నిబద్ధతగల సంపాదకులు, సాహితీవేత్త ముత్యాల ప్రసాద్

Published on

కె. సతీష్‌ రెడ్డి

విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు, అభ్యుదయ కవి, సాహితీవేత్త, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల ప్రసాద్‌ కోవిడ్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో తుదిశ్వాస విడవడం విచారకరం. 1990లో విశాలాంధ్ర దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా చేరిన ఆయన చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌గా, సండే ఇన్‌చార్జిగా 2006 వరకు పనిచేశారు. సండే మేగజైన్‌ను తీర్చిదిద్దడంలో ఆయన ఎంతో కృషిచేశారు. సాక్షి దినపత్రికలో సీనియర్‌ సబ్‌ఎడిటర్‌గా చేరారు. కొద్ది సంవత్సరాల తరువాత విశాలాంధ్ర ప్రధాన కార్యాలయం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మారినప్పుడు విజయవాడ కార్యాలయంలో చేరి సండే స్పెషల్‌ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విశాలాంధ్ర విజయవాడ రెసిడెంట్‌ ఎడిటర్‌గా నియమితులయ్యారు.

రాష్ట్ర విభజన అనంతరం విశాలాంధ్ర ప్రధాన కార్యాలయం విజయవాడకు మారిన తరువాత 2014లో విశాలాంధ్ర సంపాదక బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి తుదిశ్వాస విడిచే వరకు పత్రికాభివృద్ధికి ఆయన నిబద్ధతతో కృషి చేశారు. సంపాదకునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పత్రికలో అనేక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. ‘బతుకు పేజి’ ప్రాచుర్యం పొందేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. అభ్యుదయ రచయతల సంఘం (అరసం) కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రసాద్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ కృష్ణాఅర్బన్‌ అధ్యక్షునిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. ఐజేయూ జాతీయ సమితి సభ్యునిగా ఉన్నారు. అరసం, విశాలాంధ్ర విజ్ఞాన సమితి సంయుక్తంగా ఇచ్చే అమరజీవి తుమ్మల వెంకటరామయ్య సాహితీ పురస్కారాన్ని 2019 డిసెంబరు1న ఆయన అందుకున్నారు.

నూజివీడు అమర్‌భవన్‌ సొసైటీ అందించే ‘దాసరి’ స్మారక పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు. భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర పేరిట విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను ముత్యాల ప్రసాద్‌ రచించారు. కృష్ణాజిల్లా నూజివీడు మండలం కలటూరు వీరి స్వగ్రామం. 1966లో ముత్యాల రాధాకృష్ణ మూర్తి, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. గన్నవరం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. విద్యార్థి దశలో కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐలో పనిచేశారు. సీపీఐ అగ్రనాయకులు అమరజీవి దాసరి నాగభూషణరావు ప్రభావంతో విశాలాంధ్రలో చేరారు. పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఉపాధ్యాయునిగా, మార్క్సిస్టు సిద్ధాంత ప్రచారానికి విశేషంగా కృషి చేశారు. డిగ్రీ విద్య మూడేండ్లు విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్‌ ప్రస్తుత సంపాదకులు గడ్డం కోటేశ్వరరావు ఇంట్లోవుండి అభ్యసించారు.

కోటేశ్వరరావుగారి సతీమణి సుశీల తెలుగు అధ్యాపకురాలు కావడంతో ఆమె సహాయంతో తెలుగు సాహిత్యాన్ని ఎక్కువగా చదువుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని సాహిత్య అభిమానులకు, పత్రిక సమాజానికి ఆయన చిరపరిచుతులు. వామపక్ష కార్యకర్తగా, అభ్యుదయ రచయితగా ఎన్నో అంశాలపై ఆయన రాసిన వ్యాసాలు, సంపాదకీయాలు ఆలోచింపజేసేవిగా ఉండేవి. ఏపీయూడబ్ల్యూజే నాయకులుగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికీ కృషి చేశారు. జర్నలిజంలో అంకితభావంతో, వామపక్ష భావజాల వ్యాప్తికి, కమ్యూనిస్టుపార్టీకి ప్రసాద్‌ చేసిన సేవలు గుర్తించదగినవి. కమ్యూనిస్టుగా సమాజం పట్ల తన బాధ్యతలను అంకిత భావంతో ప్రసాద్‌ నిర్వర్తించారని చెప్పవచ్చు. ముత్యాలప్రసాద్‌ మృతి తెలుగు పత్రికారంగానికీ, వామపక్ష ఉద్యమాలకూ తీరనిలోటు. సమాజానికి ఆయన అందించిన సేవలు స్ఫూర్తిదాయకం. ఆయన జీవితం నేటి తరం రచయితలు, పాత్రికేయులకు ఆదర్శప్రాయం.

Search

Latest Updates