మద్దతేది?

Published on

– సాగు ఖర్చులెక్కువ… ధరలు తక్కువ…
– కొత్త వ్యవసాయ చట్టాలతో ముప్పు
– ప్రకృతి వైపరీత్యాలను లెక్కలోకి తీసుకోని ‘కేంద్రం’
– అశాస్త్రీయ విధానాలతో అన్నదాతకు కన్నీళ్లు
– మౌలిక సదుపాయాలలేమితో వ్యాపారులకు వరం

హైదరాబాద్‌ : ఆరుగాలం కష్టపడి, చెమటోడ్చి పండించిన పంటలకు సరైన మద్దతు ధర కరువైంది. లాభం సంగతి పక్కన పెడితే రైతు పెట్టిన పెట్టుబడే రాక, అప్పులపాలై దివాళాతీస్తున్నారు. పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, చీడపీడలు, అతివృష్టి, అనావృష్టి వంటి పరిస్థితులు అన్నదాత నడ్డివిరుస్తున్నాయి. కౌలు చెల్లింపులతో కౌలురైతు మోయలేని భారంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా మద్దతు ధరలు ప్రకటిస్తున్నా…అవి రైతును గట్టేక్కించలేకపోతున్నాయి. కేవలం ఉత్పత్తి ఖర్చుల ప్రాతిపదికన మద్దతు ధర నిర్ణయించి రైతులను నట్టేట ముంచుతున్నది. పెట్టుబడి ఖర్చులకు మరో 50 శాతం కలిపి మద్దతు ధరలు ప్రకటిస్తామని బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చకపోగా, కొత్త చట్టాల్లో ఆ విషయాన్ని విస్మరించింది. దీంతోపాటు మార్కెట్ల వ్యవస్థను తొలగించింది. దేశంలో రైతు ఎక్కడికైనా వెళ్లి తన పంటను అమ్ముకోవచ్చు అని చెబుతున్నది. ఎక్కువకాలం నిల్వ ఉండని కూరగాయలు, పండ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకునేలోపు అవి పాడైపోయి రైతు నష్టపోయే ప్రమాదం ఉన్నది.

ఆ పంటను అమ్ముకోవడానికి ఖర్చులుపోను రైతుకు మిగిలేది నామమాత్రమే. పండిన పంట అమ్మగా వచ్చిన డబ్బుతో ఆ అప్పులను తీర్చలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇవేవీ కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు మూలిగేనక్కపై తాటిపండు పడినట్టుంది. మద్దతు ధరల ప్రస్తావనే లేకుండా ఈ చట్టాలు రూపుదిద్దుకున్నాయి. దేశానికి వెన్నుముకగా ఉన్న రైతు బతుకుపై కేంద్రం దెబ్బకొట్టింది. కేంద్రం అశాస్త్రీయ ధరల విధానం అన్నదాతను కుంగదీస్తున్నాయి. గత ఇరవై ఏండ్లుగా వ్యవసాయ పంటల ధరల పెరుగుదల 20 శాతమే ఉండగా, పారిశ్రామిక వస్తువుల ధరలు, వివిధ రకాల వేతనాలు 150 శాతం నుంచి 350 శాతం వరకు పెరిగాయ ని రైతు సంఘాలు చెబుతున్నాయి. మద్దతు ధరల పెరుగుదల మాత్రం గొర్రెతోక బెత్తేడు అన్నట్టుగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

నిర్ధిష్టమైన ధరల అంచనా ఏది?
పంటలకు మద్దతు ధర నిర్ణయించడంలో కేంద్రం సాధారణమైన అంశాలనే పరిగణనలోకి తీసుకుంటున్నది. నిర్దిష్టమైన అంశాలను అంచనా వేయడంలో విఫలమైంది. ఎరువులు, పురుగుమందులు, యంత్రాలు, విత్తనాలు, ఇతరత్రా ఖర్చులు భారీగా పెరుగుతున్నా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. రెండేండ్ల కిందటి సాగు ఖర్చులు, పంటల దిగుబడిని అంచనా వేసి ఈ ఏడాది మద్దతు ధరలు ప్రకటిస్తున్నది. వానాకాలంలో అకాలవర్షాలు పడి పంటలు బాగా దెబ్బతిన్నాయి. పంటదిగుబడి తగ్గిపోయింది. ఇలాంటి ప్రకృతి వైప రీత్యాలను మద్దతు ధరల నిర్ణయించే సమయంలో కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకో వడం లేదు. ఇది పూర్తిగా అశాస్త్రీయంగా జరుగుతు న్నది. కౌలు చెల్లింపులు, పశువులు శ్రమ, కుటుంబ సభ్యుల శ్రమ, కూలీ వేతనాల్లో వచ్చిన మార్పులు, పెరుగుతున్న ధరలను అంచనా వేయడం లేదు. దీని ఫలితంగా మద్దతు ధరల నిర్ణయంలో తీవ్రమైన వ్యత్యాసం ఉంటుంది. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు అప్పులపాలవుతు న్నారు.

నిల్వకు గోదాములేవి?
రైతులు పండించిన పంటను నిల్వ చేసుకోవడా నికి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. కోల్డ్‌స్టోరేజీలుగానీ, గోదాములుగానీ లేవు. దీంతో రైతులు తాము పండించిన పంటను నిల్వ చేసుకోవడానికి అవకాశం లేకుండాపోయింది. ఆ పంటను వెంటనే అమ్ముకోవాల్సి వస్తున్నది. పత్తి, వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు నిల్వ చేసుకుని ధర వచ్చినప్పుడు అమ్ముకుందామంటే అలాంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. అప్పటికప్పుడే ఆ పంటను అమ్ముకోవాల్సివస్తున్నది. ఈ పరిస్థితులు వ్యాపారులకు వరంగా మారుతున్నా యి. రైతుకు ఇష్టంలేకపోయినా వ్యాపారులు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నది. దీంతో రైతు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఉత్పత్తి ఖర్చులు రూ 2529 అవుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పిస్తే…కేవలం రూ 1888 మద్దతు నిర్ణయించి చేతులుదులుపుకున్నది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి ఖర్చును రూ 2758 కేంద్రానికి పంపింది. అందులో రూ 2700 మద్దతు ధర అమలు చేస్తున్నది. మద్దతు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో దేశ వ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం…పంటలకు మద్దతు ధరల చట్టం చేయడానికి జంకుతున్నది. ఈ చట్టం అమలుల్లోకి వస్తే రైతులకు ధరలు అడిగే హక్కు లభిస్తున్నది. కార్పొరేట్ల రక్షణ కోసం మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.

మద్దతు ధరల చట్టమే పరిష్కారం.. టి సాగర్‌, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతు సంఘం
రైతు పండించిన పంటలకు సరైన ధర దక్కడం లేదు. అందుకు చట్టబద్ధత కూడా ప్రభుత్వాలు కల్పించని దుస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అన్ని పంటలకు రక్షణ కల్పించడంతోపాటు మద్దతు ధరల చట్టం రూపొందించాలి. ఈ చట్టంతోనే రైతుకు కచ్చితమైన ధరలు అడిగే హక్కు లభిస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న ఢిల్లీ రైతాంగ ఉద్యమం అందుకు నాంది అవుతుంది.

Courtesy Nava Telangana

Search

Latest Updates