తీరం ముంగిట కాలుష్య పరిశ్రమలు

Published on

విశాఖపట్నం: విశాఖ జిల్లా తీరప్రాంతంలో ఔషధ, రసాయన పరిశ్రమల కాలుష్యంతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు పాలకులు చేపట్టకపోగా, విశాఖ-చెన్నరు కోస్టల్‌ కారిడార్‌ (విసిఐసి) పేరుతో మరిన్ని కాలుష్యకారక పరిశ్రమలకు అనుమతిచ్చి అవస్థలు పెంచాలని చూస్తున్నారు. పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉపాధి లభిస్తుందని ఆశ చూపుతూ, కొత్తగా ఉపాధి కల్పించకపోగా, ఉన్న ఉపాధికి గండికొట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. విసిఐసిలోని విశాఖ జిల్లా నక్కపల్లి, రాంబిల్లి క్లస్టర్లలో భూ సేకరణ పూర్తయింది. నక్కపల్లి క్లస్టర్‌కు సంబంధించి నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఈ నెల 25న ప్రజాభిప్రాయ సేకరణకు కాలుష్య నియంత్రణ మండలి రంగం సిద్ధం చేసింది. వందమందికిమించి గుమిగూడరాదని కోవిడ్‌ నిబంధనలను సాకుగా చూపి ప్రజాభిప్రాయ సేకరణకు జనాలను రానీయకుండా జరిగిందనిపించే కుట్ర జరుగుతోందనే విమర్శలు వెల్లువెతున్నాయి. నేటికీ పర్యావరణ ప్రభావిత నివేదికను గ్రామాల్లో ప్రదర్శించలేదు.
                             

రానున్నవి ఔషధ, రసాయన, పెట్రో పరిశ్రమలే!
నక్కపల్లి మండలం బుచ్చిరాజుపేట, డిఎల్‌పురం, వేంపాడు, చందనాడ, రాజయ్యపేటలో దాదాపు రెండు వేల మంది రైతుల నుంచి 3,899 ఎకరాల భూమిని ఎపిఐఐసి సేకరించింది.

విసిఐసి పరిధిలో ఔషధ, రసాయన, పెట్రో పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్‌, ఆటో, ఆటో ఉపకరణాలు, ఏరోస్పేస్‌ రక్షణ, ఇంజినీరింగ్‌ వంటి పలు పరిశ్రమలు రానున్నాయని కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. విఐసిసి, సిఆర్‌జెడ్‌ పరిధిలో రానున్న ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.1,191 కోట్లుగా పేర్కొన్నారు. ఉత్పత్తిని ప్రారంభించిన 25 ఏళ్ల తరువాత పారిశ్రామికరంగ ఉత్పాదన రూ.లక్ష కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ పరిశ్రమల వల్ల 30,800 మందికి ప్రత్యక్ష ఉపాధి, మరో 2.5 రెట్లు పరోక్ష ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
                                               

5,127 మత్స్యకార కుటుంబాల ఉపాధికి గండి!
కంపెనీలు ఏర్పాటు కానున్న ప్రాంతంలో 14 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 5,127 మత్స్యకార కుటుంబాలకు చెందిన 20,501 మంది జీవిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు ప్రత్యక్ష ఉపాధి స్థానికులకు, నిర్వాసిత కుటుంబాలకు లభిస్తుందో, లేదో తెలియదుగానీ పరిశ్రమల కాలుష్యం, కాలుష్య జలాలు సముద్రంలో కలవడం వల్ల మత్సకారులతోపాటు మరికొన్ని వేల మంది పేదలు, వృత్తిదారులు, రైతులు ఉపాధి కోల్పోనున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో గంగవరం పోర్టు మొదలుకొని అచ్యుతాపురం, పరవాడ ఫార్మా, బ్రాండిక్స్‌ కంపెనీలు స్థానికులకు ఉపాధి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, కాలుష్య నియంత్రణ వంటి అంశాలపై ఇచ్చిన హామీలను యాజమాన్యాలు అమలు చేయడం లేదు. ప్రభుత్వాలు ఉపాధి కల్పించేలా ఒత్తిడి చేయడం లేదు. ఔషధ పరిశ్రమలు, రసాయనాలు, పెట్రోరసాయనాల శుద్ధికి సిఇపిటిలు సరిగా నిర్వహించడం లేదు. ఔషధ, రసాయన పరిశ్రమల నుంచి విడుదలైన వ్యర్ధాలను సముద్రంలోకి విడిచిపెట్టేందుకు తీరప్రాంతాన్ని పారిశ్రామికవేత్తలు ఎంచుకుంటున్నారు. నక్కపల్లి హెటిరో డ్రగ్స్‌ నుంచి విడుదలవుతున్న వ్యర్ధాలతో పరిసర ప్రాంత ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమల వ్యర్థ జలాలు, రసాయనాలు సముద్రంలోకి విడిచిపెట్టడంతో మత్స్య సంపద తగ్గిపోవడంతో చేపల వేట లేక కూలి మత్స్యకారులు పనులకు, వృత్తి పనులకు వలసపోతున్నారు. తీరంలో మరికొన్ని ఔషధ, రసాయన పరిశ్రమలొస్తే తమ బతుకులుపోతాయన్న ఆందోళన ఆ ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Courtesy Prajashakti

Search

Latest Updates