ఇద్దరు దళిత సోదరులపై పెత్తందార్ల దాడి

Published on

– పోలీసు కేసు ఉపసంహరించుకోలేదని.. ఇంటికీ నిప్పు
– మధ్యప్రదేశ్‌లో దారుణం..

భోపాల్‌: తమపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవటానికి నిరాకరించిన ఇద్దరు దళిత సోదరులపై పెత్తందార్లు దాడికి పాల్పడ్డారు. సుమారు 15 మంది గుంపుగా వచ్చి వారిద్దరిని చితకొట్టారు. అంతటితో ఊరుకోక వారి గుడిసెకు నిప్పుపెట్టారు. మధ్యప్రదేశ్‌లోని డాటియా జిల్లాలో జరిగింది.

అసలేం జరిగిందంటే….
రెండేండ్ల కిందట వేతనం చెల్లింపులో తేడా ఉండటంతో..దళిత సోదరులు దోహారే, సాంట్రామ్‌ దోహార్‌లు తన యజమాని పవన్‌ యాదవ్‌ను నిలదీశారు. దీంతో అతను వారిని కులంపేరుతో దూషించటమే కాకుండా..చేయి చేసుకున్నాడు. దెబ్బలు తిన్న ఆ సోదరులిద్దరూ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. పవన్‌ ఒత్తిడి తెస్తున్నా…కేసు వాపసు తీసుకోవటానికి నిరాకరించారు. పవన్‌ తన అనుచరులతో వచ్చి వారిద్దరిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాడు. పవన్‌ యాదవ్‌, కల్లుయాదవ్‌ సహా నలుగురు బంధువులు, పొరుగువారూ మోటారు బైక్‌లపై వచ్చి తుపాకీతో గాల్లో కాల్పులు జరిపారు.

గొడ్డళ్లతో దళిత సోదరులపై విరుచుకుపడ్డారు. మాపైనే కేసు పెడతారా..అంటూ గుడిసెను తగలబెట్టారు. తమకు అడ్డు వస్తే ఎవరూ మిగలరనీ బెదిరిస్తూ..ఆ దుండగులు బైక్‌లపై వెళ్లిపోయారు. గాయపడిన దళిత సోదరును సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నెలలో సాగర్‌ నగరంలో కూడా ఓ దళిత యువకుడు పక్కింటి వారిపై కేసు పెడితే.. ఆ కేసును విత్‌ డ్రా చేసుకోవాలని పెత్తందార్లు బెదిరించారు. దీనికి నిరాకరించటంతో అతడ్ని సజీవదహనం చేశారు. మధ్యప్రదేశ్‌లో దళితులపై జరుగుతున్న దారుణాలపై దళిత సంఘాలు, ప్రజాసంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Courtesy Nava Telangana

Search

Latest Updates