ఊరి పాటై దరిజేరిన పైలం సంతోష్

Published on

విమలక్క

‘ప్రజల నాల్కల మీద ఆడే పాటలకు ఎన్ని మాటలు రాసినా, అవి దిష్టిపూసలుగానే ఉంటాయని” ”పాటల ఊట” అనే పయిలం సంతోష్‌ సంకలనానికి రాసిన ముందుమాటలో కామ్రేడ్‌ మిత్ర పేర్కొంటాడు. సామ్రాజ్యవాదుల లాభాపేక్షలో ‘విజన్‌-2020’ అనేది పాయిజనస్‌గా మారి కోవిడ్‌-19 సృష్టించిన బీభత్సంలో అనేకమంది అర్దాంతరంగా తనువు చాలిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా అరుణోదయతో, ప్రజాసాంస్కృతోద్యమంతో పెనవేసుకున్న పయిలం సంతోష్‌ సైతం అకాల మృత్యువాత పడ్డారు. విప్లవాల ఊటై ఊరి పాటై దరిజేరిన పైలం సంతోష్‌ స్మృతిలో ఐదుపాటలతో ”పాటై ఉదయించూ…” అనే పాటల సి.డీ. రూపొందించాము. సూర్యాపేట జిల్లా వెలిదండ గ్రామంలో డిసెంబర్‌ 3, 2020న జరిగే సంతోష్‌ సంస్మరణ సభలో దీన్ని ఆవిష్కరించనున్నాము. ఉద్యమం నుంచి ఎదిగి, సామూహిక ఉద్యమావసరాలను గుర్తెరిగిన కవులు మాత్రమే పాటలు రాయగలిగారు. అలాంటి ఉద్యమ కవి, వాగ్గేయకారుడు పయిలం సంతోష్‌కు అరుణోదయ పాటలతోనే నీరాజనాలర్పిస్తుంది. ఆయన సంస్మరణ సభలో ఈ పాటలను ప్రజలకు అంకితం చేయనుంది.

తెలంగాణ సాయుద పోరాట కాలం నుంచి కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్ర గ్రామంగా ఉన్న వెలిదండలో అమరులు ప్రతాప్‌, సంతోష్‌లతో సహ రాయికృష్ణ, జానయ్య తదితర ఇరవై మంది ప్రజాకళాకారులు రూపొందారు. ఇందులో సంతోష్‌తో సహా చాలామంది దళిత సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వాల్లే. తమ స్వయంకృషితో గ్రామ, జిల్లా, రాష్ట్రస్తాయి నాయకులుగా ఎదిగిన వాల్లే. విప్లవోద్యమంలో ప్రారంభమైన ఈ ఒరవడి దళిత ప్రజా స్వామికోద్యమంలో, తెలంగాణ లాంటి ప్రాంతీయ ప్రజాస్వామికోద్యమంలో ప్రతిభింబిస్తూ యావత్‌ తెలంగాణ నేడు పాటల పూదోటై వికసిస్తుందనడం అతిశయోక్తి కాదు. అలాంటి అభ్యుదయ పాటకు, ఉద్యమాలకు అత్యంత ప్రమాదం పొంచి ఉన్న వేళలో అన్ని ప్రజాస్వామిక ఉద్యమాల మధ్య విశాలమైన ఐక్యత వెల్లి విరియాలి. మూడున్నర దశాబ్దాల కృషితో అంటరాని కులగోడల్ని బద్దలు చేసిన పయిలం సంతోష్‌ను దళిత చట్రంలో బంధించే సంకుచిత భావాలకు తావివ్వరాదు. దళిత, విప్లవ శక్తుల ఐక్యతకు, ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణానికి ప్రతీకగా సంతోష్‌ను చూడడం, మలుచుకోవడమే సరైన కృషి కాగలుతుంది. 1990 దశకం నుండి తెలుగు నేలపైన జరిగిన ప్రతి పరిణామంలో సంతోష్‌ కృషి, పాత్ర ఉంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, సబాల్ట్రన్‌ సిద్దాంతాలు, మండల్‌ – కమండల్‌ పరిణామాల గుండానే సంతోష్‌ వ్యక్తిత్వం, కవిత్వమూ రూపొందుతూ వచ్చింది. సామాజిక, సాహితీ విశ్లేషకులు వీటన్నింటిని సరిగ్గా నిర్వచించుకుంటూ ప్రజా ఉద్యమాలకు, ఉద్యమకారులకు న్యాయం చేయాలి. అప్పుడే సంతోష్‌తో పాటు సంతోష్‌లాంటి మరెంతో మంది కృషిని సజీవం చేయగలుగుతాము.

తాను ఎనిమిదో తరగతి చదువుతుండగా తన సోదరుడు పెద్ద కోటయ్యతో పాటు సారా వ్యతిరేక పోరాటంలో కామ్రేడ్‌ సంతోష్‌ అరెస్టయ్యాడు. పదో తరగతి దాటని చదు వుతో సంతోష్‌ ప్రజా ఉద్యమంలో పూర్తి సమయం కార్యకర్తగా వచ్చాడు. నాతోపాటు ఎంతోమంది సీనియర్‌ కళాకారులు, కార్యకర్తలు వెలిదండకు పోయినపుడు నిక్కర్లు తొడుక్కుని కాల్లల్లో, వేళ్ళల్లో తిరిగే సంతోష్‌, 1992 రాచకొండ ఫైరింగ్‌ రేంజ్‌ వ్యతిరేక క్యాంపెయిన్‌లో పాల్గొని స్వయంగా తానే ఒకపాట రాశాడు. వెలిదండలోనే ఢిల్లీ ఇస్లాం తదితరులతో క్యాంపుల్లో శిక్షణ పొంది ”కరువు బతుకులు” తోపాటు అనేక అంశాలపై వీధి నాటకాలు రూపొందిం చడంలో కృషి చేశాడు. 2012 జూలైలో ఎనబై పాటలతో అరుణోదయ ద్వారా పాటల పుస్తకమే వెలువరించాడు.

రంగవల్లిపైన పాట రాయడమే గాకుండా తన పుస్తకాన్ని కామ్రేడ్‌ రంగవల్లికే అంకిత మిచ్చాడు. ప్రజా ఉద్యమాలు- ప్రభుత్వ ఉద్యోగం అనే సంఘర్షణ ఎలా ఉన్నా అనారోగ్య వ్యవస్థకు బలై అతి చిన్న వయసులోనే మరిణించాడు. నిర్మాణ పరంగా మా సంఘంలో లేకున్నా భావజాలపరంగా, ఆత్మీయంగా మావెంటే ఉన్న సంతోష్‌కు అంతిమ వీడ్కోలు చెబుతూ దు:ఖాన్ని నివారించుకోలేక పోయినాను.
ఒక మహిళా కళాకారిణిగా నేను ఉండటంతో అరుణోదయలో మహిళా కళాకారులకు కొరతలేదు. సాంప్రదాయాలన్ని బద్దలుగొట్టి మహిళలతో బుర్రకథకు నేనే కథకురాలిగా కూడా ఉన్నాను. నృత్యగానం, సిగేచర్‌ డ్యాన్స్‌ అనే కొత్త కళారూపాలను ఉనికిలోకి తెచ్చినాము. అయితే బ్యాలె ప్రదర్శనల్లో భూస్వామి, షావుకారు, కార్యకర్త అనే పాత్రల్లో సంతోష్‌ బాగా ఒదిగిపోయేవాడు. అభినయం, నాట్యం, గానంలతో అనతికాలంలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న సంతోష్‌ చిరునామా మాత్రం అరుణోదయనే.

తెలంగాణ ఉద్యమసందర్భంలో కొంతకాలం స్వతంత్య్ర నిర్మాణంలో ఉన్నా అనతికాలంలోనే తన పొరపాటును గుర్తించి సారధి కొలువులో చేరే వరకు అరుణోదయలో ప్రధాన బాద్యత వహించాడు. ఉద్యోగం అనేది వ్యక్తిగత అభిప్రాయాలకు, సైద్దాంతిక-రాజకీయ విశ్వాసాలకు ఆటంకం కాదు. గ్యారంటీ నియామకాలు, గ్రాట్యూటి పొందే అవకాశాలు లేని ఉద్యోగం సహజంగానే అభద్రతను కలిగిస్తుంది. ప్రజా కళాకారులుగా ఉంటూ ప్రజా ప్రతినిధులైన వాల్లు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నాను. ఈ సమయంలో సాటి సారధి కళాకారులు కొంత ఆర్థిక సహాయం ప్రకటించడం తప్పక ఊరట కలిగించేదే. కానీ ప్రభుత్వమే సంతోష్‌ పిల్లలైన స్నేహ, శివలకు ఏదయినా ఉపాధి కల్పించాలని కోరుకుందాం.

ప్రపంచీకరణ సృష్టిస్తున్న బ్రమలు, వ్యక్తిగత పోకడల మధ్య ప్రజా కళాకారులు ఆకలి, పేదరికంల మధ్య నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందుకే ప్రజలు, ప్రజా ఉద్యమాలే ఇలాంటి వారిని కాపాడుకోవాలి. ప్రత్యేకించి అమరుల కుటుంబాలకు సమాజం యొక్క సహకారం అత్యంతావశ్యకం. వెలిదండ వేదికపై ఈ ప్రతిపాదనలు చర్చనీయాంశమయ్యాయి. ఇలాంటి సమయంలో దళిత ఉద్యమాలు – విప్లవోద్యమాల మధ్య పోటీపెట్టే సంకుచిత భావాలు వదిలి, ఈ ఉద్యమాలు ఉమ్మడిగా సాధించాల్సిన అంశాలపై దృష్టిపెట్టాలి. అప్పుడే సంతోష్‌ భావాలను పయిలంగా ఉంచగలం. కామ్రేడ్‌ సంతోష్‌కు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తూ …

Courtesy Nava Telangana

Search

Latest Updates