ప్రాంతీయ పార్టీల ముందున్న సవాల్‌ !

Published on

తన మిత్రపక్షాలన్నింటినీ పూర్తిగా అణచివేయడానికి బిజెపి సిద్ధంగా వుంది. సమాజాన్ని సజాతీయం చేయాలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యంగా వుంది. వైవిధ్య భరితమైన సామాజిక, సాంస్కృతిక, ప్రాంతీయ గుర్తింపులన్నీ హిందూత్వ కారణంగా పొగచూరి పోతున్నాయి. ఇది ప్రాంతీయ పార్టీల మనుగడకు ముప్పుగా పరిణమిస్తోంది.

ఇటీవలే ముగిసిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో బిజెపి చాలా తీవ్ర స్థాయిలో ప్రచారం సాగించింది. వాటి ఫలితాలు ఇంకా రావాల్సి వుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)ని ఓడించి కైవసం చేసుకున్న విజయంతో బిజెపి అత్యంత విషపూరితమైన మత ప్రచారాన్ని నిర్వహించింది. ఈ ప్రచార పర్వంలో అమిత్‌ షా నుండి ఆదిత్యనాథ్‌ వరకు జాతీయ స్థాయి నాయకత్వం అంతా పాల్గొంది. టిఆర్‌ఎస్‌కు, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా బిజెపి ఈ ప్రచారాన్ని సాగించింది. వంశ పారంపర్య రాజకీయాలు నడుపుతున్నారని, అవినీతికి పాల్పడ్డారని, గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎఐఎంఐఎంతో పొత్తు పెట్టుకుని ముస్లింల పట్ల బుజ్జగింపు ధోరణులకు దిగారని వారిపై ఆరోపణలు చేసింది. ఇక్కడ బిజెపి ఉద్దేశ్యం చాలా స్పష్టంగా వుంది. తామొక్కరమే ప్రత్యామ్నాయమని చెప్పడానికి గానూ టిఆర్‌ఎస్‌, దాని అధినేతలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ కార్పొరేషన్‌ ఎన్నికలను బిజెపి ఉపయోగించుకుంది. టిఆర్‌ఎస్‌, దాని నాయకత్వం ఈ దాడికి విస్మయ పడినట్లయితే తమను తామే నిందించుకోవాల్సి వుంటుంది.

2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించరాదన్న వైఖరిని టిఆర్‌ఎస్‌ అనుసరించింది. పార్లమెంట్‌లో అనేక ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాలకు మద్దతిచ్చింది. అంతేకాదు, బిజెపి హిందూత్వ ఎజెండా గురించి ఉద్దేశ్యపూర్వకంగానే మౌనం పాటించింది. ఇందులో ఒకే ఒక్క మినహాయింపు ఏమిటంటే పౌరసత్వ సవరణ బిల్లుకు మాత్రం తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది.
ఇప్పటికే అధ్వాన్న స్థితిలో వున్న కాంగ్రెస్‌పై తన ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడంపైనే మొత్తంగా దృష్టి కేంద్రీకరించిన టిఆర్‌ఎస్‌ తెలంగాణలో బిజెపి మరింత ముందుకెళ్ళడానికి అనుమతించింది. 2019 లోక్‌సభ ఎన్నికలు ఆనాడే ఒక హెచ్చరికను ఇచ్చాయి. తెలంగాణలో బిజెపి నాలుగు సీట్లను గెలుచుకుంది, దాదాపు 20 శాతం ఓట్లను పొందింది.

టిఆర్‌ఎస్‌ ఎదుర్కొంటున్న ఇటువంటి సంకట పరిస్థితులనే ఇతర ప్రాంతీయ పార్టీలూ ఎదుర్కొంటున్నాయి. అధికారంలో వున్నా లేకపోయినా ప్రాంతీయ పార్టీలన్నింటిది ఇదే తీరు. ప్రజల్లో తమకు గల మద్దతును తుడిచి పెట్టేందుకు లేదా హిందూత్వ శక్తులకు లొంగి వుండే మిత్రపక్షాలుగా తమని మిగిలేలా చేయగల ముప్పును ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొంటున్నాయి.

ప్రాంతీయ పార్టీల్లో చాలా వరకు స్వభావరీత్యా లౌకిక పార్టీలుగానే ప్రకటించుకున్నా, వాటి అవకాశవాదం, తరచుగా రాష్ట్ర రాజకీయాల కారణంగా గత రెండు దశాబ్దాల కాలంలో ఏదో ఒక సమయంలో బిజెపితో లేదా ఇతరులతో పొత్తు పెట్టకుంటూనే వచ్చాయి. ఆర్‌జెడి, సమాజ్‌వాది పార్టీలను మినహాయిస్తే, ఈ పార్టీలన్నీ వివిధ సమయాల్లో బిజెపితో పొత్తు పెట్టుకున్నాయి. ఈ పార్టీలకు ఏమైందన్నది అసోం గణ పరిషత్‌ను చూస్తే చక్కగా అర్ధమవుతుంది. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో ఎజిపి మొదటసారిగా బిజెపితో పొత్తు పెట్టుకుంది. అప్పటి నుండి, బిజెపితో పొత్తు పెట్టుకుని, పెట్టుకోకుండా సాగించిన రాజకీయాలతో ప్రజల్లో తనకు గల పునాదిని నెమ్మదిగా పోగొట్టుకుంటూ వచ్చింది. ఇక చివరగా మొత్తం బిజెపి పరమైపోయింది. ప్రస్తుతం అసోం లోని బిజెపి నేతృత్వ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా వున్న శర్వానంద సోనోవాల్‌ గతంలో ఎజిపి నాయకుడే. 2011లో ఆయన బిజెపి కి ఫిరాయించారు. ఈనాడు ఎజిపి పరిస్థితి చాలా పేలవంగా వుంది. బిజెపి ప్రభుత్వంలో కేవలం భాగస్వామిగా కూర్చోవడం తప్ప మరో పాత్ర లేకుండా పోయింది.
ఆంధ్ర ప్రదేశ్‌లోని తెలుగుదేశం, ఉత్తరప్రదేశ్‌ లోని బహుజన సమాజ్‌ పార్టీలు బిజెపితో పొత్తు పెట్టుకుని మూల్యం చెల్లించుకున్నాయి. గత లోక్‌సభ ఎన్నికలు ముందుగా బిజెపితో తెలుగుదేశం సంబంధాలు తెగతెంపులు చేసుకున్నపుడు కొద్దిమంది ఎంపీలు బిజెపికి ఫిరాయించడం చూశాం. గతంలో బిజెపితో వున్న పొత్తు వల్ల దళితులు, బహుజనుల వాణిగా బిఎస్‌పికి వున్న పేరు ప్రతిష్టలు క్షీణించాయి. పశ్చిమ బెంగాల్‌ లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ వాజ్‌పేయి ప్రభుత్వంలో భాగస్వామి, 1999 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుంది. తీవ్రంగా భయానక పరిస్థితులను సృష్టించడం ద్వారా, వామపక్షాలపై భౌతిక దాడులకు దిగడం ద్వారా బిజెపి ఎదుగుదలకు వీలు కల్పించింది. బెంగాల్‌ రాజకీయాల్లో మతోన్మాద భూతాన్ని పెంచి పోషించిన తర్వాత మమతా బెనర్జీ అప్పుడు బిజెపి ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలను పొందింది.

ఒడిషాలో నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వం లోని బిజూ జనతాదళ్‌ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కేంద్రం లోని మోడీ సర్కార్‌కు సహకారం అందిస్తున్నాయి. పార్లమెంట్‌ చివరి సమావేశంలో ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులతో సహా మోడీ సర్కార్‌ తీసుకు వచ్చిన ప్రధానమైన చట్టాలన్నింటికీ వారు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతిస్తూనే వున్నారు.

ఒడిషాలో బిజెడికి ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి ఇప్పటికే ఆవిర్భవించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా బిజెడిని ఓడించడానికి చూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి, తెలుగుదేశం పార్టీలు బిజెపి మెప్పును పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇటువంటి కపట రాజకీయాలకు చెల్లించాల్సిన మూల్యం ఎంతనేదానితో నిమిత్తం లేకుండా ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.

ఈ పార్టీలు, ప్రభుత్వాల్లో కొన్ని సిబిఐ, ఇ.డి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి నిరంతర ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఆ కారణంగానే, మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులపై తీవ్రంగా దాడి చేసినా, సమాఖ్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా ఆ నిరంకుశ చర్యల పట్ల వీరు మౌనం వహిస్తున్నారు. ఏక పార్టీ- బిజెపి ఆధిపత్యమున్న ఈ కొత్త శకం విసిరిన సవాలుతో ఎదురైన సంక్షోభంలో ప్రాంతీయ పార్టీలు వున్నాయి.

కాంగ్రెస్‌పై పోరాడడం ద్వారా అనేక ప్రాంతీయ పార్టీలు వృద్ధి చెందాయి. కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాయి. డిఎంకె, టిడిపి, ఎజిపి, బిజెడి, అకాలీలు ఇవన్నీ ఈ కోవ లోకే వస్తాయి. బిజెపి గుత్తాధిపత్య శక్తిగా ఆవిర్భవించినప్పటికీ డిఎంకె మినహా ఈ పార్టీలన్నీ కొత్త వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మార్చుకోలేకపోతున్నాయి. ఇంకా పాత రాజకీయాల చట్ర పరిధి óలోనే కొట్టుకుంటున్నాయి. ఫలితంగా, ఈ రాష్ట్రాల్లో పలువాటిల్లో కాంగ్రెస్‌ క్షీణించడంతో సంబంధిత ప్రధాన ప్రాంతీయ పార్టీ నుండి పెద్దగా ప్రతిఘటన లేకుండానే బిజెపి ఈ ఖాళీని భర్తీ చేయగలుగుతోంది.
అంటే తమ పాత శత్రువు కాంగ్రెస్‌తో ఈ ప్రాంతీయ పార్టీలు చేతులు కలపాలని కాదర్ధం. బిజెపిని తమ ప్రధాన ప్రత్యర్ధిగా గుర్తించి, దానికి వ్యతిరేకంగా పని చేయాలని అర్ధం.

కేంద్రంలోని నిరంకుశ బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకించరాదన్న తమ వైఖరి కారణంగానే నలు వైపుల నుండి బిజెపి పాల్పడుతున్న దాడులకు లక్ష్యాలుగా మారుతున్నారు. మోడీ ప్రభుత్వంతో రాజీ పడిపోయి హిందూత్వ రాజకీయాలను ప్రతిఘటించడానికి తిరస్కరిస్తున్న ప్రాంతీయ పార్టీలు ఒక విషయాన్ని గుర్తించాల్సి వుంది. బిజెపితో పొత్తు పెట్టుకుని, మోడీ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న ప్రాంతీయ పార్టీలకు ఏ గతి పట్టిందో తెలుసుకుని వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఎన్‌డిఎలో దీర్ఘకాలం మిత్రులుగా వున్న శివసేన, అకాలీదళ్‌…ప్రభుత్వం నుండి, పొత్తు నుండి బయటకు వచ్చేశాయి. నితీష్‌ కుమార్‌ను బలహీనపరిచేందుకు ఎన్‌డిఎ మరో మిత్రపక్షమైన లోక్‌ జనశక్తి పార్టీని బిజెపి ఉపయోగించడంతో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జెడి(యు), నితీష్‌ కుమార్‌ల ప్రభావం తగ్గింది. తన సంపూర్ణ గుత్తాధిపత్యాన్ని స్థాపించుకునేందుకు బిజెపి సిద్ధంగా వుంది. తన మిత్రపక్షాలన్నింటినీ పూర్తిగా అణచివేయడానికి సిద్ధంగా వుంది. సమాజాన్ని సజాతీయం చేయాలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యంగా వుంది. వైవిధ్య భరితమైన సామాజిక, సాంస్కృతిక, ప్రాంతీయ గుర్తింపులన్నీ హిందూత్వ కారణంగా పొగచూరిపోతున్నాయి. ఇది ప్రాంతీయ పార్టీల మనుగడకు ముప్పుగా పరిణమిస్తోంది.

ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఎంచుకోవాల్సిన మార్గం ఏంటనేది చాలా స్పష్టంగా వుంది. రాజకీయంగా, సైద్ధాంతికంగా బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌పై పోరు సల్పడం లేదా, లొంగిపోయి, కనిపించకుండా పోవడమో తేల్చుకోవాలి. ప్రజాస్వామ్యం, ఫెడరలిజం కాపాడడం కోసం ప్రాంతీయ పార్టీలకు కీలకమైన అవకాశం వుంది.

(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

Courtesy Prajashakti

Search

Latest Updates