వృద్ధులకు ‘కల్యాణం’

Published on

  • 70, 69, 59 ఏళ్ల మహిళల పేరుతో కల్యాణలక్ష్మి నిధులు
  • 30 ఏళ్ల క్రితం పెళ్లయిన ఓ మహిళ పేరిటా మంజూరు
  • ఆదిలాబాద్‌ జిల్లాలో వెలుగుచూస్తున్న లీలలు
  • బీజేపీ నేతకు 4 సార్లు.. కాంగ్రెస్‌ నేతకు రెండుసార్లు మంజూరు
  • ‘కదులుతున్న డొంక.. అదుపులో ముగ్గురు

ఇచ్చోడరూరల్‌ : వధూవరులు లేరు.. పెళ్లి బాజాలూ లేవు.. ఆ ఇళ్ల లో పెళ్లిళ్లే జరగలేదు.. అసలు వారికి ఆడపిల్లలే లేరు. అయితేనేం.. ఆ ఇళ్లలోని వారికి కల్యాణలక్ష్మి నిధులు వచ్చేశాయి! వృద్ధులు, వింతంతువుల పేర్లను నమోదు చేసి ఆ నిధులను స్వాహా చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో వెలుగుచూస్తున్న లీలలివీ! రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల వివాహం కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకంలో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో కల్యాణలక్ష్మి నిధుల దుర్వినియోగంపై ‘పెళ్లి మళ్లీ మళ్లీ’ శీర్షికతో ఈనెల 17వ తేదీన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన  కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌,  అక్రమాలకు బాధ్యుడైన అధికారి నదీంపై తక్షణమే వేటు వేశారు. ఆ వెంటనే జిల్లావ్యాప్తంగా పథకంలో జరిగిన అక్రమాలను వెలికి తీసే పనిలో పడ్డారు.

తాజాగా గురువారం ఇచ్చోడ మండలం చించోలి గ్రామానికి చెందిన బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు దశరథ్‌ గాయక్‌వాడ్‌ కుటుంబంలో కల్యాణలక్ష్మి పథకం ఏకంగా నాలుగుసార్లు మంజూరైన విషయం వెలుగులోకొచ్చింది. వితంతువు అయిన గాయక్‌వాడ్‌ గంగుబాయి(70) అనే వృద్ధురాలికి రెండుసార్లు, గాయక్‌వాడ్‌ దశరథ్‌ భార్య శకుంతల పేరిట, తమ్ముడి భార్య అనురాధ పేరిట కూడా కల్యాణలక్ష్మి నిధులు మంజూరయ్యాయి.

ఇదే గ్రామానికి చెందిన గాయక్‌వాడ్‌ రుక్మిణి(69) అనే వృద్ధురాలి పేరిట, గాయక్‌వాడ్‌ విజయ అనే మరో వృద్ధురాలి పేరిట కల్యాణలక్షి నిధులు విడుదలయ్యాయి. ఇచ్చోడ మండలంలోని నవేగావ్‌ గ్రామంలో గాయక్‌వాడ్‌ రేఖ పేరిట రెండుసార్లు, గాయక్‌వాడ్‌ కరుణ పేరిట ఒకసారి కల్యాణలక్ష్మి నిధులొచ్చాయి. గాయక్‌వాడ్‌ రేఖ, రాజేందర్‌లకు 30 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులే ఉన్నారు. అయినపప్పటికీ లేని కూతుళ్లను సృష్టించి కల్యాణలక్ష్మి పథకం కింద రెండుసార్లు నిధులు డ్రా చేశారు.

అలాగే గాయక్‌వాడ్‌ కరుణా బాయి పేరిట సైతం కూతుళ్లు లేకుండానే రెండుసార్లు నిధులు మంజూరయ్యాయి. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మాధవ్‌రావు భార్య మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శకుంతల(59) పేరిట రెండుసార్లు నిధులు మంజూరు కావడం గమనార్హం. అధికారులు, దళారులు కలిసి.. సంబంధిత కుటుంబీకులకు కొంత మొత్తంలో డబ్బు ఆశ చూపి ఈ మొత్తాన్ని కాజేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. కల్యాణలక్ష్మి అక్రమాలలో పేర్లు వెలుగుచూసిన వారు సైతం ఈ వ్యవహారంలో తమకెలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.

పొన్న గ్రామానికి చెందిన తమ సమీప బంధువు బనె బాలకృష్ణ తమ ఇంటికి వచ్చి, తమకు తెలియకుండానే కుటుంబ సభ్యుల నుంచి ఆధార్‌కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌ జిరాక్స్‌లు తీసుకొని వెళ్లారని బీజేపీ నేత దశరథ్‌, కాంగ్రెస్‌ పార్టీ నేత మాధవ్‌రావు చెబుతున్నారు.

కాగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కల్యాణలక్ష్మి నిధుల కుంభకోణంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇచ్చోడ పోలీసులు, పొన్న గ్రామానికి చెందిన మానే బాలకృష్ణ,  నర్సాపూర్‌ గ్రామానికి చెందిన సునీల్‌, ఇచ్చోడకు చెందిన మొజినొద్దీన్‌ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Courtesy Andhrajyothi

Search

Latest Updates