మనందరికీ ‘ముక్కు’ టీకా

Published on

  • 130 కోట్ల మందికి డబుల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ అసాధ్యం
  • సింగిల్‌ డోస్‌తో కరోనా ఖేల్‌ ఖతం
  • వచ్చే ఏడాదే అందుబాటులోకి తెస్తాం
  • మూడోదశలోకి కోవ్యాక్సిన్‌ ట్రయల్స్‌ 
  • భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా
  • మోడెర్నా ప్రభావశీలత 94.5 శాతం
  • దేశంలో కొత్తగా 30,548 కేసులు
  • నాలుగు నెలల తర్వాత అత్యల్పం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షల్లో చిట్టచివరిదైన మూడోదశలోకి ప్రవేశించింది. ఈవిషయాన్ని ఆ కంపెనీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) కృష్ణ ఎల్లా వెల్లడించారు. ‘కరోనా కాలంలో సంక్షోభం, సహకారం’ అనే అంశంపై గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) సోమవారం నిర్వహించిన ‘డెక్కన్‌ డైలాగ్‌’ ఆన్‌లైన్‌ సదస్సులో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కోవ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో వేయించుకోవాల్సి ఉంటుందని.. దేశంలోని 130 కోట్ల జనాభాకు దీన్ని అందించాలంటే 260 కోట్ల సిరంజ్‌లు, సూదులు అవసరం అవుతాయన్నారు. ఇది చాలా కష్టమని.. అందుకే ముక్కు ద్వారా ఒక్క డోసు వేస్తే సరిపోయే ‘నాజల్‌ డ్రాప్‌’ కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై దృష్టిసారించామని కృష్ణ ఎల్లా ప్రకటించారు. అది వచ్చే ఏడాది ప్రజలకు అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. దీనితో అంగన్‌వాడీలు, ఇతర ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించుకొని దేశ ప్రజలందరికీ ఒక్క ఏడాదిలోగా వ్యాక్సినేషన్‌ చేయొచ్చన్నారు.

మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా దేశంలోని 25 కేంద్రాల్లో 26వేల మంది వలంటీర్లపై కోవ్యాక్సిన్‌ను పరీక్షిస్తామన్నారు. దీంతో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం భారత్‌లో జరుగుతున్న అతిపెద్ద క్లినికల్‌ ట్రయల్‌గా ఇది నిలుస్తుందని కృష్ణ ఎల్లా చెప్పారు. వ్యాక్సిన్లను అత్యంత సురక్షిత వాతావరణంలో ఉత్పత్తి చేసేందుకు అవసరమైన బయోసేఫ్టీ లెవల్‌ -3 (బీఎ్‌సఎల్‌-3) ప్రమాణాలతో కూడిన ఉత్పత్తి కర్మాగారం ఉన్న ఏకైక బయోటెక్నాలజీ కంపెనీ తమదేనని పేర్కొన్నారు. అమెరికా, ఐరోపాల్లోనూ బీఎ్‌సఎల్‌-3 ఉత్పత్తి కేంద్రాలు లేవని.. చైనా ఇటీవలే ఆ తరహా యూనిట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించిందని వివరించారు. కొవిడ్‌ నియంత్రణకు కేంద్రప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ చైౖర్మన్‌, ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ ఎం.విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. చలికాలంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. కొవిడ్‌ టీకా తయారైతే దేశ జనాభాతో పాటు ప్రపంచదేశాలకూ సహకరిస్తామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. మరోవైపు భాగ్యనగరికే చెందిన బయోలాజికల్‌-ఈ (బీఈ) నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షలు మొదటి/రెండో  దశకు చేరాయి. ఈమేరకు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమ దాట్ల సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రయల్స్‌ ఫలితాలు 2021 ఫిబ్రవరికల్లా వస్తాయని ఆమె వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌ను అమెరికాకు చెందిన బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (బీసీఎం), డైనావ్యాక్స్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దాని అభివృద్ధికిగానూ ఆ రెండు సంస్థలు హైదరాబాద్‌లోని బయోలాజికల్‌-ఈతో జట్టుకట్టాయి. ప్రస్తుత ట్రయల్స్‌ ఈ మూడు కంపెనీల సంయుక్త భాగస్వామ్యంలో జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్‌కే చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వచ్చే వారం నుంచి రష్యా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’తో రెండు/మూడో దశ ప్రయోగ పరీక్షలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

Courtesy Andhrajyothi

Search

Latest Updates