బాబ్రీ కూల్చివేత ప్రతిఘాత సామాజిక దాడి

Published on

– ఆర్‌. రఘు

పైపైన పరిశీలన జరిపేవారికి బాబ్రీ మసీదు ఉదంతం అక్కడ రామాలయ నిర్మాణంతో పూర్తయినట్టే. కానీ, బాబ్రీ మసీదును ఎందుకు కూల్చారు? అది కూడా డిసెంబర్‌ 6నే ఎందుకు కూల్చారు? అన్న విషయాలు వారికి పట్టవు. వారికే కాదు దురదృష్టవశాత్తు కమ్యూనిస్టులకు మినహాయించి మరే బూర్జువా పార్టీలకు కూడా పెద్దగా పట్టకపోవడం తీవ్రమైన విషయమే. అందువలన ఈ విషయాలపై లోతైన అవగాహన సాధారణ ప్రజలకు ముఖ్యంగా లౌకికవాదులకు, సామాజిక ఉద్యమాలలో పనిచేస్తున్న యువతీ యువకులకు తెలియచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

హిందూత్వ సిద్ధాంతం 1923లో పుట్టింది. 1925లో పుట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ క్రమంగా ఈ సిద్ధాంతాన్ని నెత్తికెక్కించుకుంది. నిజానికి హిందూత్వ సిద్ధాంతానికి ఇద్దరు శత్రువులు లేదా రెండు అవరోధాలు అది పుట్టినప్పటి నుంచీ ఉన్నాయి. 1. లౌకికతత్వం. 2. సామాజిక న్యాయం. ఈ రెండింటినీ మట్టుబెడితేనే హిందూత్వం పూర్తి స్థాయిలో బలపడుతుంది. భారతదేశ చరిత్రను అనాదిగా పరిశీలించిన చరిత్ర కారులందరూ చాలా స్పష్టంగా హిందూమతతత్వం అనేది బౌద్ధాన్ని నాశనం చేయడం నుంచి ప్రారంభమై ఒక సామాజిక ప్రతిఘాత విప్లవం లాగా సాగుతూ వస్తున్నదని చెప్పారు. ప్రముఖ చరిత్రకారిణి రొమల్లాథాపర్‌ నేడు ముస్లిం, క్రైస్తవ మతస్థుల మీద ఆర్‌ఎస్‌ఎస్‌ సంఫ్‌ుపరివార్‌ శక్తుల దాడి స్వభావాన్ని వివరిస్తూ హిందూమతం అభివృద్ధిలో ఒక కీలకమైన అంశం తన శత్రువును, వారు హేతువాదులు కావచ్చు, నాస్తికవాదులు కావచ్చు, అగ్రకుల ఆధిపత్యాన్ని ధిక్కరించేవారు కావచ్చు, లేదా నిమ్నజాతుల అభ్యున్నతికై పోరాడినవారు కావచ్చు, లేదా వేదాంగాల్ని తెగనాడినవారు కావచ్చు…

వీరందరినీ రాక్షసులు, అసురులు, మ్లేచ్చులు, ఛండాలులు వంటి పదాలతో అణచివేయటానికి పురాణేతిహాసాలను వాడుకున్నారు. ఇప్పుడు ఆ కోవలోకి ముస్లిం, క్రైస్తవులను ప్రతిష్టించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మైనారిటీ మతాలు శూద్ర, అతిశూద్ర లేక అస్ప్రుశ్యులుగా చెప్పబడే దళితులు, గిరిజనులు వీరందరినీ అట్టడుగు స్థాయిలో ఉంచటం అన్నది అనాదిగానే వస్తున్న ఓ బలమైన ప్రయత్నంగా కొనసాగింది. ఈ స్పృహతో చూసినప్పుడు బాబ్రీమసీదు కూల్చివేత కేవలం ముస్లింలకు వ్యతిరేకమైనదిగానే చూడటానికి వీలులేదు. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గెయిల్‌ ఓంబెట్‌ ”బాబ్రీమసీదు కూల్చివేత దళితులు, ఆదివాసీలు, మహిళలు, బహుజనులు, శ్రమించే కులాలు, వర్గాలు ఎవరినైతే వర్ణాశ్రమధర్మం (కులవ్యవస్థ) నీచులుగా చూస్తుందో వారందరిమీద ప్రకటించిన యుద్ధంగా చూడాలి” అని సరిగానే పేర్కొన్నారు.

బాబ్రీ మసీదు కూల్చివేత ఓ రెండో హెచ్చరిక
భారతదేశానికి స్వతంత్య్రం వచ్చిన నాలుగు నెలల్లోనే హిందూత్వ శక్తుల ప్రతిరూపమైన ఆర్‌ఎస్‌ఎస్‌ లేక హిందూ మహాసభల కార్యకర్త నాధూరాం గాడ్సే గాంధీ మహాత్ముని కాల్చి చంపాడు. అతని మరణ వాంగ్మూలంలో ప్రకటించినట్టు లౌకిక మార్గాన్నెంచుకున్న స్వతంత్య్ర భారత దేశానికి గాంధీజీ హత్య హిందూత్వ శక్తుల తొలిహెచ్చరిక. 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేయడం రెండో హెచ్చరిక. ఈ రెండు దుర్ఘటనలు హిందూత్వ శక్తుల వల్లనే జరిగాయి. 1948లో గాంధీజీని హత్య చేసినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా హిందూత్వ శక్తులకు నామమాత్రమైన బలమే ఉంది. అందుకనే వారు గాంధీజీని కుట్రపూరితంగా హత్యచేశారు. అయితే ఈ చర్యను నాడు యావత్‌ భారతదేశం అసహ్యించికుంది. బతికి బట్టకట్టడానికి 30ఏండ్లు పట్టింది. కానీ 1980 నుంచి హిందూత్వ శక్తులు దాదాపు దశాబ్దం పాటు బాబ్రీమసీదు కూల్చివేతను ఏకైక ఎజెండాగా పెట్టుకుని అల్లకల్లోలాలు సృష్టించి చివరకు 1992 డిసెంబర్‌ 6న కూల్చారు. 1948కి, 1992కి తేడా ఏమంటే బాబ్రీమసీదు కూల్చిన అనంతరం నుంచి హిందూత్వశక్తులు క్రమ క్రమంగా బలపడటం జరిగింది. ఈ సందర్భంగానే ఈ పరిణామాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కారణాలను గమనించాలి. 1980-1990 మధ్య మండల్‌ కమిషన్‌ సిఫార్సులపై తీవ్రమైన చర్చ జరిగింది. ఉలిక్కిపడిన హిందూత్వశక్తులు తమ మతోన్మాద దాడిని వివిధ రూపాల్లో పెంచాయి. దళిత బహుజనుల చైతన్యం పెరగటం, కులపీడనపైన, వివక్షపైన ఒక్కమాటలో చెప్పాలంటే అగ్రకుల ఆధిపత్యంపై పోరుకు పెద్ద భూమిక ఏర్పడ్డ కాలమది. ”మండల్‌ × కమండల్‌”, రామరాజ్యం × బలి (చక్రవర్తి) రాజ్యం” వంటి నినాదాలు, చర్చలు ఆ కాలంలో పెద్ద ఎత్తున ముందుకొచ్చాయి. సాంఘికంగా అణగారిన తరగతులు, మైనారిటీల మధ్య వివిధ రూపాల్లో ఐక్యత ఆ కాలంలో పెరిగింది. అదే సందర్భంలో స్వాతంత్య్రం నాటి నుంచి ఏకఛత్రాధిపత్యం సాగించిన కాంగ్రెస్‌పార్టీ అనేక రాష్ట్రాలలో ఓడిపోవటం, కేంద్రంలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపైన తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో పెరగడం గమనించిన పాలకవర్గాల్లోని అత్యధికమంది కేంద్ర స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ పరిణామాలవైపు ఆలోచనలు సాగించడం అనువుగా తీసుకుని భారత రాజకీయాలను పచ్చి మితవాదం వైపు మార్చడానికే హిందూత్వ శక్తులు బాబ్రీమసీదును కూల్చివేయటం జరిగింది. ఈ 30ఏండ్లుగా ఈ ప్రక్రియ క్రమంగా ఊపందుకుని దేశ రాజకీయాలు పూర్తి స్థాయిలో మితవాదంవైపు మరలటం, ఈ క్రమంలో ఉదారవాద ప్రజాస్వామ్యం చేతులెత్తేయటం, తదనుగుణంగా బలమైన మిధ్యేవాద పార్టీలు, బూర్జువా లౌకిక పార్టీలు బలహీనపడటమో లేక బీజేపీ పంచన చేరటమో జరుగుతున్నది.

డిసెంబర్‌ 6నే ఎందుకు?
హిందూత్వశక్తుల బాబ్రీమసీదు కూల్చివేత అకస్మాత్తుగా జరిగిన ఘటన కాదు. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆ పద్ధతిలోనే మాట్లాడటం బాధాకరమైన విషయం. వాస్తవానికి బాబ్రీమసీదును కూలుస్తామని నాటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్‌ వంటివారు స్పష్టంగానే ప్రకటిస్తూ వచ్చారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన కూల్చివేత యదేచ్ఛగా 10 గంటలపాటు సాగింది. అందుకు సంబంధించిన అనేక వీడియోలు సీబీఐ గతంలోనే కోర్టుకు అందించింది. శ్రీకృష్ణ కమిషన్‌ వంటి అనేక కమిషన్లు ఈ దుర్మార్గమైన చర్యను తూర్పారబట్టాయి. అందువలన డిసెంబర్‌ 6న కూల్చివేత అనేది కాకతాళీయం కాదు. దాని వెనుక హిందూత్వశక్తుల స్పష్టమైన అవగాహన ఉంది. హిందూమతతత్వానికి, దానికి మూలస్తంభమైన కుల వ్యవస్థ, కులాధిపత్యం, కుల వివక్ష వంటి వాటికి వ్యతిరేకంగా నిలిచిన మహౌన్నతమైన వ్యక్తి అయిన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ వర్థంతి డిసెంబర్‌ 6. 1990లోనే ఆర్‌ఎస్‌ఎస్‌ తన క్రింది స్థాయి అధినేతలకు, ప్రచారకులకు పంపిన రహస్య సర్క్యులర్‌ నెం.411 చదివితే వీరి అసలు కుట్ర అర్థమవుతుంది. ఆ సర్క్యులర్‌లోని కొన్ని ముఖ్యమైన అంశాలు.

అందులోని 2వ అంశం షెడ్యూలు కులాలు, వెనుకబడిన తరగతుల నుంచి పార్టీలోకి రిక్రూట్‌ చేసుకుని వారి ద్వారానే అంబేద్కరైట్‌లు, ముస్లింల మీద పోరాటం నడపాలి. 5వ అంశం, వైద్యులు, పార్మశిస్టులకు హిందూత్వ సిద్ధాంతాన్ని బోధించి వారి సహాయంతో ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు కాలం చెల్లిన మందులు అందించాలి. 10వ అంశం, షెడ్యూల్డ్‌ కులాలు, తెగల విద్యార్థులు మనకి అనుకూలంగా రాయబడిన చరిత్ర పుస్తకాలను చదివేలా చూడాలి. 15వ అంశం హిందువులు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా రాయబడిన సాహిత్యాన్ని ధ్వంసం చేయాలి.. 20వ అంశం సమానత్వం బోధించే కమ్యూనిస్టులు, అలాగే అంబేద్కరైట్‌లు, ఇస్లాంబోధకులు, క్రిస్టియన్‌ మిషనరీస్‌లపై భౌతికదాడులు ప్రారంభించాలి. 16వ అంశం, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఎట్టి పరిస్థితుల్లో నింపరాదు. ప్రమోషన్‌లలో వారికి అవకాశాలు నిరాకరింపబడాలి. అందుకు వారి సర్వీసు రికార్డులను తప్పుడు రిపోర్టులతో నాశనం చేయాలి. (బిశ్వాస్‌, శ్యాంచండ్‌లు రాసిన పుస్తకాలు నుంచి). దీన్నిబట్టి 1990 నాటికే బాబ్రీ మసీదు కూల్చివేత మాటున ప్రజాతంత్ర ఉద్యమ పురోగతిని ప్రత్యేకించి అణగారిన తరగతుల ఆకాంక్షలను, వాటి కోసం రూపుదిద్దుకుంటున్న ఉద్యమాలను వెనక్కి కొట్టటమనే కుట్ర దాగి ఉందనేది స్పష్టమవుతుంది.

సరైన గుణపాఠాలు తీయాలి
ఈ పరిస్థితుల్లో బాబ్రీమసీదు కూల్చివేయబడి మూడు దశాబ్దాలు దాటింది. సరైన గుణపాఠాలు తీసుకోనిదే హిందూత్వశక్తుల పాశవిక దాడులను, వారి పురోగమనాన్ని నిలవరించటం సాధ్యం కాదు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తొలిదశాబ్దాలలో లౌకికవాదం కోసం, సామాజిక న్యాయం కోసం ప్రజలందరూ దాదాపుగా ఐక్యంగా ఉన్న పరిస్థితులు ఈరోజు లేవు. ప్రధాన కారణం ఉదారవాద ప్రజాస్వామ్య పార్టీలు, లౌకిక బూర్జువా పార్టీలు భారత చరిత్ర గమనంలోనే ఇమిడివున్న మతతత్వ ప్రమాదాన్ని అర్థం చేసుకోకపోవడం. తీరా మతోన్మాద ప్రమాదం ముంచుకొచ్చే సరికి లౌకికవాదాన్నే పక్కనబెట్టి మతోన్మాద పోకడలు పుణికిపుచ్చుకోవడం. ఈ పరిస్థితులలో నిజమైన లౌకికతత్వానికి కట్టుబడి, కులవ్యవస్థను సమూలంగా నిర్మూలించడం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందనే సైద్ధాంతిక స్పష్టతతో పోరాడుతున్న కమ్యూనిస్టులే హిందూత్వశక్తులను శాశ్వతంగా మట్టుబెట్టడంలో కీలకపాత్ర నిర్వహించగలుగుతారు. అందుకు కమ్యూనిస్టులపై వామపక్ష పార్టీలను, ఇతర ప్రజాతంత్ర లౌకిక పార్టీలను, సామాజిక సంఘాలను, మైనార్టీ సంఘాలను, వ్యక్తులను దేశవ్యాప్తంగా ఐక్యం చేసి నడిపించాల్సిన చారిత్రక బాధ్యత ఉంది.

”నయా ఉదారవాదం అనేది కేవలం ఆర్థిక రంగంలో మాత్రమే కాక, సామాజిక, సాంస్కృతిక రంగాలన్నింటా వ్యాప్తిచెందిన బూర్జువా వర్గ దృక్పథం. నయా ఉదారవాద భావాల ద్వారా వ్యక్తమవుతున్న బూర్జువా భావజాలాన్ని నిరంతరం ప్రతిఘటించవలసిన అవసరం ఉన్నది. సమాజంలో పాదుకుంటున్న హిందూత్వ పెడధోరణికీ, ఇతర మతోన్మాద రూపాలకూ వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం సాగించవలసిన అవసరం కూడా ఉన్నది. సామాజిక, సాంస్కృతిక రంగాలలో సైతం ఈ పోరాటాన్ని సాగించాలి. కుల దురవగాహనలను, ప్రాంతీయ దురహంకారాలను, వేర్పాటువాదాన్నీ పెంచి పోషిస్తున్న సంకుచిత అస్థిత్వ విధానాలకు, ఒంటెత్తువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా కూడా పోరాటాన్ని నిర్వహించాలి. ”

Courtesy Nava Telangana

Search

Latest Updates