పొలంలోనూ .. పోరాటంలోనూ …

Published on

శాంతిమిత్ర

పొలంలో ఉండాల్సిన రైతులు ఢిల్లీ దారిలో కదం తొక్కుతుంటే దేశం కళ్లార్పకుండా చూస్తోంది. పైరును పసిపాపలా సాకే అన్నదాత… చేలను విడిచి రాజధాని వైపు నడవటం ఆసక్తిని గొలుపుతోంది. ఈ రైతు ప్రభంజనంలో వేలాదిమంది మహిళలూ పాల్గనటం మరో గొప్ప విశేషం. పొలంలోని ప్రతి పనిలో మమేకమయ్యే అమ్మలు … ఇప్పుడు పోరుబాటలోనూ నడుస్తున్నారు. ఇది ఉత్తేజకరమైన సందర్భం. కలుపు తీసే చేతులు పిడికిళ్లయి ప్రశ్నించటం ఓ చైతన్య సంకేతం.

ఢిల్లీ సమీప దారులన్నీ ఇప్పుడు రైతులతో నిండిపోయి ఉన్నాయి. హర్యానా, పంజాబు, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలచ్చిన రైతులు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ, విద్యుత్‌ చట్టాలను తీవ్రంగా నిరసిస్తూ .. కదం తొక్కుతున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలూ ఉన్నారు. పంజాబ్‌లోని 14 జిల్లాల నుంచి 10 వేల మంది మహిళలు పెద్ద ర్యాలీగా ఢిల్లీ బయల్దేరారు. వారికి భటిండాకు చెందిన హరీందర్‌ బిందు నాయకత్వం వహిస్తోంది. బిందు లాంటి వనితలు ఆ బృందలో ఇంకా చాలామంది ఉన్నారు. 20 ఏళ్ల యువతుల నుంచి 80 ఏళ్లు పై బడిన వృద్ధుల వరకూ ఉన్నారు. వీరంతా ఇంత పట్టుదలతో ఎందుకు నడుస్తున్నట్టు? వారు చేస్తున్నది సాఫీగా సాగిపోయే తీర్థయాత్ర కాదు. నవంబరు ఆఖరి వారంలో రైతులు ఢిల్లీ యాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నప్పుడే- ఢిల్లీ నుంచి తీవ్రమైన హెచ్చరికలు జారీ అయ్యాయి. ఢిల్లీ రావటానికి అనుమతి లేదని, బయల్దేరితే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తామని, కేసులు పెడతామని పేర్కొన్నాయి. అయినా, రైతులు తమ వాణిని వినిపించటానికి సిద్ధపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని తేల్చి చెప్పేశారు. వారితో పాటు పెద్దసంఖ్యలో మహిళా రైతులూ బయల్దేరారు. 96 వేల ట్రాక్టర్లు, ట్రక్కులు, చిన్ని చిన్ని వ్యానులూ … పంజాబు, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి ఢిల్లీ బయల్దేరాయి. గోధుమపిండి, బంగాళాదుంపలు, వంటపాత్రలు, ఉప్పులూ, పప్పులూ వంటివాటిని రైతులు ముందుగానే సర్దిపెట్టుకున్నారు.
ఎన్ని రోజుల ప్రయాణం? నిద్రాహారాల పరిస్థితి ఏమిటి? తీవ్రమైన చలీ, పొగమంచు నుంచి రక్షణ ఎలా? ఇలాంటివేమీ వాళ్లు ఆలోచించలేదు. ఢిల్లీ చేరటం ఒక్కటే తొలి లక్ష్యం. కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి, వాటి రద్దుకి పోరాడ్డం తదుపరి లక్ష్యం.

అనేక ఆటంకాలూ అబద్ధ ప్రచారాలూ …
రైతులు ప్రయాణించిన దారుల్లో పోలీసులు నానా ఇబ్బందులు పెట్టారు. ఇనుప ముళ్ల కంచెలు వేశారు. బారికేడ్లు పెట్టారు. వెనక్కు పొమ్మని బెదిరించారు. భయపెట్టారు. లాఠీలు ఝుళిపించారు. చలికి గజగజ వణుకుతున్న రైతులపై జల ఫిరంగులు ప్రయోగించారు. గాల్లో కాల్పులు జరిపారు. ఎందరినో కొట్టి, గాయపర్చారు. చేయాల్సినంత, చేయగలిగినంత చేశారు. అయినా, రైతులు తమ సంకల్పం నుంచి ఒక ఇంచీ కూడా వెనక్కి తగ్గలేదు. ఆపిన చోట ఆగారు. వంటలు చేసుకొని తిన్నారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. మళ్లీ ముందుకు కదిలారు. ఎందరో అమ్మలు చాలా చురుగ్గా వంటలు చేశారు. వందలాదిమందికి వడ్డించారు. ఆఖరికి ప్రభుత్వం తరఫున వచ్చి… తమపై లాఠీలు ఝుళిపించిన పోలీసులకు కూడా తిండి పెట్టారు. మీడియా ప్రతినిధులను ఆదరించారు.

మోడీ ప్రభుత్వం ఏమో ఇది పూర్తిగా అర్థం లేని ఆందోళన అని కొట్టి పారేసింది. పోలీసులను పెద్దఎత్తున మోహరించటంతో పాటు రోడ్లను అడ్డంగా తవ్వి ఆటంకాలు సృష్టించింది. వస్తున్న వాళ్లు ఉగ్రవాదులు అంది. విచ్ఛిన్నకారులు అపనిందలు వేసింది. పెయిడ్‌ ఆర్టిస్టులు అని ఎద్దేవా చేసింది. ఇదే విషయాన్ని మహీందర్‌ బిందుతో అంటే … ”మేం పెయిడ్‌ ఆర్టిస్టులమైతే మరి మోడీకి ఎందుకంత భయం? వేషగాళ్లకు కూడా ప్రధాని భయపడతారా?” అని సూటిగా ప్రశ్నించింది. ”ఈ ప్రభుత్వం అంబానీ, ఆదానీలకు సేవ చేస్తోంది. వారికి మేలు చేయటానికే కొత్త చట్టాలను తీసుకొచ్చింది. దానిని మేం ధైర్యంగా ప్రశ్నిస్తున్నాం. అందుకు భయపడి మోడీ ప్రభుత్వం రైతులపై నిందాప్రచారం చేస్తోంది. అయినా, ఆ మాటలను నమ్మేదెవరు?” అంది ధైర్యంగా.

ఈ చట్టం మహిళలకు మరీ నష్టం
”మరి మహిళలు ఎందుకు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గంటున్నారు? మీకెలా నష్టం?” అనడిగితేా ”ఈ చట్టాల వల్ల వ్యవసాయానికి పెద్ద నష్టం. మహిళలకు మరీ మరీ నష్టం.” అని పేర్కొంది బిందు. తన వయసు 35 ఏళ్ల లోపే అయినాా చాలా స్పష్టంగా మాట్లాడుతోంది. తనకు చిన్నప్పటినుంచి వ్యవసాయమంటే ఇష్టం. హైస్కూలు విద్య పూర్తి చేసింది. చదువుకునే వయసులోనూ పొలంలో పనిచేయటానికి ఎంతో మక్కువ చూపేది. బిందు లాంటి అమ్మాయిలూ, అమ్మలూ, అమ్మమ్మలూ కూడా హర్యానా, పంజాబు, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో వ్యవసాయ పనుల్లో నిమగమవుతారు. ఇంటిని నడపటంలో, ఆర్థికంగా దన్నునివ్వటంలో కీలకపాత్ర వహిస్తారు. బిందు మాటల్లో అదే భావన స్పష్టంగా వినిపించింది. ”ఈ చట్టాల వల్ల మొదటి మద్దతు ధర కోల్పోతాం. కార్పొరేట్లది ఇష్టారాజ్యం అవుతుంది. పంటలకు తగిన ధర రాదు. మహిళల చేతిలోని ఆర్థికశక్తి దారుణంగా పడిపోతుంది. కుటుంబం మొత్తం నష్టపోతోంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం, చదువు, భవిష్యత్తు … అన్నీ పోతాయి.” అంది ఎంతో ఆవేదనగా.

ఈ ఉద్యమంలో బిందులాంటి యువ రైతులే కాదు; పెద్ద వయసు మహిళలూ ఎంతో చురుగ్గా పాల్గంటున్నారు. సుర్జిత్‌ కౌర్‌ .. 80 ఏళ్లు దాటాయి. ఢిల్లీ బయల్దేరటానికి కొన్ని రోజుల ముందు ఇంటింటి ప్రచారంలో పాల్గంది. తిండిపదార్థాలు సేకరించింది. ”ఈ వయసులో ఇంత ఓపిగ్గా ఎందుకు పాల్గంటున్నారు?” అని విలేకరులు అడిగితే- ”మీ అందరికోసం.. మనందరి కోసం” అంది నవ్వుతూ. ”నేను పోయినా పంటలూ పైర్లూ రైతులూ బాగుండాలి కదా? అందుకోసం ..” అంది. ”మీ డిమాండ్లను సాధిస్తారనే నమ్మకం మీకుందా?” అని ప్రశ్నిస్తే- ”తప్పకుండా సాధిస్తాం. రైతు లేకుండా రాజ్యం ఉంటుందా? అన్నం పండించేవాడు చల్లగా ఉండాలని అందరూ కోరుకోవాలి.” అంది గట్టిగా. దాదాపు తన లాంటి ఓ ముప్పరు మంది మహిళల మధ్య ఆమె ఎంతో చురుగ్గా నడుస్తోంది.

వాళ్లందరినీ చూస్తుంటేా ‘దేశం మేల్కంటోంది. అన్నదాతలాగానే, మన అమ్మల్లాగానే అందరి మేలూ కోరుకుంటోంది.’ అని నమ్మకంగా అనిపిస్తోంది. పొలంలోనూ, పోరాటంలోనూ సగమై బలమై నడుస్తున్న రైతమ్మలకు జేజేలు చెబుదాం. రైతులు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Courtesy Prajashakti

Search

Latest Updates