మృతదేహాన్ని వీధి కుక్క కొరుకుతూ..

Published on

– యూపీలోని ప్రభుత్వాస్పత్రిలో షాకింగ్‌ ఘటన
– సామాజిక మాద్యమాల్లో వీడియో వైరల్‌..
– సర్కారు దవాఖానాల తీరుపై సర్వత్రా ఆగ్రహం

లక్నో : యూపీలో దారుణం ఘటన చోటు చేసుకున్నది. ప్రభుత్వాస్పత్రిలో బాలిక మృతదేహాన్నిన ఒక వీధి కుక్క కొరుకుతూ కనిపించింది. యోగి సర్కారు, రాష్ట్రంలో ప్రభుత్వ దుస్థితి గురించి ప్రత్యక్షంగా వివరించ ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి యోగి సర్కారు, ప్రభుత్వాస్పత్రులపై ప్రజలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంభల్‌ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఈ ఉదంతం యావత్‌ రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ బాలిక మృతదేహాన్ని గురువారం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు.

అయితే, ఆస్పత్రికి తరలించేలోపే బాలిక మరణించిందా? లేదా ఇక్కడకు వచ్చిన తర్వాత పట్టించుకునేవారెవరూ లేకపోవడంతో ప్రాణాలు కోల్పయిందా? అన్న విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టతా లేకపోవడం గమనార్హం. అయితే, సదరు బాలిక మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రిలోని ఓ మూలన స్ట్రెచర్‌పై ఉంచారు. మృతదేహంపై తెల్లని వస్త్రం కప్పి ఉంచారు. అయితే, ఆస్పత్రిలోకి ప్రవేశించి ఆ బాలిక మృతదేహాన్ని వాసన చూస్తూ కొరుకుతూ కనిపించింది. దాదాపు 20 సెకన్ల నిడివి ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఇదంతా రికార్డయ్యింది. ఇది పూర్తిగా ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగానే చోటు చేసుకున్నదనీ, అక్కడ వీధి కుక్కల సమస్య ఉన్నదన్న విషయం ఆస్పత్రి యాజమాన్యంకు తెలుసని బాలిక తండ్రి చరణ్‌సింగ్‌ ఆరోపించారు.

కాగా, ఇక్కడ వీధి కుక్కల సమస్య గురించి స్థానిక యంత్రాంగానికి గతంలో లేఖ రాసినప్పటికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆస్పత్రి యాజమాన్య తెలియజేయడం గమనార్హం. ఈ ఘటనపై స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్‌ చేసింది. కాగా, యూపీలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. గతంలోనూ అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. కుక్కలు చేసిన గాయాల కారణంగానే తమ పసిపాప మరణించిందని రెండు రోజుల క్రితం అలీగఢ్‌కు చెందిన ఓ కుటుంబం వెల్లడించిన విషయం విదితమే.

Courtesy Nava Telangana

Search

Latest Updates