చదవడం ఓ కళ

Published on

చదవడం ఒక అలవాటు, అభిరుచి. పుస్తకాలు చదవడంలో ఒకసారి ఆనందం అనుభవించిన వారు, చదివే అలవాటును అంత త్వరగా వదులుకోరు. కొత్త సినిమాలు వస్తే చూస్తారు. ఇతరేతర అవసరాల కోసం ఇంటర్నెట్‌నూ, మొబైల్‌ని కొంచెం ఎక్కువగానే ఉపయోగి స్తుంటారు. అంతమాత్రాన పుస్త కాన్ని వదులు కోడం, చదవడం మానేయడం సాధ్యం కాని పనులు. అయితే పఠనంలోని ఆనందాన్ని చిన్నప్ప ట్నించి అలవాటు చేయాలి. ఒక కథనీ, నవలనీ చదవడంలో ఉండే ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని అనుభ వించే అవకాశాలు కల్పించాలి. వీటిని ఎంతమేరకు కల్పిస్తే ఆ మేరకు పుస్తకాలు చదివే అలవాటు పెరుగుతుంది. తదనంతరం ఎవరూ చెప్పకుండానే పుస్తకాలు చదవడం అలవడుతుంది. కొత్త పుస్తకాల కోసం వెంపర్లాట మొదలవుతుంది. కథలు, నవలలు మాత్రమే కాదు ఆలోచనాత్మకమైన నాన్‌ఫిక్షన్‌ రచనలు కూడా చదువుతారు.

ఈమధ్యకాలంలో తెలుగులోకి అనువాదమైన అనేకరకాల పుస్తకాలు చదువుతున్నారు. యువల్‌ నో హరారీ ‘సేపియన్స్‌’ తెలుగు అనువాదం బహుళ పాఠకాదరణ పొందడమే దీనికి దాఖలా. మానవ పరిణామ చరిత్రకు సంబంధించిన ఈ పుస్తకం ఇంగ్లీషులో యాభైలక్షల కాపీలకు పైగా అమ్ముడయింది.
మంచి నవలలకు సైతం పాఠకులున్నారు. ప్రముఖ రచయిత్రి జలంధర రాసిన నవల ‘పున్నాగపూలు’. గత అయిదేళ్ళ కాలంలో నాలుగు ఎడిషన్లు వెలువడింది. ఆరోగ్యరంగం, స్త్రీపురుష సంబంధాల గురించి స్పష్టమైన అవగాహన అందించిన నవల ఇది.

ఇలాంటి పుస్తకాలు చదివిన వారి ఆలోచనాసరళి భిన్నమైంది. తాము రోజూ చూస్తూ కూడా నిర్లిప్తంగా వుండిపోతున్న అంశాల గురించి పాఠకులు సరిగ్గా ఆలోచిస్తారు. ఈరకమైన పుస్తకాలు చదవడం ఒక కళ. కాని మంచి పుస్తకమేదో, చెత్త పుస్తకమేదో చెప్పగలిగే సమీక్షా పత్రికలు మనకేం లేవు. అరదుకని పిల్లలకు చిన్నప్పట్నించి చద వడం అలవాటు చేస్తే క్రమంగా మంచీ చెడు తెలుసుకుంటారు. పఠనాభిరుచుల్లో మార్పులు వస్తాయి. ఒకదశలో ఆబగా చదివించిన పుస్తకాల్లో ఏమీ లేదని తరువాత కాలాన గ్రహిస్తారు. సోవియట్‌, చైనా సాహిత్యం చదివి పుస్తకాల మంచీచెడు తెలుసుకున్నారు. పిల్లల పుస్తకాలు ఎలా ఉండాలో రష్యన్‌ జానపద సాహిత్యం గురించి చదివి తెలుసుకున్నారు. ఈ ఎరుక రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకని ముందుగా చదివే అలవాటు కొనసాగేలా చూడాలి. నెమ్మదిగా పఠనానికి సంబంధించిన దిశానిర్దేశం చేయాలి.

కోవిడ్‌-19 కాలంలో చదివే అలవాట్లు పెరిగాయి. యాత్రాకథనాలు, జీవితచరిత్రలు, మన మానసిక ప్రపంచాన్ని ఉద్విగతకు లోను చేసే కథలు, నవలలు చదవడంలో ఆనందం ఉంటుంది. చదవడం ఒక కళ అంటే ఏమిటో ఇలాంటి పుస్తకాల అధ్యయనం ద్వారా తెలుస్తుంది. ఆదినారాయణ రాసిన ‘భ్రమణకాంక్ష’, ఆకెళ్ళ రవిప్రకాష్‌ సృజించిన ‘టాగూర్‌ తిరిగిన దారుల్లో…’ విలక్షణమైన యాత్రాకథనాలు. యాత్రా రచనలంటే టూరిస్టు గైడ్‌లు కావు, లోకాన్ని, జీవితాన్ని సరికొత్తగా దర్శింపజేసే జ్ఞాననేత్రాలు. తెలుగులో అరుదుగా వచ్చే ఇలాంటి రచనలు చదవడం ద్వారా చరిత్రనీ, ప్రపంచ వైవిధ్యాన్నీ, జీవన వైశాల్యాన్నీ ఆకళింపు చేసుకోడం వీలవుతుంది.

చదవడం ఎక్కడ, ఎప్పుడు మొదలు పెట్టినప్పటికీ మన లోపలి ప్రపంచాల్ని వెలిగించే రచనలు చదవడం ఉపయుక్తం. అందుకే ఈమధ్యన రంగనాయకమ్మ ”పఠనం అంటే ఏది దొరికితే అది చదవడం కాదు. సమస్యల్ని ఎదుర్కొనే అవగాహనని ఇచ్చే పఠనం అవసరం” అన్నారు. వ్యక్తిత్వ వికాసం పేరుతో మనుషుల్ని స్వార్థపరులుగా మార్చే పుస్తకాల పఠనం హానికరం. తననీ, తన చుట్టూ వున్న సమాజాన్ని సరయిన రీతిన అర్థం చేసుకోడానికి ఉపకరించేది నిజమైన వ్యక్తిత్వం. సాటి మనుషులకు వీలయినంత మంచిని చేయాలన్న తపనకు లోను చేసే రచనల సముదాయమే ఉత్తమ సాహిత్యం. మాక్సిమ్‌ గోర్కీ ‘అమ్మ’ని చదివాక, తమ ‘అమ్మ’లకు అమ్మని చదివి వినిపిం చాలనే ఉద్విగతకు లోనయినవారు ఎందరో. మానవాళి జీవితాన్ని మరింత మెరుగుపరిచే దిశగా పాఠకుల్ని ఉద్యుక్తుల్ని చేసే అమేయ శక్తి గోర్కీ ‘అమ్మ’లో వుంది.

మంచి రచనల్ని చదివిన వారు వాటి గురించి మిత్రులతో పంచుకోవాలి. ఇదివరలో అయితే రచయితలు తాము చదివిన పుస్తకాల గురించి ఉత్తరాల్లో రాసేవారు. ఇపుడు మెయిల్స్‌లోనూ, ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాల ద్వారానో మంచి పుస్తకాల గురించి తెలియజెప్పాలి. పఠనాభిరుచి సవ్యమైన దిశలో సాగేందుకు ఈ ప్రయత్నాలు తోడ్పడతాయి. వివేచనకి తావునిచ్చే పుస్తకాలు చదవితే మానవీయ సంస్కారం పెంపొందుతుంది. అన్యాయాన్ని నిరసించడం, న్యాయం పక్షాన నిలబడటం అసంకల్పితంగానే అలవడుతుంది. వివక్షాపూరితమైన, సంకుచితమైన ఆలోచనల్ని, చర్యల్ని ప్రతిఘటించే చైతన్యం పదునెక్కుతుంది. ఈరకమైన జ్ఞానాన్నీ, బుద్ధినీ ప్రసాదించే పుస్తకాల పఠనం ఒక కళ. ఈ కళ ఎంతగా పరివ్యాప్తమయితే సమాజం అంతగా సరికొత్త ఆలోచనలతో, ఆచరణతో విరాజిల్లుతుంది.

Courtesy Nava Telangana

Search

Latest Updates