యుద్ధం అంచున గల్ఫ్‌

Published on

ఇజ్రాయెల్‌, హమాస్‌ల మధ్య గత పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరింత విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇది పశ్చిమాసియా అంతా పాకనున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనిమాను, లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో హెజ్బొల్లా టాప్‌ కమాండర్‌ ఫౌద్‌ సుక్రు హత్యల నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ఏ క్షణమైనా దాడులకు దిగవచ్చనే వార్తలు వస్తున్నాయి.

ఇరాన్‌ మద్దతు గల లెబనాన్‌ కేంద్రంగా నడిచే హెజ్బొల్లా గ్రూపు శనివారం రాత్రి ఇజ్రాయెల్‌ భూభాగం వైపుగా పదుల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. చాలా వరకు రాకెట్లను తమ డోమ్‌ వ్యవస్థ అడ్డుకొన్నదని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. కాగా, రాకెట్‌ దాడుల్లో మోషవ్‌ బీట్‌ హిల్లేల్‌లో పలువురు పౌరులు గాయపడినట్టు హెజ్బొల్లా గ్రూపు ప్రకటించింది. ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగా తాము దాడులు చేపట్టామని హెజ్బొల్లా సీనియర్‌ మిలటరీ కమాండర్‌ ఒకరు తెలిపారు. మరోవైపు దక్షిణ లెబనాన్‌ నగరం బజౌరీహ్‌పై జరిపిన క్షిపణి దాడిలో కీలక హెజ్బొల్లా నేత అలీ అబ్ద్‌ హతమయ్యాడని ఇజ్రాయెల్‌ మిలటరీ వెల్లడించింది.

ఉద్రిక్తతలతో పలు దేశాలు అప్రమత్తం..
ఉద్రిక్తతల పెరుగుదల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది. పశ్చిమాసియా రీజియన్‌లోని తమ సిబ్బంది, ఇజ్రాయెల్‌ను కాపాడేందుకు సైనిక మోహరింపును పెంచినట్టు అమెరికా తెలిపింది. మరోవైపు లెబనాన్‌ను వెంటనే వీడాలని అమెరికా తమ దేశ పౌరులకు సూచించింది. పశ్చిమాసియా రీజియన్‌లో పరిస్థితి వేగంగా దిగజారుతున్నదని యూకే విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్‌ లామీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో లెబనాన్‌ను వెంటనే వీడాలని భారత్‌తోపాటు జోర్డాన్‌, ఫ్రాన్స్‌, కెనడా వంటి దేశాలు తమ దేశ పౌరులకు అడ్వైజరీ జారీచేశాయి.

Search

Latest Updates