆశలు పెట్టుకుందో ఆనాడు వారు చేసిన ప్రచారం బట్టి చెప్పవచ్చు. కనీసం మూడు, నాలుగు లక్షల కోట్ల రూపాయలను పేదలకు పంచిపెడతామని ఆ కాలంలో చెప్పుకున్నారు. అయితే, రద్దయిన నోట్లలో 99.3శాతం నోట్లు తిరిగి చలామణీలోకి వచ్చాయి. అంటే దాదాపు పాత నోట్లేవీ చచ్చిపోలేదు. మొత్తానికి నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని అరికడతామనే బీజేపీ ప్రభుత్వ ప్రయత్నం ఓ పెద్ద ప్రహసనంగా మారింది.

అక్కడితో దాని ప్రభావం పరిమితం అయివుంటే మనం ఇప్పుడు ఇంత చర్చ చేయనవసరం లేదు. ఈ నోట్ల రద్దు అసంఘటిత రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. మన దేశంలో ఉపాధి కల్పనలో 85శాతం వ్యవసాయ రంగం, అసంఘటిత రంగం- ఈ రెండు రంగాల నుండే ఉంది. జీడీపీలో 45శాతం ఈ రెండు రంగాలదే. నోట్ల రద్దు దెబ్బకు ఈ రెండు రంగాలూ తీవ్రంగా దెబ్బ తిన్నాయి.

ట్రంప్‌ మాదిరిగానే, మోడీ కూడా తన ఓటమిని తొందరగా ఒప్పుకోరు. నల్లధనాన్ని అదుపు చేయగలిగానని మళ్ళీ చెప్పుకోవడంతోబాటు దేశంలో అసంఘటిత రంగాన్ని నాశనం చేయడాన్ని కూడా తన ఘనతగా చెప్పుకుంటున్నారు మోడీ. వెంటనే ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కె.సుబ్రమణియన్‌ మోడీ వాదనను బలపరుస్తూ ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ పత్రికలో వ్యాసం రాశారు. ఆర్థిక వ్యవస్థను సంఘటిత పరచడంలో విజయం సాధించామని వారు చెప్పుకున్నారు. అంటే అసంఘటిత ఆర్థిక వ్యవస్థస్థానే సంఘటిత ఆర్థిక వ్యవస్థ మరింత పెరిగిందన్నమాట. ఇలా జరగడం ఒక ముందడుగుగా చెప్పుకుంటున్నారు. కాని వాస్తవానికి అది మన ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద సమస్యగా పరిణమించిన విషయం.

ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం స్థానే సంఘటిత రంగం పెరగడం ఫలితంగా ఉపాధి అవకాశాలకు ఎటువంటి నష్టమూ వాటిల్లకుండా ఉంటేనే అది అభివృద్థి అని చెప్పగలుగుతాము. నోట్లరద్దు పర్యవసానంగా అసంఘటిత రంగం దెబ్బ తిని దాని ఫలితంగా నష్టపోయిన ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువ. ఆ స్థానే సంఘటిత రంగంలో వచ్చిన కొత్త ఉపాధి అవకాశాలు చాలా తక్కువ.

ఉదాహరణకు వాల్‌మార్ట్‌నే తీసుకోండి. రిటైల్‌ వ్యాపారంటో వాల్‌మార్ట్‌ విస్తరణ వలన సంఘటిత రంగం బలపడింది. నగదు ద్వారా జరిగే లావాదేవీలు తగ్గాయి. దానికి బదులు క్రెడిట్‌కార్డు ద్వారా జరిగే లావాదేవీలు పెరిగాయి. జమా ఖర్చుల లెక్కలు మరింత పకడ్బందీగా జరుగుతున్నాయి. దీని వలన పన్నుల ఎగవేత తగ్గుతుందని చెప్తున్నారు. కాసేపు ఆ అభిప్రాయం సరైనదేననుకుందాం. అయితే ఈ విధంగా వాల్‌మార్ట్‌ బలపడిన కారణంగా అసంఘటిత రంగంలో దెబ్బ తిన్న ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో కనీసం ఆమేరకు వాల్‌మార్ట్‌ తన వద్ద ఉపాధి అవకాశాలను అదనంగా కల్పించగలిగిందా అన్నది ప్రశ్న. కాని ఈ విషయంలో మోడీ ప్రభుత్వం మౌనంగా ఉంది. మన ముఖ్య ఆర్థిక సలహాదారు సంఘటిత రంగంలో పెరిగిన ఉద్యోగావకాశాల గురించే మాట్లాడుతున్నారు తప్ప అసంఘటిత రంగం కోల్పోయిన ఉపాధి అవకాశాల గురించి మాత్రం నోరు విప్పడం లేదు. అసంఘటిత రంగంలో కోల్పోయిన ప్రతీ 100 ఉద్యోగాలకు సంఘటిత రంగం 50ఉద్యోగాలను మాత్రమే కల్పించిందన్నది ఇక్కడ మనం గమనించాల్సిన వాస్తవం.

మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక విషయంలో దేశంలో ఏకాభిప్రాయం ఉంటూ వచ్చింది. అసంఘటిత రంగంలోని ఉపాధి అవకాశాలు దెబ్బ తినకుండా చూడాలన్నదే ఆ విషయం. ఆచరణలో దానిని ఉల్లంఘించడం జరిగిందన్నది వేరే సంగతి. ఈ ఏకాభిప్రాయం ఆధారంగానే చేనేత వంటి కొన్ని రంగాలలో జరిగే ఉత్పత్తిని సంఘటిత రంగంలో చేపట్టకుండా చేనేత రంగానికే రిజర్వు చేశారు. గాంధీజీ ఈ కారణంగానే చేతివృత్తులను ప్రోత్సహించాలని అభిలషించారు. పారిశ్రామిక రంగ అభివృద్ధికి పెట్టుబడులను మళ్ళించినప్పుడు వినిమయ వస్తువులకు కొరత ఏర్పడుతుంది. ఈ కొరతను పూడ్చడానికి, ఉపాధి కల్పించడానికి వికేంద్రీకరణను, చేతివృత్తులను ప్రోత్సహించాలని మహల్‌నోబిస్‌ తన వ్యూహరచనలో పేర్కొన్నారు. ఉత్పత్తి వికేంద్రీకరణను వామపక్షాలు ఎప్పుడూ బలపరుస్తూ వచ్చాయి. అందుకే చాలా బలంగా అవి వాల్‌మార్ట్‌ వంటి సంస్థలు ఈ దేశంలోకి అడుగు పెట్టకూడదని, అవి గనుక ప్రవేశిస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు చాలా దెబ్బ తింటాయని వాదించాయి.

ఇలా అసంఘటిత రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను కాపాడుకోవాలనే వైఖరిని దాదాపు అందరూ బలపరిచారు. కాని అసంఘటిత రంగంలోని ఉపాధి అవకాశాలను ఏమాత్రం పట్టించుకోకుండా, దానివలన పెరిగే నిరుద్యోగాన్ని సైతం పట్టించుకోకుండా సంఘటిత రంగం బలపడాల్సిందేనన్న వైఖరిని తీసుకున్న మొట్టమొదటి పార్టీ బీజేపీ. అసంఘటిత రంగం మీద వరుసగా దాడి చేయడం ఈ ప్రభుత్వపు ప్రధాన స్వభావంగా మారింది. అది నోట్లరద్దు గాని, జీఎస్‌టీ అమలుగాని, వ్యవసాయ చట్టాలు గాని-అన్నీ నిరుద్యోగాన్ని పెంచే చర్యలే. ఆర్థిక విషయాల్లో మోడీ ప్రభుత్వానికి ఎంత పరిజ్ఞానం ఉందో అందరికీ ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. కాని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుకు సైతం ఈ విషయం పట్టలేదంటే దానిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?

ఇక సంఘటిత రంగం పెరిగితే నల్లధనం అదుపు సుసాధ్యం అన్న వాదనకు కూడా ఎటువంటి ఆధారమూ లేదు. నగదు లావాదేవీలకు బదులు డిజిటల్‌ లావాదేవీలు, చెక్కుల ద్వారా లావాదేవీలు జరపడం వలన పర్యవేక్షణ నుంచి తప్పించుకోవడం కష్టం అవుతుందని, అందువలన నల్ల ధనం అదుపులోకి వస్తుందని ప్రభుత్వ సమర్థకులు అంటున్నారు. నోట్లరద్దు కారణంగా దేశంలో నగదు లావాదేవీలు తగ్గిపోయినట్టు, అదొక విజయంగా మోడీ స్వయంగా ప్రకటించారు.

అయితే, నగదు లావాదేవీలు తగ్గితే నల్లధనం తగ్గుతుందనడానికి ఎటువంటి ఆధారాలూ లేవు. జర్మనీ, జపాన్‌ వంటి దేశాల్లో నేటికీ నగదు లావాదేవీలే ప్రధానంగా నడుస్తున్నాయి. మరి అక్కడున్న నల్లధనం మన దేశంలోని నల్లధనం కన్నా ఎక్కువ అని చెప్పడానికి ఎటువంటి ఆధారమూ లేదు. ఇక నైజీరియా వంటి దేశాల్లో నగదు లావాదేవీలు చాలా తక్కువ. అందువలన అక్కడ నల్లధనం తగ్గిపోయిందనడానికి కూడా ఎటువంటి ఆధారమూ లేదు. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడం పట్ల మోడీ ప్రభుత్వానికి గల మక్కువ గురించి మనకందరకూ తెలుసు. దానిని సమర్థించుకోవడానికి ఒక వాదనగా డిజిటల్‌ లావాదేవీలు నల్లధనాన్ని అదుపు చేస్తాయని చెప్పడం మాత్రం నిలబడే వాదన కాదు.

సంఘటిత రంగం పెరిగినందున నగదు లావాదేవీలు తగ్గిపోయాయన్న మోడీ, ఆర్థిక ముఖ్య సలహాదారుల వాదనలూ చెల్లవు. నోట్లరద్దు ఫలితంగా దేశంలో నగదు లావాదేవీలు తగ్గిపోయాయని చెప్పడం పూర్తిగా తప్పు. దానివలన అసంఘటిత రంగం తగ్గి సంఘటిత రంగం పెరిగింది కాని నగదు లావాదేవీలు ఏమాత్రమూ తగ్గలేదన్నది పచ్చి నిజం.

చలామణీలో ఉండే నగదుకు, జీడీపీకి మధ్య ఉండే నిష్పత్తి నోట్ల రద్దు జరిగిన వెంటనే తగ్గింది. కాని ఆ తర్వాత మళ్ళీ నోట్ల రద్దుకు పూర్వపు స్థితికే చేరుకుంది. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకు స్వయంగా అంగీకరించింది. ”చలామణీలో ఉండే నగదులో పెరుగుదల వేగం గతేడాది 16.8శాతం ఉంటే ఈ ఏడు అది తగ్గి 14.5శాతానికి చేరింది. అయితే చలామణీలో ఉన్న నగదుకు, జీడీపీకి మధ్య నిష్పత్తి మాత్రం గతేడాది 11.3శాతం ఉంటే ఈ ఏడు అది పెరిగి 12శాతానికి చేరింది. నోట్లరద్దుకు ముందు కాలంలో కూడా ఇదే నిష్పత్తి ఉండేది” అని 2019-20 వార్షిక నివేదికలో ఆర్‌బీఐ పేర్కొంది. అందుచేత నోట్ల చలామణీ తగ్గిందన్న వాదన వాస్తవం కాదు.

ఇదేమంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. డిజిటల్‌ లావాదేవీలు జరపాలంటే అందుకు ఖర్చవుతుంది. అందుకే అసంఘటిత రంగంలో డిజిటల్‌ లావాదేవీలు తక్కువగా జరుగుతాయి. అసలే అక్కడ లాభాలు తక్కువ. దానికి డిజిటల్‌ లావాదేవీల ఖర్చు కూడా తోడైతే వారికి మిగిలేదేమీ ఉండదు. అయితే సంఘటిత రంగంలోనూ డిజిటల్‌ లావాదేవీలకు ఖర్చు తప్పదు. అందుకే అక్కడ కూడా నగదు లావాదేవీలకే మొగ్గు ఉంటుంది.

నోట్లరద్దు దెబ్బకి చాలా ”షెల్‌” కంపెనీలు (బోర్డుకే పరిమితమైన కంపెనీలు) మూతబడ్డాయని ముఖ్య ఆర్థిక సలహాదారు చెప్పుకున్నారు. దాని ఫలితంగా ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకత పెరిగిందన్నారు. నోట్లరద్దు కారణంగానే అటువంటి షెల్‌ కంపెనీలు మూతబడ్డాయని వాదన కోసం అంగీకరిద్దాం. కాని దానివలన కలిగిన ప్రయోజనాలు ఏమిటన్నది మనకు ఆర్థిక రంగంలో కనిపించాలి గదా? ఈ షెల్‌ కంపెనీలు మూతబడినంత మాత్రాన కొత్తగా ఉద్యోగాలేమీ రాలేదు (ఎంతో కొంత మేరకు ఉద్యోగాలు పోయి ఉండాలి). ప్రజల ఆకలి తగ్గింది లేదు. వారి జీవితాలలో వచ్చిన మెరుగుదల ఏమీ లేదు. నిజానికి నోట్ల రద్దు వలన ప్రజలకు ఒరిగిన ఒక్క మేలునైనా మన ముఖ్య సలహాదారు ప్రస్తావించలేదు. కాని అసంఘటిత రంగం మాత్రం చిక్కుల్లో పడింది. అక్కడ నిరుద్యోగం పెరిగింది. ఇప్పటికైనా మన ఆర్థిక ముఖ్య సలహాదారు, మోడీ నోట్ల రద్దు వలన కలిగిన హానికర పర్యవసానాలను కాస్త పరిశీలించితే మేలు.

Courtesy Nava Telangana

Search

Latest Updates