పంచుడు.. దంచుడు

Published on

  • జోరందుకున్న డబ్బులు, మద్యం పంపిణీ
  • వారం ముందు నుంచే కసరత్తు.. 70 శాతం పూర్తి!
  • కేటగిరీల వారీగా డబ్బులు పంపిణీ చేసిన మరో పార్టీ
  • అభ్యర్థులకు సొంత నిధులు ఇచ్చినఆ పార్టీ కీలక నేతలు
  • గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌పేలతో ఓటర్ల ఖాతాల్లోకి!
  • డబ్బుల పంపిణీపై పరస్పరం ఫిర్యాదులు.. దాడులు

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. తూటాల్లా పేలిన మాటలు మూగబోయాయి. వణికించే చలిలో వేడెక్కించిన రాజకీయం ‘కీలక’దశకు చేరింది. పోలింగ్‌ మొత్తాన్ని ప్రభావితం చేసే ఓట్ల కొనుగోలు కార్యక్రమం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలూ కలిసి ఒక్కో డివిజన్‌కు గరిష్ఠంగా రూ.4 కోట్లు.. కనిష్ఠంగా రూ.3 కోట్ల మేర పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. మరీ ముఖ్యంగా మిగిలిన పార్టీలతో పోలిస్తే.. ఒక ప్రధాన పార్టీ సిద్ధం చేసిన వ్యూహం ప్రత్యర్థులకు సైతం అంతుబట్టనిదిగా మారినట్లు సమాచారం. ఆ పార్టీ తొలుత ఓట్ల కొనుగోలుకు డివిజన్‌కు రూ.కోటి మొత్తాన్ని బడ్జెట్‌గా కేటాయించింది. కానీ, మారిన పరిణామాలు, సమీకరణాల నేపథ్యంలో తన వ్యూహాన్ని మార్చేసింది.

గెలుపు సులువుగా ఉన్న చోట్ల రూ.2 కోట్లు.. పోటీ తీవ్రంగా ఉన్న చోట రూ.2.5 కోట్ల మొత్తాన్ని కేవలం ఓటర్లను ఆకర్షించేందుకే వినియోగించాలని వారం క్రితమే నిర్ణయించింది. శుక్రవారం నుంచి పంపిణీ కార్యక్రమం మొదలు కాగా.. ఆదివారం మధ్యాహ్నానికి దాదాపు 70ు మేర పూర్తయినట్లగా చెబుతున్నారు. కొన్నిచోట్ల వ్యక్తిగతంగా కాకుండా.. మహిళా గ్రూపులు, అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్స్‌, కాలనీ సంఘా లు వంటివాటికి గంపగుత్తగా డబ్బులను చెల్లిస్తున్నారు. ఇంత భారీగా ఓట్ల కొనుగోలు కార్యక్రమం నగరంలో జరగలేదంటున్నారు. అదేసమయంలో.. పంచుడు కార్యక్రమాన్ని అడ్డుకొంటూ పార్టీల పరస్పర దంచుడు కార్యక్ర మం కూడా షురూ అయింది. ఒక పార్టీ అభ్యర్థులు పంపి ణీ చేస్తున్న డబ్బులపై మరో పార్టీకి చెందిన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా పరస్పర ఫిర్యాదులతోనే సరిపెట్టుకోకుండా దాడులు కూడా చేస్తున్నారు.

ముఖ్యులతో కొనుగోలు..
పోలింగ్‌ను ప్రభావితం చేసేందుకు ఒక ప్రధాన పార్టీ అనుసరించిన వ్యూహం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తావిస్తోంది. అందు లో భాగంగా ఆ పార్టీ కొంతమంది ముఖ్యుల్ని ప్రతి డివిజన్‌కు నియమించింది. రెండు వారాలుగా వారు డివిజన్‌ ప్రజలతో కలుపుగోలుగా ఉంటూ.. ఓట్ల కొనుగోలుకు అవసరమైన ముఖ్యుల్ని గుర్తించారు. మూడు రోజుల క్రితం తొలి విడత మొత్తం అందగానే.. గుట్టుచప్పుడు కాకుండా వారు ఆ ముఖ్యులకు అందజేసినట్లుగా సమాచారం. ఇలా ప్రతి డివిజన్‌లోనూ ఆ పార్టీ ‘కొనుగోలు’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. డివిజన్‌ ఏదైనా కావొచ్చు.. 20 వేల ఓట్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందొక ప్రధాన పార్టీ. గతంలో ఓట్ల కొనుగోలుకు ఆసక్తి చూపని మరో ప్రధాన పార్టీ సైతం ఈసారి అందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. గెలుపు ఖాయమనుకున్న డివిజన్లను ‘ఎ’, పోటీ తీవ్రంగా ఇచ్చే డివిజన్లను ‘బి’, ఒక మోస్తరు పోటీ ఇచ్చే డివిజన్లను ‘సి’ కేటగిరీగా విభజిచింది. ఓట్ల కొనుగోలుకు ‘ఎ’ కేటగిరీ డివిజన్లకు రూ.50 లక్షలు.. ‘బి’ కేటగిరీ డివిజన్లకు రూ.30 లక్షలు.. ‘సి’ కేటగిరీ డివిజన్లకు రూ.20 లక్షలు ఇచ్చారు.

ఆ పార్టీ రూటు సపరేటు
మరో ప్రధాన పార్టీ.. బలమైన అభ్యర్థులు బరిలో ఉండి, విజయావకాశాలు ఉన్నవారిని.. ఖర్చంతా వారే భరించేలా ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతానికి సర్దుబాటు చేసుకోవాలని.. గెలిచిన తర్వాత చూసుకుందామని వారికి చెబుతోంది. పోటీ బాగా ఇస్తూ.. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కొందరు అభ్యర్థులకు మాత్రం.. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఇద్దరు తమ సొంత డబ్బుల్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన పార్టీల మాదిరి భారీగా కాకున్నా.. పోటీ ఇచ్చేందుకు అవసరమైన మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇంటింటికీ వెళ్లి పంచాల్సిన అవసరం లేకుండా.. తమకు ఓట్లు వేసే అవకాశం ఉన్న ఓటర్లను ముందుగా గుర్తించి వారి ఫోన్‌ నంబర్లను సేకరించాయి. గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా డబ్బు పంపిణీ చేస్తున్నారు. తమకు ఓటు వేసేవాళ్లకు డబ్బు పంచుడు ఎంత ముఖ్యమో, ప్రత్యర్థి పార్టీల పంచుడును ఆపడం కూడా అంతే ముఖ్యమని భావించిన పార్టీలు పలు చోట్ల పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి.

పకడో.. పకడో..
కొన్ని చోట్ల ఒక పార్టీ కార్యకర్తలే దాడులు చేసి ప్రత్యర్థి పార్టీ నేతల డబ్బు పంపిణీని అడ్డుకున్నారు. ఉదాహరణకు.. ఆదివారం జగద్గిరిగుట్టలోని సంజయ్‌పురి కాలనీలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేస్తుండగా, బీజేపీ వారు పట్టుకున్నారు. సరూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా కాలనీవాసులు అడ్డుకున్నారు. యూసు్‌ఫగూడలో టీఆర్‌ఎస్‌ నేతలు అంగన్వాడీ మహిళల చేత డబ్బు పంపిణీ చేయిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. రాజేంద్రనగర్‌ మైలార్‌దేవ్‌పల్లిలో అధికార పార్టీ నేతలు మద్యం పంచుతూ.. తమను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఇక.. సరూర్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి భర్త డబ్బులు పంపిణీ చేస్తుండడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అడ్డుకున్నారు. ఇలా.. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ‘పంచుడు.. దంచుడు’తో ఉద్రిక్తవాతావరణం నెలకొంది.

మద్యం సమర్పయామి..
హైదరాబాద్‌ : డబ్బులతో పాటు, మద్యం సరఫరాపై కూడా వివిధ పార్టీల అభ్యర్థులు దృష్టిని పెట్టారు. నగరంలో ఆదివారం సాయంత్రం నుంచే మద్యం షాపులను ముసివేశారు. అయితే ఎన్నికల్లో పంపిణీ చేయడానికి వీలుగా ఆయా పార్టీల వారు ముందుగానే ఈ మద్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి నిల్వ ఉంచుకున్నారు. ఈ మద్యాన్ని ఆదివారం రాత్రి నుంచి

బెట్టింగ్‌లు షురూ!
ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు ప్రారంభమయ్యాయి. బుకీలు వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం. కేవలం అభ్యర్థుల విజయంపైనే కాకుండా.. కొందరు సిట్టింగ్‌ల ఓటమిపైనా బెట్టింగ్‌ సాగుతున్నట్లు తెలిసింది. ఈ బెట్టింగ్‌లు ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా.. ఏపీ, పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లోనూ సాగుతున్నాయి.

Courtesy Andhrajyothi

Search

Latest Updates