విద్యార్థులకు భోజన భత్యం ఇవ్వాల్సిందే

Published on

  • రాష్ట్రానికి తేల్చి చెప్పిన కేంద్రం
  • ఆహార ధాన్యాలు అందించేందుకు సిద్ధమైన పాఠశాల విద్యాశాఖ

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆహార భద్రత భత్యం ఎందుకు చెల్లించడం లేదని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులను కేంద్రం ప్రశ్నించినట్లు తెలిసింది. పిల్లలకు ప్రత్యేకంగా ఆహార భద్రత చట్టం కింద భత్యం లేక ఆహార ధాన్యాలు అందించాల్సిందేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రం తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలూ విద్యార్థులకు ప్రత్యేకంగా మధ్యాహ్న భోజనం పథకానికి సమానమైన భత్యం లేదా ఆహార ధాన్యాలు అందిస్తున్నాయని, మీరెందుకు ఇవ్వరని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ క్రమంలో విద్యార్థులకు సప్లిమెంటరీ ఫుడ్‌ కింద ఆహార ధాన్యాలు తదితర వాటిని ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.

ఎందుకు పట్టించుకోరు?
కరోనా వైరస్‌ ప్రబలడంతో గత మార్చి 16వ తేదీ నుంచి పాఠశాలలు మూతపడినందున వారికి మధ్యాహ్న భోజన పథకం ఆగిపోయింది. రాష్ట్రంలో పనిదినాల్లో భోజనంతోపాటు వారానికి మూడు గుడ్లు అందించేవారు. పాఠశాలలు మూతపడినా ఆహార భద్రత చట్టం కింద తప్పనిసరిగా ఆహారం అందించాలని, కరోనా వల్ల వీలుకాకుంటే అందుకు సమానమైన భత్యం చెల్లించాలని కేంద్ర విద్యాశాఖ గత మార్చి మూడో వారం నుంచే రాష్ట్రాలకు పలుమార్లు లేఖలు రాసింది. వ్యయంలో తన వంతు వాటా అందిస్తామని పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాము కుటుంబంలో ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నామని, కుటుంబానికి రూ.1500 చొప్పున నగదు(రెండు నెలలపాటు) ఇచ్చామని కేంద్రానికి సమాధానమిచ్చింది. దీనిపై ఇటీవల కేంద్ర విద్యాశాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పిల్లల కోసం ప్రత్యేకంగా వ్యయం చేయాల్సిందేనని, ఎందుకు పట్టించుకోవడం లేదని పాఠశాల విద్యాశాఖ అధికారులను నిలదీసినట్లు తెలిసింది.

ఏమివ్వాలో తేలలేదు
కేంద్రం గట్టిగా ప్రశ్నించడంతో ప్రభుత్వ సూచన మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేయనున్నారు. ‘విద్యార్థులకు బడులు తెరిచేవరకు సప్లిమెంటరీ ఫుడ్‌ ఇస్తామని, అందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం’ అని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఏమివ్వాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

Courtesy Eenadu

Search

Latest Updates