పిట్టల్లా పడిపోయారు

Published on

  • నోటి వెంట నురగ.. కాళ్లూ చేతుల్లో వణుకు
  • ఫిట్స్‌ లక్షణాలతో అల్లాడిన చిన్నారులు, యువతులు, వృద్ధులు
  • దాదాపు 100 మందికిపైగా ఆస్పత్రిలో చేరిక
  • వైద్యులకూ అంతుబట్టని వైనం.. పరామర్శించిన వైద్య మంత్రి 
  • ఏలూరులో తీవ్ర కలకలం.. వాయు, జల కాలుష్యంతోనేనా?

ఏలూరు క్రైం : ఇంటి ముందు వాకిట్లో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలిక అకస్మాత్తుగా నేలపై పడి నోటి వెంబడి నురుగులు కక్కుతూ మూర్చ వచ్చి కొట్టుకులాడి స్పృహ కోల్పోయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయి ఆ బిడ్డను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సెలైన్లు, ఇంజక్షన్లు ఇవ్వగా కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చింది. మరో ఘటనలో రోడ్డుపై నడుస్తున్న 18 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా కిందపడిపోయి ఫిట్స్‌తో కొట్టుకులాడుతూ స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు యువకుడి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెనువెంటనే ఆ యువకుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈలోపే సాధారణ స్థితికి చేరుకున్నాడు.

మరికొన్ని ఘటనల్లో యువతులు కూడా ఇలానే అకస్మాత్తుగా నేలపై పడి కొట్టుకులాడి, స్పృహ కోల్పోయారు. ఇలా.. ఆరేళ్ల పసిబిడ్డ నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. శనివారం ఉదయం ఏలూరు నగరంలోని దక్షిణపు వీధిలో మొదలైన ఈ అంతుపట్టని వ్యవహారం రాత్రికి నగరంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. శనివారం ఉదయం ఒకొక్కరుగా ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రి వైద్యులు సాధారణ ఫిట్స్‌గా భావించి సేవలు అందించారు. అయితే, సాయంత్రానికి వీరి సంఖ్య వంద దాటడడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వ్యాధి ఏమిటనే దానిపై చర్చించారు. దాదాపు వంద మంది ఇలా పడిపోవడంతో ప్రతి ఒక్కరికీ సిటీస్కానింగ్‌ నిర్వహించారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అంతుపట్టని వ్యాధిగా వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరిన ఆరేళ్ల ప్రభ అనే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ వ్యాధి నిర్ధారణపై ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు.

నగరంలోని దక్షిణపు వీధి ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లి ఇంటింటి సర్వే చేపట్టారు. వారు తిన్న ఆహారం, తాగిన నీరు, పరిసరాలను పరిశీలించారు. శనివారం రాత్రికి నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఒకొక్కరుగా ఆసుపత్రికి రావడంతో నగరం అంతా వ్యాపించిందని గుర్తించారు. అయితే గాలి కాలుష్యమా, నీటి కాలుష్యమా, దోమల వలన వచ్చిందా అనేది అంతుచిక్కలేదు. ఆసుపత్రి చీఫ్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ పోతుమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు వైద్య సేవలు అందిస్తున్నాయి.

బాధితులకు మంత్రి పరామర్శ
విషయం తెలిసిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆయా ప్రాంతాలను శనివారం రాత్రి పరిశీలించారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. వైద్యులు కూడా అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రిలో చేరిన వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, 108 వాహనాలను అందుబాటులో ఉంచామని వివరించారు.

Courtesy Andhrajyothi

Search

Latest Updates