ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో మరో భారతీయుడిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ గతేడాది కెనడాలో (Canada) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుతో సంబంధమున్న ముగ్గురు భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా శనివారం అమన్‌దీప్ సింగ్ అనే 22 ఏండ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ గురువారం స్పందించారు. ఈ కేసులో భారతీయుల అరెస్ట్‌పై తమకు కెనడా అధికారిక సమాచారమేమి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కెనడా వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్బంగా ఆయన ఎండగట్టారు. ఈ తరహా చర్యల వల్ల.. వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు రాజకీయ అవకాశం కల్పించినట్లు అవుతుందని ఆందన్నారు.
ఇక కెనడాలోని బ్రాంప్టన్‌లో నివసిస్తున్న అమన్‌దీప్.. ఆయుధాలకు సంబంధించిన కేసులో అంటారియో పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అతడిని తమ అదుపులోకి తీసుకున్నామని ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్‌చార్జి మన్‌దీప్ మూకర్ వెల్లడించారు.
ఇదే కేసులో కరణ్ బ్రార్, కమల్‌ప్రీత్ సింగ్, కరణ్‌ప్రీత్ సింగ్‌లను పోలీసులు గత వారం అరెస్టు చేశారు. అయితే నిజ్జార్ హత్య తర్వాత భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడ్డ విషయం తెలిసిందే. నిజ్జార్ మర్డర్ వెనుక భారతీయ ఏజెంట్లు ఉన్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. కానీ ఆ ఆరోపణలను భారత్ ఖండించిన విషయం తెలిసిందే. ఇండియాలో వాంటెడ్ లిస్టులో ఉన్న ఉగ్రవాది నిజ్జార్‌ను 2023, జూన్ 18వ తేదీన కెనడాలోని సర్రేలో ఉన్న ఓ గురుద్వారా వద్ద హత్య చేశారు.