ప్రయివేటు వ్యవసాయ మార్కెట్లతో నష్టమే

Published on

– ఆర్‌. రామ్‌ కుమార్‌

ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పెల్లుబుకిన ఉద్యమం ఢిల్లీ అధికార పీఠంలో ఉన్నవారికి ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వం చెపుతున్న దాని ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రయివేటు మార్కెట్లు ఏర్పాటు అవుతాయి, మధ్య దళారీలు మాయమవుతారు, రైతులు స్వేచ్ఛగా తమ సరుకును ఎవ్వరికైనా అమ్ముకోవచ్చు, కళ్లం దగ్గర ధర కూడా పెరుగుతుంది. రైతులు మాత్రం ఈ వాదనను అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కార్పొరేట్‌ సంస్థలు వ్యవసాయ మార్కెట్‌లో ప్రవేశించడంతో పాటు కనీస మద్దతుధర అనే పద్ధతిని లేకుండా చేయడానికే ప్రభుత్వం ఈ వాదనలు చేస్తున్నదని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానమైన వాదనలను వాటికి సంబంధించిన సమాధానాలను ఒకసారి పరిశీలిద్దాం… ఎక్కువ మండీలు అవసరం: వ్యవసాయదారుల ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం- సౌలభ్యం)ల చట్టం 2020 ప్రకారం గ్రామీణ ప్రాంతంలో మార్కెట్‌ కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. ఈ అంచనా తప్పు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే వరి 29శాతం, గోధుమ 44శాతం మాత్రమే మండీలలో అమ్మబడుతున్నాయి. అంటే 49శాతం వరి, 36శాతం గోధుమలు అడ్తీ వ్యాపారులకే అమ్ముతున్నారు. మరో రకంగా చూస్తే రైతులు పండించిన పంటలో ఎక్కువ భాగం మండీలలో అమ్మడం లేదు. రెండు కారణాల వల్ల రైతులు మండీలకు బయటనే అమ్ముకుంటున్నారు. మొదటి కారణం కావాల్సినన్ని మండీలు లేకపోవడం. 1976లో దేశం మొత్తం మీద 4,145 పెద్ద మార్కెట్లు ఉండేవి, సగటున 775 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పనిచేస్తుండేవి. జాతీయ వ్యవసాయ కమిషన్‌ సూచన ప్రకారం ఒక రైతు తన ఎండ్లబండిలో ఒక గంటలో మండీకి చేరుకునేలా ఉండాలి. ఈ సూచన అమలు జరగాలంటే ఒక మండీ 80చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండాలి. దీనిప్రకారం చూస్తే దేశంలో 41,000 మండీలు ఉండాలి. కానీ 2019లో 6630 మండీలు మాత్రమే ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే 463 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక మండీ ఉన్నది. ఒక ప్రభుత్వ కమిటీ వేసిన లెక్కల ప్రకారం 2017లో 10,130 మండీలు ఉండాలని సూచించింది. ఏ లెక్క ప్రకారం చూసినా మండీల సంఖ్య తప్పనిసరిగా పెరగాల్సిందే అనేది అర్థం అవుతున్నది. రెండవ కారణం చిన్న, మధ్య తరగతి రైతులు తాము అమ్ముకునే కొద్దిపాటి పంట కోసం రవాణా చార్జీలు భరించి మండీకి తీసుకువెళ్ళి అమ్మితే గిట్టుబాటు కాదు. కాబట్టి రైతు తన గ్రామంలోని అడ్తీ వ్యాపారికే తక్కువ ధరకైనా అమ్ముకోవడానికి సిద్దపడుతున్నాడు. మండీల స్థానంలో ప్రయివేటు మార్కెట్‌లు ఏర్పాటు చేసినా చిన్న, మధ్య తరగతి రైతులు తమ గ్రామంలోని అడ్తీ వ్యాపారికే తమ సరుకు అమ్ముకుంటారు. ఈ పరిస్థితి మారాలంటే పొలం దగ్గరే మెరుగైన ఆర్థిక వెసులుబాటు ఏర్పడాలి.

రెండవది మండీలకు బయట అమ్ముకునే అవకాశం ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఉన్నది. ఇప్పటికే 18 రాష్ట్రాలు ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్‌లకు బయట ప్రయివేటు మార్కెట్‌లు ఏర్పాటు చేసుకునే అనుమతిని ఇచ్చి ఉన్నాయి. 19 రాష్ట్రాలలో రైతుల దగ్గర నేరుగా కొనుగోలుచేసుకునే అవకాశం ఇచ్చాయి. ప్రభుత్వం ఇన్ని అవకాశాలు కల్పించినా ఇప్పటికీ ప్రయివేటు రంగం నుంచి చెప్పుకోదగ్గ పెట్టుబడి వ్యవసాయ రంగానికి రాలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అది కూడా కొన్ని పంటలకు మాత్రమే ప్రయివేటు మార్కెట్లు ఏర్పడ్డాయి.

మార్కెట్‌ వ్యవస్థలో ప్రయివేటు పెట్టుబడి బాగా తక్కువ ఉండటానికి ప్రధాన కారణం పంట సేకరణ సందర్భంలో అయ్యే లావాదేవీలు ఎక్కువ ఉండటం, రాశి వేయడానికి ఎక్కువ ఖర్చులు కావడం. మండీలు, అడ్తీ వ్యాపారంలోకి ప్రయివేటు వ్యాపారులు ప్రవేశించడానికి వస్తే కొత్త సేకరణ కేంద్రాల ఏర్పాటు చేయడానికి విపరీతమైన ఖర్చు అవుతుంది. దానితోపాటు సిబ్బంది జీతాలు, నాణ్యత బట్టి విడతీయడం, నిల్వ చేయడం, రవాణ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చిన్న, మధ్య తరహా రైతులు పెరిగిన కొద్దీ ఖర్చు కూడా పెరిగిపోతుంది. కార్పొరేట్‌ సంస్థలు నగరాల్లో ఏర్పాటు చేసిన చిల్లర గొలుసుకట్టు దుకాణాలలో అమ్మకం, నిల్వచేయడానికి అదనపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రెండవది సరుకు మురిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మాల్స్‌ నడిపేవారు కూరగాయలు, పండ్లు, మండీల నుంచే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. నేరుగా రైతుల నుంచి కొనేందుకు ఇష్టపడటం లేదు.

లావాదేవీల ఖర్చులు: ప్రయివేటు మార్కెట్లు ఏర్పాటు అయినా మండీలలో చెల్లించే పన్నులకు సమానంగా లావాదేవీల ఖర్చులు ఉంటాయి. అందుకని ప్రయివేటురంగంలో రైతులు అధిక ధరలు పొందుతారు అనేందుకు హామీ ఏమీలేదు. ప్రస్తుతం నడుస్తున్న ప్రయివేటు మార్కెట్‌లలో కూడా రైతులు ఎక్కువ రేటేమీ సంపాదించుకోవడం లేదు. మండీ పన్నుల కంటే బయట లావాదేవీలకు ఎక్కువ ఖర్చు అయితే అది కూడా రైతు నెత్తిన పడుతుంది. తద్వారా ధర తగ్గిపోతుంది. దానితో రైతు నుంచి మరింత ధర పిండినట్టు అవుతుంది.

మండీలలో వసూలు చేస్తున్న పన్నులు నిరుపయోగం అని చాలా మంది వాదిస్తుంటారు. మండీలలో వసూలు అయిన పన్నులు మండీలలో మౌలిక సదుపాయాల కల్పనకే తిరిగి ఖర్చు పెట్టుతుంటారు. మండీల పన్నులు తగ్గిస్తే సౌకర్యాల కల్పనకు మిగులు ఏర్పడక నిధులు తగ్గిపోతాయి. దానితో ఏ అభివృద్ధీ జరగదు.

పంజాబులో ప్రభుత్వం మార్కెట్‌ కమిటీ ఫీజు, గ్రామీణ అభివృద్ధి ఫీజు పేరుతో రెండు ఫీజులు వసూలు చేస్తున్నది. పంజాబ్‌ మండీ బోర్డులు ఈ నిధులను గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి, మనుషులు, పశువులకు వైద్య సౌకర్యాలు అందించే దావాఖానాలకు, తాగునీటిసరఫరాకు, మురుగు నీళ్ళ నిర్వహణకు, గ్రామీణ విద్యుదీకరణకు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఉపశమనం కల్పించేందుకు వాడుతున్నారు. మండీల వ్యవస్థను నిర్వీర్యం చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, నిర్వహణకు నిధుల కొరత ఏర్పడుతుంది.

కనీస మద్దతు ధర భవిష్యత్‌ ఏమిటి: కనీస మద్దతుధర అనేది కాగితాల మీద ఉంటుంది. ఇప్పుడు రూపొందిస్తున్న విధానాలను గమనిస్తే కనీస మద్దతుధరను నిర్వీర్య చేసే వ్యూహం కనబడుతున్నది. ఉత్పత్తి ఖర్చులు, కూలీల ఖర్చులు, వ్యవసాయంలో చాలా వేగంగా పెరుగుతున్నాయి. అందుకని కనీస మద్దతుధరను ప్రతి సంవత్సరం పెంచితేనే పెరుగుతన్న ధరలకు అనుగుణంగా జీవన ప్రమాణాలను కాపాడుకోవచ్చు. గత ఐదు, ఆరేండ్లుగా కనీస మద్ధతు ధర చాలా నెమ్మదిగా పెరుగుతున్నది.
రెండవ అంశం కనీస మద్దతు ధర నిర్ణయించేందుకు ఉత్పత్తి ఖర్చులో కుటుంబ శ్రమ విలువను కూడ కలిపి ఆపై 50శాతాన్ని కలిపి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. దీనితో రైతులు ప్రతి పంటలో రూ.200 నుంచి రూ.500 వరకు ప్రతి క్వింటాల్‌కు నష్టపోతున్నారు. వ్యవసాయ ధరలు, ఖర్చుల కమిషన్‌ ప్రభుత్వానికి బహిరంగంగా జరుగుతున్న ఆహారధాన్యాల కొనుగోళ్ళను అరికట్టాలని సూచించింది. రైతులకు నష్టదాయకమైన ఈ విధానాలు రైతులకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

పంజాబ్‌, హర్యాణ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో పంటల కొనుగోళ్ళు కనీస మద్దతు ధరకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, మండీలలో జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలోని రైతులు చట్టపరంగానే తమకు రెండువైపులా నష్టం జరగవచ్చని భావిస్తున్నారు. మండీలు బలహీనపడి, ప్రయివేటు మార్కెట్లు ప్రవేశించి కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వకుండా విస్తరించితే కాలక్రమంలో వీరికి కనీస మద్దతుధర రాకుండా పోతుందని భావిస్తున్నారు.

ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లు విజయ వంతంగా పనిచేస్తున్నాయి. అయినా రాష్ట్రాలు మండీలను తిరస్కరించి రద్దు చేయాలని నవంబర్‌ 2019లో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పినారు. ఈ అంశాన్ని రైతులు గమనిస్తూనే ఉన్నారు. నిరసన తెలుపుతున్న రైతులను దేశద్రోహులని, ఖలిస్థాన్‌ వాదులని ముద్రవేయడం కూడా రైతులను ప్రభుత్వం నుంచి దూరం చేసింది. ప్రభుత్వం వ్వయ సాయ బిల్లుల విషయంలో చేసిన శాసనపరమైన దుస్సాహసం సరైన చర్య కాదు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ప్రభుత్వం పునరాలోచించుకుని బేషరతుగా రైతులను చర్చలకు ఆహ్వానించాలి. ఇదే సందర్భోచిత ప్రారంభం అవుతుంది.

Courtesy Nava Telangana

Search

Latest Updates