- గ్రేటర్ ఎన్నికల బరి నుంచి విరమణ
- పవన్‌కల్యాణ్‌తో బీజేపీ నేతల చర్చలు
- పెద్దమనసుతో ఒప్పుకొన్నారు: కిషన్‌రెడ్డి
- తెలంగాణ విశాల ప్రయోజనాల కోసమే: పవన్
హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని బీజేపీకిమద్దతు ఇవ్వాలని జనసేన నిర్ణయించింది. గురువారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమావేశమై చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. జుబ్లీహిల్స్‌లోని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ నివాసంలో రెండు గంటలపాటు ఈ భేటీ జరిగింది. అనంతరం అగ్రనేతలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని, బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, తెలంగాన ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ విస్పష్ట ప్రకటన చేశారు. ‘‘ఏపీలాగే తెలంగాణలో కూడా కలిసి పనిచేయాలని అనుకున్నాం. కానీ, కరోనా, బిహార్, దుబ్బాక ఎన్నికల వల్ల సాధ్యం కాలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా కొంత కన్ఫ్యూజన్ వచ్చిన మాట వాస్తవమే. ముందుగా మాట్లాడుకుని ఉండుంటే ఈ గ్యాప్ వచ్చేది కాదు. బీజేపికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఈ నిర్ణయంతో మా కార్యకర్తలు నిరుత్సాహ పడింది నిజం. అయినా జన సైనికులు బీజేపీకి సహకరించాలి. ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా చూడాలి’’ అని పవన్ పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇందుకు అనుగుణంగా దుబ్బాకలో మొదటి అడుగుపడిందని, హైదరాబాద్‌లో కొనసాగబోతోందని చెప్పారు. ఈ మార్పునకు పవన్‌కల్యాణ్ పెద్ద మనసుతో అంగీకరించారని కిషన్‌రెడ్డితోపాటు లక్ష్మణ్ తెలిపారు. భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుందన్నారు.
Courtesy Andhrajyothi