వరుస ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు పార్టీ ప్రకటన

Published on

  • వరుస ఎన్‌కౌంటర్లో 45 మంది గ్రామస్తులు
  • పూజలు చేసుకుంటున్న వాళ్లని చుట్టుముట్టి కాల్చి చంపారు
  • మృతదేహాల పట్ల అమానవీయంగా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారు
  • దండకారణ్యాన్ని సైనిక కంటోన్మెంట్‌గా మార్చివేశారు
  • చర్చలపట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
  • మారణకాండపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌
  • చర్చలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రజాసంఘాలకు పిలుపు

ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన వరుస ఎన్‌కౌంటర్లపై మావోయిస్ట్‌ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ పేరిట పత్రిక ప్రకటన విడుదలైంది. జనవరి నుంచి దండకారణ్యలో ఎన్‌కౌంటర్‌, క్రాస్‌ ఫైరింగ్‌ పేరుతో 107 మందిని పోలీస్‌ బలగాలు హతమార్చారని తెలిపారు. ఇప్పటి వరకు 27 సంఘటనలు జరిగినట్లగా పోలీసు వర్గాలు చెబుతుంటే వాటిలో 18 తప్పుడు ఎన్‌కౌంటర్లు అని వికల్ప్‌ పేర్కొన్నారు.

జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 107 మందిని హత్య చేస్తే అందులో 40-45 మంది గ్రామస్తులను పట్టుకెళ్లి బూటకపు ఎదురుకాల్పుల్లో కాల్చి చంపారన్నారు.

ఏప్రిల్‌ 2న జరిగిన కోర్చెలి ఘటనలో 13 మంది అమరవీరుల్లో కేవలం 4 మంది మాత్రమే మా పార్టీకి చెందిన పీఎల్‌జీఏ చెందిన సభ్యులు కాగా మిగిలిన 9 మంది గ్రామస్తులనీ, ఎన్‌కౌంటర్‌ తర్వాత వాళ్లని పట్టుకుని కాల్చి చంపారని ఆరోపించారు. 13 మంది నక్సలైట్లను హతమార్చడంలో ఇది పెద్ద విజయంగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దెవచేశారు.

ఏప్రిల్‌ 30న, నారాయణపూర్‌ జిల్లాలోని కాకూర్‌-తాకమెట్టా ఎన్‌కౌంటర్‌ సందర్భంగా జరిగిన ఘటనలో కాకూర్‌లో పూజలు చేయడానికి గుమిగూడిన ప్రజలను చుట్టుముట్టి నలుగురు గ్రామస్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపేశారని విమర్శించారు. తమ పార్టీకి చెందిన సీనియర్‌ కామ్రేడ్‌ జోగన్న (62) నిరాయుధుడిని పట్టుకుని దారుణంగా హత్య చేయచేశారని తెలిపారు.

కంకేర్‌ జిల్లాలోని హపటోలా ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన 29 మంది సహచరులలో, 11 మంది నిరాయుధులనీ కొత్త కామ్రేడ్‌లను పట్టుకుని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్మారకం వద్దకు తీసుకెళ్లి అక్కడ వారిని కర్రలతో తీవ్రంగా కొట్టి, తుపాకితో కాల్చి, అమానవీయంగా హత్య చేశారని విమర్శించారు. బూటకు ఎన్‌కౌంటర్‌లకు పాల్పడటమే కాకుండా ఎన్‌కౌంటర్లలో అమరులైన వ్యక్తుల మృతదేహాలను వారు అవమానకరంగా, అమానవీయంగా మరియు క్రూరమైన రీతిలో వ్యవహరిస్తున్నారని దీన్ని అందరూ ఇది ఖండిరచాలని పిలుపునిచ్చారు.

మొత్తం దండకారణ్యంలో బ్రాహ్మణ హిందుత్వ ఫాసిస్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై యుద్ధం చేస్తున్నాయని, జాతీయ, అంతర్జాతీయ చట్టాలను దారుణంగా ఉల్లంఘిస్తున్నాయన్నారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను విస్మరించి గిరిజన ప్రాంతాల్లో సాయుధ బలగాలను విచక్షణారహితంగా మోహరిస్తున్నారని తెలిపారు.

దండకారణ్యాన్ని సైనిక కంటోన్మెంట్‌గా మార్చివేశారని. దీంతో పాటు కార్పొరేట్‌ కంపెనీల కోసం గనులు ద్వారాలు తెరుస్తున్నారని.. పోలీసు క్యాంపుల కోసం, గనుల తరలింపు కోసమే విెశాలమైన రోడ్లు, కల్వర్టులు నిర్మిస్తున్నారు. ఈ విధ్వంసం కోసమే అడవుల్లో లక్షలాది చెట్లను నరికివేస్తున్నారని, గ్రామసభల అనుమతి లేకుండానే ఇదంతా చేస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ అడవులను, భూమిని, నీటిని కాపాడుకునేందుకు సాగుతున్న ప్రజా ఉద్యమాలను తుపాకీతో అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.. పెట్రోలింగ్‌ పేరుతో గ్రామాలపై దాడులు చేయడం, మహిళలపై అత్యాచారాలు చేయడం, ప్రజలను కొట్టడం, ఆస్తులను దోచుకోవడం, నష్టం కలిగించడం రోజురోజుకూ కొనసాగుతుంని, హాట్‌బజార్‌లు, సంప్రదాయ జాతరలు, మార్కెట్‌లలో ప్రజలను కొట్టడం, కాల్చడం ద్వారా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తెలిపారు.

ఏప్రిల్‌ 7న సుకుమా-బీజాపూర్‌ సరిహద్దు గ్రామాలపై మరోసారి వైమానిక దాడులు నిర్వహించారని. ఏప్రిల్‌ 12న చుట్టుపక్కల గ్రామాలు, పొలాలు, అడవుల్లోని పూర్వి పోలీస్‌ ఫార్వర్డ్‌ బేస్‌ క్యాంపు నుంచి 25 నుంచి 30 రాకెట్లు, బాంబులు పేల్చారని, ఈ శిబిరం స్థాపించబడినప్పటి నుండి, డజన్ల కొద్దీ బాంబు దాడుల కారణంగా చాలా మంది గాయపడ్డారని ఈ తీవ్ర అణచివేత వల్ల దండకారణ్యంలో ప్రజల జీవనోపాధి బాగా దెబ్బతింటోందని, ఇది భారత రాజ్యాంగాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని విమర్శించారు.

శత్రు దేశాలపై జరిపే యుద్ధ తరహాలో ఇక్కడ సాయుధ బలగాలు ఉపయోగించుకుంటూ, యుద్ధ ట్యాంకులను వినియోగిస్తున్నారని, వైమానిక దళానికి చెందిన గరుడ్‌ కమాండో దళాలను ఉపయోగించి డ్రోన్లు , హెలికాప్టర్లను ఉపయోగించి వైమానిక దాడులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్పొరేట్‌ మిత్రుల కోసం గిరిజనులు, విప్లవకారులపై సాగిస్తున్న ఫాసిస్టు అణచివేతను, మారణహోమాన్ని ప్రతిఘటించాలని అభ్యుదయ శక్తులు, మానవ హక్కుల సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజాస్వామిక మేధావులు, విద్యార్థులు, జర్నలిస్టులు, న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. ఈ అణచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని, సాయుధ బలగాలు సాగిస్తున్న మారణకాండపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

చర్చలకు తమ పార్టీ తరపున సానుకూలత వ్యక్తం చేసినా, తమ ప్రకటనకు ప్రభుత్వం నేరుగా సమాధానం ఇవ్వడం లేదు కానీ గిరిజనుల మారణహోమం వేగవంతమైందన్నారు. కేవలం వార్తా ప్రకటనల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రమే తప్ప ప్రభుత్వం మాటల పట్ల చిత్తశుద్ధి లేదని నేటి వాతావరణం తెలియజేస్తోందని విమర్శించారు. పాలక వర్గాలు కొనసాగిస్తున్న ఈ మారణకాండను ఆపడానికి, చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మానవ హక్కుల సంస్థలు ,ప్రజాస్వామ్య జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు.

తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అత్యాశ కోసం నీరు, అడవి, భూమి మరియు ఉనికి కోసం జరుగుతున్న ఉద్యమానికి ద్రోహం చేయవద్దని పోలీసు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్న వారికి విజ్ఞప్తి చేశారు.

Search

Latest Updates