రాజకీయాల్లో… కథానాయకుల పాత్రలు

Published on

‘‘ముఖానికి రంగులేసుకునే వాళ్లు ప్రజా సేవ ఏం చేస్తారు? రాజకీయం అంటే డైలాగ్స్‌ చెప్పడం, డ్యాన్సులు వేయడం కాదు..’’ ఇవీ ఓ నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు.. అనగానే వినిపించే మాటలు. కథానాయకుడు రాజకీయ నాయకుడుగా మారాలంటే అనుకున్నంత తేలిక విషయం కాదు. వచ్చేంత వరకు ఓ లెక్క.. వచ్చాక మరో లెక్క అన్నట్టు ఉంటుంది. ఎన్నో లోటు పాట్లు, మరెన్నో రాజకీయ కోణాలు.. వీటన్నింటినీ సుసాధ్యం చేసి ప్రజల క్షేమం కోసం కదిలిన కథానాయకులెందరో ఉన్నారో దేశంలో..! తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ‘మీ కోసం   నేనొస్తున్నా’ అంటూ రాజకీయ ప్రవేశం గురించి   ప్రకటించడంతో ఈ చర్చ మరోసారి మొదలైంది. ఇప్పటి వరకూ కథానాయకులు కొందరు పార్టీలు పెట్టి… రాజకీయాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఆ విశేషాలు…

ఎన్టీఆర్‌ : నందమూరి తారక రామారావు… తెలుగుజాతి గుండెల్లో నిలిచిన నాయకుడు. నటుడు. తన వాక్‌చాతుర్యం, భాషా నైపుణ్యం, ఆహార్యంతో తెలుగు వారి ఖ్యాతిని పెంచారు ఎన్టీఆర్‌. తన మలి జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తూ ‘తెలుగు దేశం పార్టీ’ని ప్రకటించి, తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో 1982లో పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన 9  నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించారు. కళాకారుడు ముఖ్యమంత్రి కాగలడు అని నిరూపించారు. ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
దేవానంద్‌ : ఎంజీఆర్‌ తర్వాత రాజకీయ పార్టీని పెట్టిన వారిలో బాలీవుడ్‌ కథా  నాయకుడు దేవానంద్‌ ఉన్నారు. 1979లో ‘నేషనల్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా’ని స్థాపించారు. ఆశించిన ఫలితం లేకపోవడంతో పార్టీని రద్దు చేశారు.

చిరంజీవి : తెలుగునాట ఎన్టీఆర్‌ తర్వాత సినిమాల్లో ఆ స్థాయిని అందుకున్న నటుల్లో చిరంజీవి ఒకరు. అభిమాన సంద్రమే బలంగా 2008లో ‘ప్రజారాజ్యం’ పార్టీని ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 స్థానాలు సాధించుకున్నారు. తర్వాతి కాలంలో తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగానూ సేవలందించారు.

పవన్‌ కల్యాణ్‌ : ‘ప్రశ్నించేందుకు’ అంటూ‘జనసేన’ పార్టీని 2014లో స్థాపించారు పవన్‌ కల్యాణ్‌. అగ్ర కథానాయకుడుగా కొనసాగుతుండగానే ప్రజలకు న్యాయం చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని చెబుతుంటారాయన. 2019 ఎన్నికల్లో సత్ఫలితాలు అందుకోలేకపోయినా అదే తడవుగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. భవిష్యత్తు కార్యాచరణ రచిస్తున్నారు.

ఉపేంద్ర : తన సినిమాల్లోని పాత్రల్లో సామాజిక అంశాన్ని జోడిస్తారు ఉపేంద్ర. తెరమీదే కాదు తెరవెనకా ప్రజల కోసమే అంటూ 2018లో రాజకీయాల్లోకి అడుగులు వేశారు. ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ని స్థాపించారు. 2019 కర్ణాటకలోని అన్ని లోక్‌సభ స్థానాలకు సామాన్య, అవినీతి రహిత అభ్యర్థులను బరిలో నిలిపారు.

తమిళనాడులో ఎక్కువే

ఎంజీఆర్‌ : సినిమాల నుంచి రాజకీయాల వైపు వెళ్లి సొంత పార్టీని స్థాపించి ప్రజల మన్ననలు పొందిన నటుల్లో తమిళ కథానాయకుడు ఎం.జి. రామచంద్రన్‌ (ఎం.జి.ఆర్‌) ముందుంటారు. 1972లో ఓ ప్రముఖ పార్టీతో సత్సంబంధాలు కలిగిన ఎంజీఆర్‌ కొన్ని కారణాల వల్ల పక్కకు వచ్చారు. అక్టోబరు 17, 1972లో ‘ఆల్‌ ఇండియా అన్న ద్రవిడ మున్నెట్ర కజిగమ్‌’ అనే పార్టీని స్థాపించారు. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. 11మంది ఎమ్మెల్యేలతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం 1977లో ప్రభుత్వాన్ని స్థాపించే వరకూ అప్రతిహతంగా సాగింది. దాదాపు 10సంవత్సరాలు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలందించారు.

విజయకాంత్‌: తమిళ కథానాయకుడు విజయ్‌కాంత్‌… దేశీయ మురుపొక్కు ద్రవిడ కజగం(డీఎండీకే) పార్టీని స్థాపించారు. 2005లో ప్రారంభమైన ఈ పార్టీ గుర్తు నగరా. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని 29స్థానాల్లో పోటీచేసిన ఈ పార్టీ ఒక్క సీటు నిలబెట్టుకోలేకపోయింది. 2011 శాసనసభ ఎన్నికల్లో 29 స్థానాల్లో విజయం కేతనం ఎగరవేశారు డీఎండీకే పార్టీ నాయకులు. విజయకాంత్‌  ప్రతిపక్ష నేతగానూ బాధ్యతలు నిర్వహించారు.

కమల్‌హాసన్‌ : విలక్షణ నటుడిగా విశేష ప్రేక్షకాదరణ చూరగొన్న కమల్‌ హాసన్‌ రెండేళ్ల కిందటే రాజకీయాల్లో అడుగు పెట్టారు. 2018లో ‘మక్కల్‌ నీది మైయిం పార్టీ’ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. 2021లో జరగబోయే ఎన్నికల్లో కీలకంగా మారతానని చెబుతున్నారు. ఈ మేరకు పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు.

శరత్‌కుమార్‌: మరోనటుడు శరత్‌కుమార్‌ కూడా ‘ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి’ స్థాపించారు. 2007లో ప్రారంభమైన ఈ పార్టీ 2011లో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. రెండు స్థానాల్లో గెలిచింది. టెన్‌కాశీ నుంచి శరత్‌  కుమార్‌ బరిలో నిలిచి విజయం సాధించారు.

* ఇలా ఎంతో మంది అభిమాన నటులు పార్టీలు స్థాపించారు. కొందరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగా… ఇంకొందరు ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం   రజనీకాంత్‌ పార్టీ పెట్టనున్నట్లు   ప్రకటించడంతో సినిమాలకు, రాజకీయాలకు దగ్గరి సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని మరోసారి స్పష్టమైంది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Related Posts

No Content Available
Search

Latest Updates