మేము రైతులం.. టెర్రరిస్టులం కాదు !

Published on

– మీడియా కవరేజీ వివక్షపై రైతన్నల ఆగ్రహం
– రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారనే విషయాన్ని మీడియా మరిచిందంటూ..

న్యూఢిల్లీ: ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి. ”ఛలో ఢిల్లీ” నిరసనలకు దేశవ్యాప్తంగా మద్ధతు పెరుగుతూనే ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ రైతులు ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే, దేశానికి అన్నం పెడుతూ.. వెన్నుకు దన్నుగా నిలుస్తున్న అన్నదాతల పట్ల జాతీయ మీడియా వ్యవహరించే తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎందుకు ఆందోళలను చేస్తున్నామో.. మోడీ సర్కారు తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో కలిగే నష్టం గురించి మీడియా వివరించకపోవడం దారుణమనీ, తమ ఆందోళనలను తప్పుగా చిత్రీకరించడం.. సిగ్గు మాలిన చర్య అంటూ పక్షపాతంగా వ్యవహరిస్తున్న మీడియాపై రైతులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ”తాము దేశానికి అన్నం పెట్టే రైతులం.. టెర్రరిస్టులం కాదు” అంటూ సింగూ సరిహద్దులో ఫ్లకార్డులను ప్రదర్శించారు.

అనేక అడ్డంకులను ఎదుర్కొని ఇక్కడికి (సింగూ సరిహద్దు) చేరుకున్నామనీ, తమను రాష్ట్రం దాటకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారని హర్యానాకు చెందిన జస్పీర్‌ సింగ్‌ అనే 58 ఏండ్ల రైతు చెప్పాడు. తనలాగే, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌ల నుంచి దేశరాజధానికి పయనమైన తమతోటి వారిని రాకుండా అనేక ఇ్బందులు కలిగించారని తెలిపారు. సరిహద్దులను దాటే సమయంలో పోలీసులు, లాఠీలు, టియర్‌ గ్యాస్‌లతో రెచ్చిపోయారని తెలిపారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే.. తమను ఖలీస్థాని ఉగ్రవాదులంటూ మోడీ మీడియా తమను పిలుస్తోందని పంజాబ్‌లోని కపుర్తాలకు చెందిన 50 ఏండ్ల జోగా సింగ్‌ అనే రైతు అన్నారు. ”రెండు నెలలుగా ప్రశాంతంగా ఉండి నిరసనలు తెలిపితే.. మమ్మల్ని ఉగ్రవాదులంటారా? మీరు తమకు అండగా నిలవండి. అలా కానీ పక్షంలో తాము పడుతున్న బాధలు మోడీకి ఎలా తెలుస్తాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము బహిరంగా జైలులో ఉన్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అలాగే, పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ప్రబ్జిత్‌ సింగ్‌ అనే రైతు మాట్లాడుతూ.. మేము ఏవైనా ఆయుధాలను కలిగి ఉన్నామా? మమ్మల్ని ఉగ్రవాదులని ఎవరి తరఫున వారు చెబుతున్నారు? మేము రైతులం, చదువుకున్న రైతులం అని అన్నారు. తాము చేస్తున్న నిరసనలపై జాతీయ మీడియా నిజాయితీగా నివేదికలు ఇవ్వలేదని హర్యానాలోని అంబాలాకు చెందిన 34 ఏండ్ల సుఖ్‌చైన్‌ సింగ్‌ అన్నారు. ”జాతీయ మీడియా మాతో లేదు. వాస్తవ పరిస్థితులను చూపడం లేదు” అని అన్నారు. మోడీ సర్కారు తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలు తమతో పాటు సామాన్యులపై ఎలా ప్రభావం చూపుతాయో అనే విషయాన్ని జాతీయ మీడియా చూపించడం లేదని తెలిపారు. ఆందోళనకు దిగింది కాంగ్రెస్‌ ప్రజలంటూ మోడీ అన్నారని హర్యానాలోని కర్నాల్‌ చెందిన సతీస్‌ కుమార్‌ అనే రైతు చెబుతూ..
”మిస్టర్‌ మోడీ.. ఇది ఏ పార్టీకో సంబంధించినది కాదు. మాకు ఏం జరుగుతుందో తెసుస్తోంది. ఎవరూ ప్రలోభాలకు లొంగరు. మీరు చేస్తున్న పనులతో మా రక్తం మరిగిపోతోంది. ధనవంతులను మరింత ధనవంతులుగా మార్చడానికి మీరు ఈ విధంగా పాలన సాగిస్తున్నారని” అన్నారు. బీజేపీ సర్కారు తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తొలగించేంత వరకూ తాము పోరాటం చేస్తామనీ, ఈ క్రమంలో తామ ప్రాణాలను అర్పించడానికి సైతం సిద్ధంగా ఉన్నామని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా జాతీయ మీడియా కండ్లు తెరవాలనీ, వివాదాస్పద చట్టాల వల్ల జరగబోయే నష్టాలను ప్రజలకు వివరించాలనీ, కార్పొరేట్లకు, ప్రజలను ఇబ్బందలకు గురిచేసే రాజకీయ నాయకులకు వంతపాడొద్దని రైతులు కోరుతున్నారు.

Courtesy Nava Telangana

RELATED ARTICLES

Related Posts

No Content Available
Search

Latest Updates