అప్పుల ఊబికి.. ఆగే ఊపిరి!

Published on

  • రాష్ట్రంలో 11 నెలల్లో 468 మంది రైతులు ఆత్మహత్య
  • ఏడేళ్లలో 6,380 మంది బలవన్మరణం
  • తగ్గిన దిగుబడి.. మోతలా పెట్టుబడులు
  • పెరిగిన అప్పులు, ఆర్థిక సమస్యలు
  • అతివృష్టితో నాశనమైన పంటలు
  • చీడపీడల సమస్య.. పంటలకు నిప్పు 
  • పంటల బీమా పథకం ఏది? 
  • అన్నదాతకు దొరకని గిట్టుబాటు ధర 
  • గాడితప్పిన రుణమాఫీ పథకం 
  • అప్పులు ఇవ్వని బ్యాంకులు
  • కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్‌కు చెందిన సత్యారెడ్డి అనే యువరైతు తన 8 ఎకరాలతో పాటు, మరో 3 ఎకరాలను కౌలుకు తీసుకొని సన్నాలను వేశాడు. ఇందుకు రూ.3లక్షలు అప్పు చేశాడు. పంట బాగా వస్తే గతంలో చేసిన 3లక్షల అప్పు సహా మొత్తం 6లక్షలు తీర్చేయొచ్చని అనుకున్నాడు. దిగుబడి తగ్గడంతో అప్పు తీర్చే మార్గం కనిపించక ఈ నెల 15న ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ సమస్య ఈ ఒక్క రైతుదే కాదు.. వేలమంది అన్నదాతలది. సాగులో నష్టాలు రావడంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పత్తి పండలేదని, వరి  పంట వరద పాలైందని, మొక్కజొన్న నిండా ముంచిందని, చీడపీడలతో పంట చేతికొచ్చే పరిస్థితి లేదని, తెచ్చిన అప్పులకు మిత్తి కొండలా పెరిగి పోతోందని, ఆర్థిక సమస్యలు తీరే దారి కనిపించటంలేదని,, మొత్తంగా వ్యవసాయం కలిసిరావడం లేదన్న ఆందోళనలతో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈనెల 21 దాకా రాష్ట్రవ్యాప్తంగా 468 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి ఇప్పటివరకు (21దాకా) 6,380 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు జాతీయ నేర పరిశోధన విభాగం (ఎన్‌సీఆర్‌బీ), రైతు స్వరాజ్య వేదిక(ఆర్‌ఎ్‌సవీ) నివేదికలు చెబుతున్నాయి. వారం క్రితం రాష్ట్రంలో ఒక్కరోజే నలుగురు రైతులు పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా అమలుచేస్తున్న రైతుబంధు, కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘పీఎం-కిసాన్‌’ పథకాలు కూడా రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి.

ఆత్మహత్యల్లో 80 శాతం కౌలురైతులే
రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి, గాలిలో దీపంలా తయారైంది. వాస్తవ సాగుదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అమలుచేసే ధోరణిలో ప్రభుత్వం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది కౌలుదారులున్నా వారిని ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవడం లేదు. రైతుబంధు, రైతుబీమా, ఎరువులు- విత్తనాల సబ్సిడీ… అన్నింటినీ పట్టాదారులకే పరిమితం చేస్తున్నారు.

బ్యాంకుకు వెళ్లి రుణం తీసుకునే సదుపాయం కూడా కౌలు రైతులకు లేదు. పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి విక్రయించినా, వారి ఖాతాలో కాకుం డా భూ యజమాని ఖాతాలోనే డబ్బులు పడుతున్నాయి అతివృష్టి, అనావృష్టి సందర్భాల్లో పంట నష్టం జరిగినప్పుడు కూడా యజమానికి కౌలు కట్టాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ సమస్యలన్నీ కౌలు రైతులను ఆత్మహత్యల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. రైతుల ఆత్మహత్యల్లో 80శాతం కౌలు రైతులవే.

ఈ సీజన్‌ను కుదిపేసిన అకాల వర్షాలు
ఈ వానాకాలం మొదట్లో చక్కగా వానలు పడటంతో 1.35 కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేశారు. 52.56 లక్షల ఎకరాల్లో వరి, 60.22 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. అకాల వర్షాలు, భారీ వరదలు.. వరి, పత్తి ఇతర పంటలను నాశనం చేశాయి. ఈ ఒక్క సీజన్‌లో 14 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా, 11 లక్షల ఎకరాల్లో పాక్షికంగా దెబ్బతిన్నాయి.

ఇంకొన్నిచోట్ల చీడపీడలకు దిగుబడులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో  గుండె రాయి చేసుకొని పంటకు నిప్పుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో రూ. 8,633 కోట్ల మేర పంట నష్టం జరిగిందంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదికను పంపింది. ఇప్పటిదాకా అటు కేంద్రం నుంచి గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ రైతులకు పరిహారంగా పైసా దక్కలేదు.

కొంపముంచిన సన్నాల సాగు
సీఎం ప్రోత్సహించడంతో ఈసారి 40 లక్షల ఎకరాల్లో రైతులు సన్న రకాలను సాగు చేశారు. అకాల వర్షాలు, చీడపీడలతో సన్నాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. దొడ్డురకాలు సాగుచేస్తే తక్కువలో తక్కువగా ఎకరానికి 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. సన్నాల సాగుతో సగటున 20 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. ఎకరానికి రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. రెక్కల కష్టంతో పాటు పెట్టుబడి ఖర్చులు కూడా గిట్టుబాటయ్యే పరిస్థితి లేకుండాపోయింది.

ప్రభుత్వమే సన్నరకాల సాగును ప్రోత్సహించినపుడు… కనీసం గిట్టుబాటయ్యేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. క్వింటాకు రూ. 2,500 ధర ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుంటే, రూ. 1868 నుంచి రూ. 1888 మద్దతు ధరకు మాత్రమే కొనే పరిస్థితి నెలకొంది. ఎమ్మెస్పీకి రూ. 100- రూ. 150 పెంచి ఇస్తామన్న సీఎం ఇప్పుడు మౌనం వహించారు.

బీమా లేదు.. ధీమా లేదు
రాష్ట్రంలో పంటల బీమా పథకాలన్నింటినీ కాల గర్భంలో కలిపేశారు. 2016లో కేంద్రం ‘ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకం’(పీఎంఎ్‌ఫబీవై)ను అమలులోకి తెచ్చిన తర్వాత.. ఏ ఇతర క్రాప్‌ ఇన్సురెన్స్‌ పథకాలను అమలుచేయలేదు. పీఎంఎ్‌ఫబీవైని కూడా ఈ ఏడాది నుంచి ఐచ్ఛికం చేయటంతో.. నిధుల కొరత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వైదొలగింది. ఈ పరిస్థితుల్లో అతివృష్ఠి సంభవించటం.. 14 లక్షల ఎకరాల్లో పూర్తిగా, 11 లక్షల ఎకరాల్లో పాక్షికంగా.. కలిపి మొత్తం 25 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

బ్యాంకు రుణాలకు రుణమాఫీ గొడ్డలిపెట్టు
రైతులకు రుణమాఫీ పథకం ఎన్నికల హామీలా మారిపోయింది. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికలముందు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు సమీపిస్తున్నా… ఇంతవరకు దానిని అమలుచేయలేదు. కాగా కేంద్రం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావటంలేదు. ఎమ్మెస్పీ కూడా 33 శాతం నుంచి 34 శాతం మందికే అందుతున్నట్లు, మిగిలిన రైతులు ప్రైవేటు ట్రేడర్లకే విక్రయిస్తున్నట్లు… రైతు స్వరాజ్య వేదిక సర్వేలో తేలింది.

సీసీఐ కేంద్రాలు, వరి- మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావటంలేదు. ఉదాహరణకు ధాన్యానికి రూ. 1,868 నుంచి రూ. 1,888 ఉంది.  రైతులేమో క్వింటాకు రూ. 2,500 ధర ఇస్తే గిట్టుబాటవుతుందని అంటున్నారు. పత్తికి క్వింటాకు రూ. 5,825 ఎమ్మెస్పీ సరిపోదని, రూ.10 వేలు ఇస్తే గిట్టుబాటవుతుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం లక్ష్మాపూర్‌ గ్రామానికి చెందిన రాథోడ్‌ బాపురావు (45) అనే రైతుకు ఐదెకరాల సాగు భూమి ఉంది. మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని ఎనిమిదెకరాల్లో పత్తి పంట వేశాడు. వడ్డీ వ్యాపారుల నుంచి రూ. 1.5 లక్షలు, బ్యాంకు నుంచి రూ. 80 వేలు తీసుకొని మొత్తంగా రూ. 2.3 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. కాలం అనుకూలించలేదు. పత్తి దిగుబడి పెద్దగా రాలేదు. ఈలోగా కూతురు పెళ్లి  ఖాయమైంది. తాను చనిపోతే రూ.5 లక్షల రైతుబీమా వస్తుందని, ఆ డబ్బుతో కూతురు పెళ్లి, అప్పుల బాధ తీరిపోతుందని అనుకున్నాడు. ఇటీవల పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం వైకుంఠాపూర్‌కు చెందిన రైతు రాజేశ్వర్‌ (38) శివార్లోని తన ఆరెకరాల్లో సోయాబీన్‌ సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో పంటకు తీవ్ర నష్టం జరిగింది. అప్పటికే పంటకు పెట్టిన రూ.లక్ష పెట్టుబడి అంతా వృథా కావడం, దీనితోపాటు గతంలో చేసిన రూ.4లక్షల అప్పు ఎలా తీర్చాలనే ఆందోళనతో ఈనెల 3న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఆత్యహత్యలపై సమగ్ర అధ్యయనం చేయాలి
రైతులకు ఎంతో చేస్తున్నాం అని చెప్పుకొనే ప్రభుత్వం, ఇన్ని వేల సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయనే విషయాన్ని ఆలోచించాలి.   ఆత్మహత్యలపై సమగ్ర అధ్యయనం చేయాలి. 33ు పంట ఉత్పత్తులకే కనీస మద్దతు ధరను అందించడం దారుణం. సన్నవరి, పత్తిని సాగు చేయాలంటూ రైతులను ప్రోత్సహించి ఇప్పుడు వాటిని కొనకపోవడం సరికాదు.  వార్షలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయలేదు.  ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఒక్క రైతు కూడా పంటల బీమాకు నోచుకోలేకపోయారు.
-బి. కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్‌ 

మళ్లీ పత్తి రైతుల ఆత్మహత్యలు
రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ప్రభ్వుత్వం, పత్తి పంటను అసలే సాగుచేయొద్దని, దానికి బదులుగా పప్పు ధాన్యాలు, ఆరుతడి పంటలు సాగుచేయాలని గ్రామగ్రామాన సదస్సులు నిర్వహించి మరీ రైతులను చైతన్యపరిచింది. ఈ నాలుగేళ్లలో ఏం జరిగిందో? ఏమో? ఒక్కసారిగా పత్తి సాగుపై సీఎం కేసీఆర్‌ మనసు మార్చుకున్నారు.

ఈ వానాకాలం సీజన్‌లో ఎక్కువగా పత్తి పంటనే వేయాలని రైతులను పోత్సహించారు. వ్యవసాయ అధికారులకు, టార్గెట్‌ పెట్టి 60.22 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయించారు. అయితే అకాల వర్షాలు, వరదలకు చాలాచోట్ల పత్తిపంట దెబ్బతింది. సాధారణంగా ఎకరాని కి తక్కువలో తక్కువగా 10-12 క్వింటాళ్ల పత్తి ఉత్పత్తయ్యేది. వర్షాలతో 3-4 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితిలేదు.

Courtesy Andhrajyothi

Search

Latest Updates