సామాజిక విప్లవ మహోపాధ్యాయుడు

Published on

పి. విక్టర్ విజయ్ కుమార్

ప్రతి రాజ్యాంగం అప్పటి తరానికి సంబంధించిన అభిలాషను (aspirations) మాత్రమే ప్రతిబింబించగలదు. అంతే కానీ వంద సంవత్సరాల తర్వాత ఉండాల్సిన సమాజాన్ని అప్పటి రాజ్యాంగం నిర్వచించలేదు. ఆ ప్రాక్టికల్ కోణాన్ని అర్థం చేసుకోకపోతే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవడం కష్టం. ఆయన ఆలోచనా విధానాన్ని–ముఖ్యంగా పోలరైజ్డ్ పాలిటిక్స్‌ను, రిప్రజెంటేషన్ పాలిటిక్స్‌ను– ఆకళింపు చేసుకోకుంటే ఏ సైద్ధాంతికవాదమైనా సరే ఈ దేశంలో వీగిపోవలసిందే. అయినా సరే అలా కోరుకున్నాం అంటే, దానర్థం, ఇంప్రాక్టికల్‌గా అంబేడ్కర్ మొండియుద్ధానికి దిగి ఉత్తి చేతులతో అమరుడై ఈ రోజు వర్ధంతులకు మాత్రమే పరిమితం కావాలని కోరుకోవడం. ఆయన వర్ధంతులకు పరిమతమయ్యే మనిషి కాదు. ప్రతి దినం, మన దేశ రాజకీయాలను ప్రశ్నించాల్సిన ప్రజానీకానికి బీజం నాటిన నిఖార్సైన సాంఘిక విప్లవవాది!

చరిత్రలో డిసెంబర్ 6కు ఉన్న ప్రాధాన్యతల్లో బాబ్రీ మసీదును కూలగొట్టడం ఒకటైతే, అదే రోజు బాబా సాహెబ్ అంబేడ్కర్ చనిపోవడం మరొకటి. అంబేడ్కర్ తన జీవితమంతా ఆధిపత్య వాదానికి (మెజారిటేరియనిస్ట్) వ్యతిరేకంగా పోరాడి అనారోగ్యానికి గురై 65వ ఏట మరణించారు. తన జీవితాంతం వ్యవస్థలో భాగమై ఆ వ్యవస్థను తూట్లు పొడిచిన ఏకైక విలక్షణమైన (unique) ఉద్యమ కారుడు ఆయన. అమెరికా, ఫ్రెంచ్, రష్యా, చైనా విప్లవాల చరిత్ర చూస్తే నెత్తురు ఓడిస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుందనేది వాస్తవం కావొచ్చు కానీ, నెత్తురు ఓడనంత మాత్రాన మహోపాధ్యాయుడు, ఆలోచానాపరుడు, విప్లవకారుడు కాకపోనేరడు అన్నది కూడా అంతే వాస్తవం.

అంబేడ్కర్‌ బ్రిటిష్ వైస్రాయ్‌ కౌన్సిల్‌లో మంత్రిగా పని చేశారు. నెహ్రూ కేబినెట్‌లో కూడా న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తూ, రాజ్యాంగ రూపకల్పనకు అంకితమయ్యారు. సంప్రదాయ మార్క్సిస్టులు రాజ్యాంగాన్ని రూపొందించడం ఒక పాపంగా భావిస్తారు. వ్యవస్థలో భాగం కావడాన్ని ఒక రాజీగా పరిగణిస్తారు. అంబేడ్కర్‌ను తమ ఆలోచనా విధానంలోకి అహ్వానించడం అంటే అదో తక్కువ స్థాయి రాజకీయాలను ప్రేరేపిస్తున్నట్లు వారు భావిస్తారు. ఇంకోవైపు జాతీయవాదులు అంబేడ్కర్‌ను రాజ్యాంగానికి మాత్రమే పరిమితం చేసి, రాజ్యాంగవాదిగానే పరిగణిస్తారు. ఆయన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు కాబట్టి, స్వాతంత్ర్య యోధుడుగా కానీ, స్వతంత్ర దేశ నిర్మాణంలో రూపకర్తగా కానీ భావించరు. నిజానికి అంబేడ్కర్ ఎవరికీ, ఏదో ఒక అస్తిత్వానికి మాత్రమే చెందినవాడు కాదు. అందరివాడు. సమూల సాంఘిక ప్రక్షాళనవాది, ప్రతిఘటన యోధుడు, యథాతథవాదాన్ని కూలదోసిన ఆలోచనాకర్త. ఈ దేశ సామాజిక పరిస్థితులకు ఇంత వరకు ఎవరూ ఊహించని, అన్వయించని ఒక ఆలోచనా దృక్పథాన్ని సృష్టించిన మహోపాధ్యాయుడు, ఇక్కడి మౌలిక రాజకీయ నిర్మాణాన్ని చారిత్రక భౌతికవాదంతో విశ్లేషించిన తత్వవేత్త. వెరసి ఓ సాంఘిక విప్లవకారుడు అంబేడ్కర్!

ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు పైగా రాజ్యాంగాలు రాసుకున్నాయి. వాటిని రాసిన ప్రతి ఒక్క మేధావి ఆలొచన కర్త, మహోపాధ్యాయుడు కాడు. అలాగే ఆ కోణంలో మాత్రమే అంబేడ్కర్‌ను కొలవడం కూడా తప్పు. ఇక్కడ ప్రధానమైన ప్రమాణం రాజ్యాంగం రాయడంలో లేదు. ఎలాంటి ఆధిపత్యవాదం చుట్టుముట్టి ఉన్నప్పుడు ప్రాతినిధ్య రాజకీయాలను (రిప్రజెంటేటివ్ పాలిటిక్స్) ముందుకు తీసుకుపోవడాన్ని ఆయన మాత్రమే ఎలా సాధించగలిగారు అనే ప్రమాణంలో చూడాలి. మనకు కావాల్సింది స్వతంత్ర్యమైన రాజ్యాంగం ఒక్కటే కాదు, ఒక న్యాయమైన రాజ్యాంగం కూడా అప్పటి రాజ్యాంగ చర్చలను గమనిస్తే, constituent assembly సభ్యుడు, మునుపటి ముస్లింలీగ్ నాయకుడు, కాంగ్రెస్‌లో పేరొందిన ఉద్యమ కారుడు, కవి అయిన మౌలానా హస్రత్ మొహాని అంబేడ్కర్‌ను, ‘అమెరికా, ఫ్రెంచ్, ఇంగ్లాండ్, కెనడా లాంటి దేశాల రాజ్యాంగాన్ని కాపీ కొట్టావు కానీ రష్యా రాజ్యాంగాన్ని కాపీ కొట్టలేద’ని విమర్శించాడు. ఈ రోజు సుప్రీంకోర్టు అయినా, పార్లమెంటు అయినా ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చితే, దానిపై వేల మంది తమ అభిప్రాయాలు తెలియజేసి అన్నిటికంటే ఉత్తమమైనది ఏదో తీర్పు ఇవ్వగలుగుతున్నారు. అన్ని మీడియాలలో ప్రచారం చేయగలుగుతున్నారు. అప్పటి రాజ్యాంగ నిర్మాణం ఇంత ఓపెన్ వాతావరణంలో జరగలేదు. అది ప్రధానంగా constituent assembly చుట్టూ మాత్రమే తిరిగింది. అందులో 300 పైగా సభ్యులున్న కమిటీలలో ‘భాగస్వామ్య రాజకీయాలు’ తెలిసిన వాళ్ళు కానీ, అంబేడ్కర్ అలోచన విధానంతో సూత్ర ప్రాయంగానైనా ఏకీభవించగలిగే వాళ్ళు కానీ శూన్యం. అంత మంది మధ్యలో మనిషికి కావాల్సిన ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూ ఒక ఆలోచనా దృక్పథాన్ని ప్రెజెంట్ చేయడం అన్నది సామాన్య ప్రమాణాలతో పోల్చి చూడవలసింది కాదు.  ఆర్టికల్ 19ని మార్చిన నెహ్రూ తత్వం (ఇప్పటి ఉపా చట్టానికి ఆమోదం అక్కడి నుంచే వచ్చింది)లో కానీ, ఆర్టికల్ 357 (కాశ్మీరు స్వయం ప్రతిపత్తికి సంబంధించిన చట్టం)కు సంబంధించిన విషయాలలో కానీ ఆయన ఆత్రపడి భాగస్థుడు కాలేదు. ఈ దేశ దళితులు, నిమ్నవర్గాల కోసం అత్యుత్తమమైన పరిస్థితులను, వారు ఒక చైతన్యపూరిత వాతావరణంలో గడపగలిగే ఒక మార్గాన్ని సృష్టించగలిగారు అంబేడ్కర్.

వాస్తవానికి అంబేడ్కర్ సాయుధ పోరాటం చేయలేదు కాబట్టి, తెగించి సాంఘిక మార్పును కోరుకునే ఉద్యమకారుడిగా ఆయనను చూడ్డానికి సంప్రదాయ మార్క్సిస్టులు ఒప్పుకోరు. అంబేడ్కర్ ముందు ఉన్నది భగత్‌సింగ్‌లా క్షణకాలం వెలిగి మాయమయ్యే జీవితమా లేక, భావితరాల కోసం వెలుగుబాటలను సుగమం చేయడమా అన్నదే.- మృత్యువేదనతో అల్లల్లాడి మరణ శిశువును ప్రసవించే మార్గాన్ని అంబేడ్కర్ ఎంచుకుని ఉంటే, ఈ రోజు మొత్తం విద్యావ్యవస్థను, మేధావుల వర్గాన్ని మొత్తంగా బ్రాహ్మణులు ఆక్రమించేసి ఉండేవారు. బహుజన వర్గాలకు ఒక స్థాయి భాగస్వామ్యం కానీ, గళం కానీ లేకుండాపోయేది. అంబేడ్కర్‌ అలోచనా విధానం అత్యంత త్యాగవేత్తలుగా చెప్పుకుంటున్న మార్క్సిస్టులలో కూడా అసహనం సృష్టిస్తోంది అంటే ఆయన దూరదృష్టిని అంచనా వేయడం అంత సులువు కాదు.

ఈ దేశ సాయుధ పోరాటానికి ఆద్యుడు, పితామహుడు చారు మజుందార్ కొంతమేరకు అంబేడ్కర్‌కు సమకాలికుడు. ఆరోజుల్లో ఆయన తన భార్య లీల మజుందార్ సేన్ గుప్తతో కలిసి సిల్గురి ప్రాంతంలో సీపీఐ నాయకుడిగా చురుకైన పాత్ర పోషించారు. అప్పటికే అంబేడ్కర్ కమ్యూనిస్టు పార్టీలోని బ్రాహ్మణీక కులతత్వవాదాన్ని నిర్ద్వందంగా ఎండగట్టారు. అయితే ఆయనకు అప్పట్లో, ‘కార్మికవర్గ నియంతృత్వం’ అంటే, అప్పటి పార్టీల మోడల్‌లోనే ఉండే నియంతృత్వమా లేక, దళిత పక్షపాత నియంతృత్వమా అన్న స్పష్టత లేదు. అది ఇప్పటికీ ఎవరిలోనూ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పటికే రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ దాని అమలుకు సంబంధించిన హిందూ కోడ్ బిల్లు ముందుకు సాగని నేపథ్యంలో రాజీనామా చేసి హిందూవ్యవస్థ దాష్టీకాన్ని చాటారు. ఇవి అప్పుడే కమ్యూనిస్టు ప్రపంచంలో, వాళ్ల ఆలోచనా విధానంలో ఎందుకు మార్పు తీసుకురాలేకపోయాయి? అంతటి లిబరల్ థింకింగ్ ఉన్న మహోపాధ్యాయుల ఆలోచనలో లేని మార్పును constitutent assembly నుంచి దేశ రాజ్యాంగంలోకి చొప్పించడం అంబేడ్కర్ ఘనత. వర్గ విశ్లేషణంత సులువుగా ఒక fixed frameలో ఈ పోలరైజేషన్ పాలిటిక్స్ అర్థం కావు.

అంబేడ్కర్ సైద్ధాంతిక రూపంలో మాత్రమే ఈ వ్యవస్థను ఎండగట్టలేదు. దాన్ని పూర్తిస్థాయిలో ఎలా ఇబ్బంది పెట్టి ఎండగట్టాలో అలా ఎండగట్టారు. అందుకోసం మాత్రమే ఆయన వ్యవస్థలో భాగమయ్యారు కానీ, ఆస్తులు, సౌకర్యాలు కల్పించుకోడానికి కాదు. నెహ్రూ కేబినెట్‌లో చేరడంతోనే, దాని నుంచి రాజీనామా చేసి బయటికి వచ్చే సంభావ్యతనే మెండు అని అంబేడ్కర్ విశ్వసించారు. అందుకే తను రాజీనామా చేయాల్సిన పరిస్థితిని ఆయన షాక్‌గా భావించలేదు.

‘రాజ్యాంగం కేవలం సమాజంలో ఉండాల్సిన రాజకీయ నిర్మాణం గురించి మాట్లాడితే సరిపోదు. ఆర్థిక నిర్మాణం గురించి కూడా మాట్లాడాలి’ అని అంబేడ్కర్ తన ‘లేబర్ అండ్ కాస్టిట్యూషన్’ పుస్తకంలో పేర్కొన్నారు. రాజ్యాంగం వ్యక్తి స్వాతంత్ర్యాన్ని మాత్రమే నిర్వచించి, ఆర్థిక నిర్మాణంలో సమానత్వం అనే విషయాన్ని వ్యవస్థకు వదిలేయాలి అని సాధారణ బూర్జువా ప్రపంచం కోరుకుంటుంది. అయితే అంబేడ్కర్, ‘వ్యక్తుల స్వేచ్ఛకు, ఆ సామాజిక ఆర్థిక నిర్మాణానికి మధ్య ఉండే లంకె ప్రస్ఫుటంగా కనిపించదు కానీ బలమైన లంకె ఉన్న మాట నిజం!’ అని తన విశ్లేషణలో అభిప్రాయ పడ్డారు. అలాగే, ‘రాజ్యం ఆర్థిక నిర్మాణానికి సంబంధించిన శక్తులను ప్రైవేటు వ్యక్తులకు డెలిగేట్ చేయకూడద’ని ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆ రాజ్యాంగం రష్యా తరహాలో ఉండాలా, ఇంకో తరహాలో ఉండాలా అనే దానిపై అంబేడ్కర్‌కు స్పష్టత ఉంది. ప్రతి రాజ్యాంగం అప్పటి తరానికి సంబంధించిన అభిలాషను (aspirations) మాత్రమే ప్రతిబింబించగలదు. అంతే గాని వంద సంవత్సరాల తర్వాత ఉండాల్సిన సమాజాన్ని అప్పటి రాజ్యాంగం నిర్వచించలేదు. ఆ ప్రాక్టికల్ కోణాన్ని అర్థం చేసుకోకపోతే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవడం కష్టం. ఆయన ఆలోచనా విధానాన్ని–ముఖ్యంగా పోలరైజ్డ్ పాలిటిక్స్‌ను, రిప్రజెంటేషన్ పాలిటిక్స్‌ను– ఆకళింపు చేసుకోకుంటే ఏ సైద్ధాంతికవాదమైనా సరే ఈ దేశంలో వీగిపోవలసిందే. అయినా సరే అలా కోరుకున్నాం అంటే, దానర్థం, ఇంప్రాక్టికల్‌గా అంబేడ్కర్ మొండియుద్ధానికి దిగి ఉత్తి చేతులతో అమరుడై ఈ రోజు వర్ధంతులకు మాత్రమే పరిమితం కావాలని కోరుకోవడం. ఆయన వర్ధంతులకు పరిమతమయ్యే మనిషి కాదు. ప్రతి దినం, మన దేశ రాజకీయాలను ప్రశ్నించాల్సిన ప్రజానీకానికి బీజం నాటిన నిఖార్సైన సాంఘిక విప్లవవాది!

(నేడు అంబేడ్కర్‌ 64వ వర్ధంతి)

Courtesy Andhrajyothi

Search

Latest Updates