చిక్కిపోతున్న బాల్యం..

Published on

– తక్కువ బరువు, పెరుగుదల లోపం ప్రధానం
– ఏడు పెద్ద రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రం
– నాలుగేండ్ల నుంచి పెరిగిన బాధితులు : నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో చిన్నారులు చిక్కిశల్యమైపోతున్నారు. సరైన తిండి, పోషకాహరం లేక బక్కచిక్కిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలోపం, నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య గత నాలుగేండ్లలో పెరిగిపోయింది. 2015-16 నుంచి దేశంలో తక్కువ బరువు ఉన్న చిన్నారుల సంఖ్య అధికమైంది. దేశంలో ఉన్న 10 రాష్ట్రాల్లోని ఏడు రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రమైంది. అలాగే ఇందులోని ఆరు రాష్ట్రాల్లో చిన్నారుల పెరుగుదల సమస్య అధికమైంది. 2019-20 ఏడాదికి గానూ నిర్వహించిన నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వేలో ఈ విషయం బయటపడింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ సర్వే వివరాలను ఇటీవలే విడుదల చేశారు. ఇప్పటి వరకు ఇది ఐదో ఎడిషన్‌. చివరగా నాలుగో ఎడిషన్‌ను 2015-16లో నిర్వహించారు. కాగా, తక్కువ బరువు ఉన్న చిన్నారుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో సగం బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌ కూడా ఈ జాబితాలో ఉండటం గమనించాల్సిన అంశం. ఈ తక్కువ బరువుతో ఉన్న చిన్నారుల సంఖ్యలో పెరుగుదల హిమాచల్‌ప్రదేశ్‌లో అధికంగా ఉన్నది. 2015-16లో ఈ సమస్యతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 21.2శాతంగా ఉండగా అది 2019-20 నాటికి 25.5శాతానికి చేరుకున్నది. ఇక తెలంగాణలో ఇది 3.4శాతం పాయింట్లు పెరిగిందని సర్వేలో తేలింది. 2015-16లో ఇది 16.1శాతంగా ఉన్నది. 2019-20కి అది 19.7శాతానికి చేరుకున్నదని సర్వే వివరించింది. ఇక జమ్మూకాశ్మీర్‌లో తక్కువ బరువు సమస్యతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 16.6 నుంచి 21శాతానికి పెరిగింది.

అలాగే చిన్నారుల పెరుగుదల సమస్య గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఆందోళనకరంగా ఉన్నది. గత సర్వేతో పోల్చుకుంటే తాజా సర్వేలో ఈ పరిస్థితి మరింతగా దిగజారిపోవడం గమనార్హం. ముఖ్యంగా దేశంలోని పది పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ సమస్య తీవ్రత అధికంగా ఉన్నదని సర్వేలో వెల్లడైంది. ఈ రాష్ట్రంలో ఈ సమస్యతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 28శాతం నుంచి 33.1శాతానికి పెరిగింది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈశాన్య రాష్ట్రం త్రిపురలో 24.3శాతం నుంచి 32.3శాతానికి పెరగడం ఆందోళనకరం.

Courtesy Nava Telangana

Search

Latest Updates