విశాఖ ల్యాండ్‌పూలింగ్‌ – వాస్తవాలు

Published on

  * కె. లోకనాథం

ఇటీవలి అసెంబ్లీ సమావేశంలో ఇళ్ళ స్థలాలపై జరిగిన చర్చలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి…విశాఖ భూములపై వాస్తవాలు చెప్పకుండా నిండు శాసనసభను, ప్రజలను పక్కదారి పట్టించారు. కమ్యూనిస్టుల పైన విషం కక్కారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ట్రైజంక్షన్‌ పేరుతో రైతుల వద్ద భూములను బలవంతంగా తీసుకోవాలని ప్రయత్నించింది. దీనిని నిరసిస్తూ పెద్దఎత్తున రైతులు పోరాటాలు నిర్వహించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ఆర్‌సిపి వారికి మద్దతునిచ్చి తెలుగుదేశం ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని అనేక సందర్భాల్లో దుయ్యబట్టింది. అలాంటిది, పేదల తరపున వుండాల్సిన కమ్యూనిస్టులు మారిపోయారని వైఎస్‌ఆర్‌సిపి వారు మాట్లాడడం హాస్యాస్పదంగా వుంది. నిరంతరం ప్రజల తరపున పోరాడుతున్నది కమ్యూనిస్టులు మాత్రమే. మార్పు వచ్చింది వైఎస్‌ఆర్‌సిపి పార్టీ విధానంలో తప్ప కమ్యూనిస్టుల్లో కాదని అర్ధం చేసుకోవాలి.

ప్రతిపక్షంలో వున్నప్పుడు ల్యాండ్‌పూలింగ్‌ను వ్యతిరేకించి, నేడు విశాఖలో ల్యాండ్‌పూలింగ్‌కు పూనుకోవడం సరైందేనా? దళితులు, పేదలు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా లాక్కోవడం ప్రభుత్వ విధానామా? కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా భూములు గుంజుకోవడం న్యాయమా? ఈ భూములపై ఆధారడిపన కూలీలు, వృత్తిదారులు, చిరు వ్యాపారుల సంగతేంటి? 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి ల్యాండ్‌ పూలింగ్‌ చేయడం చట్టవ్యతిరేకం కాదా? ప్రతిపక్షంలో వున్నప్పుడు ఒకలాగా? అధికారంలోకి వచ్చాక మరోలాగా మాట మార్చి మాట్లాడడంలోనే ఏలికల రెండు నాల్కల ధోరణి అర్ధమౌతుంది. ప్రభుత్వం జారీచేసిన జీఓ నెం. 72 చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని 23-3-2020న హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులో సైతం చెప్పింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రైతుల నుండి భూములు తీసుకోవద్దని, ప్రభుత్వాన్ని కౌంటర్‌ ఫైల్‌ దాఖలు చేయమని పేర్కొంది. కాని వాటిని పట్టించుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లినవారిని నిండు శాసనసభలో నిందించడం కోర్టు ఉత్తర్వులకు విరుద్ధం.

నష్టపరిహారం ఊసేది?
దళితులు, పేదలు సాగు చేసుకుంటున్న 6,116.5 ఎకరాలను బలవంతంగా లాక్కోవడానికి ‘విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారటీ’ (విఎంఆర్‌డిఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భూముల సమీకరణకు జీఓ నెం.72 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో కంటితుడుపు ప్యాకేజీ తప్ప నష్టపరిహారం ఊసే లేదు. తరతరాలుగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల రైతులు సదరు భూములలో సాగు చేసుకుంటున్నారు. వీరంతా సన్న, చిన్నకారు రైతులు. ఈ భూములు తప్ప ఏ ఆధారంలేని అభాగ్యులు. వారి నుండి భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తే పేద రైతులు ప్రతిఘటించి పోరాడారు. వీరికి అండగా కమ్యూనిస్టులు నిలబడి వారి పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం మూడేళ్ళుగా ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటే వాటిపై పూర్తి హక్కు లు కలిగి వుంటారు. వీటికి తిలోదకాలు ఇస్తూ పేదలను ఆక్రమణదారులుగా ముద్ర వేయడం అన్యాయం. భూముల సమీకరణకు నిర్వహించిన గ్రామసభల్లో భూములు ఇవ్వబోమని రైతులు అభ్యంతరాలు తెలియజేశారు. రైతుల అభ్యంతరాలను అధికారులు పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు ఉన్నతాధిరుల దృష్టికి తీసుకెళ్ళినా కనీస చర్యలు తీసుకోలేదు.

విఎంఆర్‌డిఎ పెత్తనం
ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా భూములను ప్రభుత్వం నేరుగా సమీకరించకుండా విఎంఆర్‌డిఏ ద్వారా సమీకరిస్తోంది. ఈ సంస్థ డెవలపర్‌గా ఉంటుంది. అందులో మూడు ప్యాకేజీలు పెట్టారు. రైతు ఒక ఎకరం భూమి ఇస్తే…ఆ భూమికి పట్టా ఉంటే 900 గజాల స్థలం, పట్టా లేకుండా 10 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు సాగు చేసుకుంటున్న భూమికి 450 గజాలు, 5 నుండి 10 సంవత్సరాల లోపు భూమి యజమాని సాగులో వుంటే 250 గజాల స్థలం…5 నెలల తర్వాత కేటాయిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ప్రభుత్వం సక్రమమైన పద్ధతిలో చట్టాలను అమలు చేస్తే ప్రజలు ఎందుకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. జిల్లా స్థాయి అధికారులు కనీసం వారి గోడు కూడా వినటం లేదు కాబట్టే… హైకోర్టులో తమ బాధలను విన్నవించుకుంటున్నారు. విశాఖ ల్యాండ్‌ పూలింగ్‌ కేసుకు సంబంధించి (23-3-2020) హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఇంతవరకు రైతులను, బాధితులను కనీసం మీ అభ్యంతరం ఏమిటని అడిగినవారే లేరు. హైకోర్టు ఇచ్చిన స్టేలో కూడా చట్టం ప్రకారం సమస్య పరిష్కరించండని చెప్పింది. ఈ సమస్యలను పరిష్కరించకుండా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తుంటే అడ్డు పడుతున్నారని నిండు సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం ఎంతవరకు న్యాయం? పేదల భూములు తీసుకొని పేదలకే ఇళ్ళ స్థలాలు ఇస్తామని ప్రభుత్వం ఆదేశాలు మంజూరు చేయడం ఎంతవరకు సమంజసం? ఆ భూములను విఎంఆర్‌డిఏకు అప్పజెప్పి ఎవరి వాటా వారికి ఇచ్చి ‘విఎంఆర్‌డిఏ’ కూడా డెవలపర్‌గా కొంత భూమి తీసుకొని పేద రైతులకు, దళితులకు అన్యాయం చేయడం సరైందేనా?

2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయరే?
పేదలపై శ్రద్ధ వుంటే 2013 భూసేకరణ చట్టం ద్వారా భూములు సమీకరించవచ్చు. కాని దానికి భిన్నంగా విశాఖలో ల్యాండ్‌పూలింగ్‌ జరుగుతోంది. 2013 భూసేకరణ చట్టం ద్వారా భూములు సమీకరిస్తే ఆ భూములు సాగు చేసుక్ను రైతులకు నష్టపరిహారం ఇవ్వడం, ఆ భూములపై ఆధారపడిన కూలీలకు, వృత్తిదారులకు, చిరు వ్యాపారస్తులకు రూ.5 లక్షల ప్యాకేజీ, లేదంటే 20 సంవత్సరాలపాటు నెలకు రూ.2000 చొప్పున పింఛన్‌ ఇవ్వాలి. దీనివల్ల ఉభయులకు శ్రేయస్కరం. కాని రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయకుండా ఎదురుదాడి చేస్తోంది.

తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి ఉభయ పార్టీలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులను, తమ అనుయాయులను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే…పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనే సంకల్పం వుంటే…ధనిక వర్గాలు ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలను వెనక్కి తీసుకోవాలి. ఆ భూములనే పేదలకు, ఇళ్ళ స్థలాలకు కేటాయించవచ్చు. అలా కాకుండా దళితులు, సన్న, చిన్నకారు రైతులు వద్ద వున్న భూములను ఇళ్ళ స్థలాల కోసం గుంజుకోవడం అన్యాయం. ప్రభుత్వ వైఫల్యాలను కమ్యూనిస్టులు ఎత్తిచూపుతుంటే వారిపై ఎదురుదాడి చేస్తున్నారు తప్ప ఆ సమస్యలను పరిష్కరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా భూములను సమీకరించి పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అంతే తప్ప, వాస్తవాలను వక్రీకరించి చెప్పడం తగదు.

(సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి)

 

Search

Latest Updates