ఏపీ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం

Published on

విజయవాడ: ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆయన ఇంటి వద్ద ఆదివారం హత్యాయత్నం జరిగింది. పేర్ని నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ దశదిన కార్యక్రమం ముగించుకుని మార్కెట్‌ యార్డులో జరిగే సంతాప సభ, భోజన కార్యక్రమానికి చేరుకొనేందుకు ఇంటి గేటు వద్దకు వచ్చిన సమయంలో తాపీ మేస్త్రి ఒడుగు నాగేశ్వర రావు ఆకస్మికంగా నాని కాళ్లపై పడుతున్నట్టు నటించి దాడి చేశాడు. తన బొడ్డులోని తాపీని తీసి మంత్రి పొట్టలో పొడిచే ప్రయత్నం చేశాడు. మంత్రి ధరించిన బెల్ట్‌కు గుచ్చుకొని తాపీ వంగిపోయింది. రెండోసారి పొడిచేందుకు ప్రయత్నిస్తుండగా, గమనించిన మంత్రి నిందితుడిని వెనక్కి నెట్టారు. అక్కడే ఉన్న మంత్రి అనుచరులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని చిలకలపూడి పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో మంత్రికి ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడు టీడీపీ సీనియర్‌ మహిళా నేత ఉమాదేవి సోదరుడు కావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మంత్రి మాట్లాడుతూ తనపై హత్యాయత్నం చేసిన వ్యక్తి టీడీపీ సానుభూతిపరుడనీ, ఎన్నికల సమయంలో టీడీపీకి ప్రచారం చేసినట్టు తనకు తెలుసునని చెప్పారు. తనపై ఎందుకు దాడి చేశారో తెలియదని అన్నారు. దీని వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందా? అనేది పోలీసుల విచారణలోనే తెలియాలన్నారు.

Search

Latest Updates