ఇద్దరు పత్తి రైతుల ఆత్మహత్య

Published on

పురుగుల మందు తాగి ఒకరు.. ఉరి వేసుకొని మరొకరు

శాయంపేట/నాగర్‌కర్నూల్‌ : పత్తి సాగు చేసి.. అప్పుల పాలై.. వాటిని తీర్చే దారి కనిపించక.. ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందినవారు కాగా, మరొకరిది నాగర్‌కర్నూల్‌ జిల్లా.

వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ఆత్మకూరి శంకరాచారి(40)కి 20 గుంటల భూమి ఉంది. మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వరి వేశాడు. పెట్టుబడి కోసం రూ.2 లక్షల వరకు అప్పు చేశాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో అప్పు తీర్చే దారిలేక ఆదివారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందును తీసుకొని శాయంపేట సబ్‌స్టేషన్‌ వద్దకు వెళ్లి తాగి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి విమలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

కాగా, నాగర్‌కర్నూల్‌ జిల్లా బొందలపల్లికి చెందిన కూచకుళ్ల అచ్యుతరెడ్డి(61కి నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా మరో ఐదు ఎకరాలు కౌలుకు చేస్తున్నాడు. రెండేళ్లుగా పెట్టుబడులు కూడా తీరడంలేదు. ఈ ఏడాది ఏడు ఎకరాల్లో పత్తి, రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా రూ.10 లక్షల అప్పులు అయ్యాయి. దీంతో అప్పులెలా తీర్చాలో పాలుపోని అచ్యుతరెడ్డి ఆదివారం తమ పొలం వద్ద స్తంభానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Courtesy Andhrajyothi

Search

Latest Updates