కరోనా నిర్వహణలో 34వ స్థానంలో భారత్

Published on

ఇండియా కంటే మెరుగైన స్థానంలో 12 ఆసియా దేశాలు
బ్లూమ్‌ బర్గ్‌ కోవిడ్‌ రెసిలియెన్సీ ర్యాంకింగ్స్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి పరిస్థితులను సమర్థంగా నిర్వహించిన ప్రపంచంలోని 53 దేశాల్లో భారత్‌కు 34వ స్థానం దక్కిందని బ్లూమ్‌బర్గ్‌ కోవిడ్‌ రెసిలియెన్సీ నివేదిక వెల్లడించింది. తాజాగా విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. 34వ స్థానంలో ఉన్న భారత్‌కు 58.1 స్కోర్‌ లభించింది. ఈ జాబితాలో 85.4 స్కోర్‌తో న్యూజిలాండ్‌ అగ్రస్థానంలో ఉంది. అయితే, 61.7 స్కోర్‌తో ఉన్న పాకిస్థాన్‌.. భారత్‌ కంటే మెరుగైన 27వ స్థానంలో ఉంది. అలాగే, బంగ్లాదేశ్‌ సైతం 64.2 స్కోర్‌తో 24వ స్థానంలో నిలిచింది. కరోనా వైరస్‌ను అత్యంత సమర్థవంతంగా నిర్వహించడాన్ని పరిగణలోకి తీసుకుని బ్లూమ్‌బర్గ్‌ ఈ నివేదికను తయారు చేసింది. ఇందులో ఆయా దేశాల మొత్తం కరోనా కేసులు, మరణా రేటు, టెస్టింగ్‌ సామర్థ్యం, వ్యాక్సిన్‌ సరఫరా ఒప్పందాలు, స్థానిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల సామర్థ్యం, ఆర్థిక వ్యవస్థలపై లాక్‌డౌన్‌ ప్రభావం, పౌరుల స్వేచ్ఛ వంటి అంశాలను పరిగణలోకి తీసుకునీ, 53 దేశాల ఆర్థిక వ్యవస్థలపై సర్వే చేసింది.

బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం.. భారత్‌లో లక్షమంది జనాభాకు ఒక నెలలో 93 కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాల రేటు 1.2 శాతంగా ఉంది. ప్రతి మిలియన్‌ జనాభాకు 97 మరణాలు చోటుచేసుకుంటుండగా, పాజిటివిటీ రేటు 4.2 శాతంగా ఉంది. అలాగే, ఆక్స్‌ఫర్డ్‌, నోవావాక్స్‌, గెమ్లియా, భారత్‌ బయోటెక్‌ సంస్థలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లతో ఒప్పందాలు ఉన్నాయని తెలిపింది. అయితే, భారత్‌కంటే అధికంగా యూఎస్‌, యూకే, చైనా, కేనడా దేశాలు వ్యాక్సిన్లు పొందడానికి ఐదు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయని పేర్కొంది. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ కరోనా డేటా ప్రకారం.. 12.1 మిలియన్‌ కేసులతో యూఎస్‌ మొదటి స్థానంలో ఉండగా, 9.1 మిలియన్‌ కేసులతో భారత్‌ రెండో స్థానంలో ఉంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న టాప్‌-10 దేశాల్లో ఆసియా నుంచి ఒక్క భారత్‌ మాత్రమే ఉండటం గమనార్హం.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మెరుగైన ప్రదర్శన
85 స్కోర్‌తో జపాన్‌ ఆసియాలోనే కరోనా నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన దేశంగా, ప్రపంచవ్యాప్తంగా జాబితాలో రెండో స్థానంలో ఉంది. కరోనా నిర్వహణలో టాప్‌-10 దేశాల జాబితాలో ఐదు ఆసియా దేశాలు జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియా, చైనా, వియాత్నంలు ఉన్నాయి. కాగా, ఆసియా దేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, హాంకాంగ్‌, థారులాండ్‌, ఇండోనేషియా దేశాల కంటే భారత్‌ దిగువ స్థానంలో ఉండటం గమనార్హం. అంటే ఆసియాలోని 12 దేశాలు భారత్‌ కంటే మెరుగైన స్కోర్‌ను సాధించాయి. 53 దేశాలున్న ఈ జాబితాలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌ దేశాలు జీరో పాజిటివిటీ రేటు కలిగి ఉండగా, మెక్సికో (62.3 శాతం), పోలాండ్‌ (44.8)లు అత్యధిక పాజిటివిటీ రేట్లను కలిగి ఉన్నాయి. ఇక బెల్జియంలో ప్రతి లక్షకు అత్యధిక కేసులు (2,339) ఉన్నాయి.

Courtesy Nava Telangana

Search

Latest Updates