తొమ్మిది మంది చిన్నారుల్లో ఒకరికి కరోనా

Published on

– కరోనా సంక్షోభంతో పెరిగిన మహిళల, చిన్నారుల కష్టాలు : యూనిసెఫ్‌

న్యూఢిల్లీ : పిల్లలు, కౌమార దశలో ఉన్న ప్రతీ తొమ్మిది మందిలో ఒకరు కరోనా వైరస్‌ బారిన పడ్డారని యూనిసెఫ్‌ శుక్రవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ నెల 3 నాటికి 87 దేశాలల్లో కరోనా బారిన పడిన 25.7 మిలియన్ల మందిలో 11 శాతం పిల్లలు, కౌమార దశలో ఉన్నవారేనని నివేదిక స్పష్టం చేసింది. ‘పిల్లలు కరోనా మహమ్మారి బారిన పడరు అనే అపోహ ఉంది. ఇది నిజం కాదు’ అని యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెంరిఎట్టా ఫోర్‌ తెలిపారు. ‘పిల్లలు వైరస్‌ బారీన పడతారు. వైరస్‌ను వ్యాప్తి చేస్తారు. ఇది మహమ్మారి సంక్షోభానికి ఒక వైపు మాత్రమే. సంక్షోభం కారణంగా కీలక సేవలకు అంతరాయాలు కలగడం, పేదరికం పెరగడం చిన్నారులకు అతి పెద్ద ముప్పు. సంక్షోభం ఎంత కాలం కొనసాగితే.. పిల్లల విద్య, ఆరోగ్యం, పోషణ, శ్రేయస్సుపై దీని ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. మొత్తం తరం యొక్క భవిష్యత్‌ ప్రమాదంలో పడుతుంది’ అని ఫోర్‌ హెచ్చరించారు. కరోనా సంక్షోభంతో మహిళల, చిన్నారుల కష్టాలు మరింతగా పెరిగాయని యూనిసెఫ్‌ నివేదిక తెలిపింది. మహిళల, చిన్నారుల కష్టాలు పెరగడా నికి పాఠశాలల మూసివేత కొనసాగుతూ ఉండ టం, ఆర్యోగ సేవలకు అంతరాయం కలగడం ప్రధాన కారణాలుగా యూనిసెఫ్‌ స్పష్టం చేసింది. వివిధ దేశాల్లో పాఠశాలల మూసివేతతో పాఠశాలల్లో పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజన పథకానికి అటంకం కలిగిందని నివేదిక తెలిపింది.

పోషకాహార సమస్య
కోవిడ్‌-19 సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పోషకాహార సమస్యతో మరింతగా పెరిగిందని యూనిసెఫ్‌ నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం అధ్యయనం చేసిన 135 దేశాల్లో కరోనా ముందుకాలంతో పోలిస్తే ఆరోగ్య సేవలు 10 శాతం, మహిళల, చిన్నారుల పోషకహార సేవలు 40 శాతం క్షీణించాయి. చిన్నారులు తమలో తమకి, వృద్ధులకు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశాలు ఉన్నా, సరైన భద్రతా చర్యలు పాటిస్తే పాఠశాలల మూసివేత కన్నా, పాఠశాల ప్రారంభమే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని యూనిసెఫ్‌ తెలిపింది. పాఠశాలలు వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణం కాదని, పాఠశాలల వెలుపల కూడా చిన్నారులు వైరస్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని యూనిసెఫ్‌ స్పష్టం చేసింది. చిన్నారులు పాఠశాలల అభ్యాసాన్ని, పోషకాహారం, ఆరోగ్య సేవలను పొందడానికి డిజిటల్‌ సేవలు తగ్గించాలని నివేదిక సూచించింది. చిన్నారుల్లో పేదరికం పెరుగుదలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలకు యూనిసెఫ్‌ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.

Courtesy Nava Telangana

Search

Latest Updates