జెమిలి ఎన్నికల గురించి ఎందుకుమాట్లాడుతున్నారు?

Published on

– ఎం కోటేశ్వరరావు

ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఒకే సారి పార్లమెంట్‌-అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్‌ ముందుకు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని అనేక పార్టీలు, నిపుణులు తిరస్కరించినప్పటికీ 2014 నుంచీ ఒకే దేశం-ఒకే ఎన్నికలంటూ వదలకుండా చెబుతున్నారు. నవంబరు 26వ తేదీన సభాపతుల జాతీయ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ ఈ ప్రతిపాదన ఆలోచన కాదు దేశానికి అవసరం అని, ప్రతి నిర్ణయం జాతీయ ప్రయోజనాల లక్ష్యంగా ఉండాలని చెప్పారు. విడివిడిగా ఎన్నికలు జరగటం వలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతున్నందున ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి చర్చించాలని కోరారు.

చట్ట సభలతో పాటు స్ధానిక సంస్ధలకూ ఉపయోగపడే ఒకే ఓటర్ల జాబితా తయారు చేస్తే సమయం, నిధులు ఆదా అవుతాయన్నారు. మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967వరకు లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆకాలంలో జరిగిందేమిటి? దేశ ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం తెలిసిందే. దాని ఫలితమే 1969లో కొన్ని అసెంబ్లీల రద్దు, తరువాత ముందుగానే 1970లోపార్లమెంట్‌ రద్దు, 1971 ప్రారంభంలో ఎన్నికలు అన్న విషయం తెలిసిందే. ఒక దేశవృద్ది రేటు ఎన్నికల ఖర్చు మీద, ఆ సమయంలో ప్రవర్తనా నియమావళి మీద ఆధారపడదు. ఆయా దేశాల జీడీపీలు, ఆదాయాలతో పోల్చితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాల ఖర్చు నామమాత్రమే. పార్టీలు పెట్టే ఖర్చే దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటోంది. దాని నివారణకు ఒకేసారి ఎన్నికలు పరిష్కారం కాదు. ఏ స్ధానం అభ్యర్ధి ఆ ఓట్ల కొనుగోలు, ప్రచారానికి ఇప్పుటి మాదిరే డబ్బు ఖర్చు చేస్తారు తప్ప మరొకటి జరగదు. ప్రవర్తనా నియమావళి అంటే ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టే కొత్త కార్యక్రమాల ప్రకటనలను నివారించటం తప్ప వాటితో నిమిత్తం లేకుండా ముందే ప్రారంభమై సాగే పథకాల అమలు నిలిపివేత ఉండదు. రైలు మార్గాల నిర్మాణం, విద్యుదీకరణ, ప్రభుత్వ గృహాలు, రోడ్ల నిర్మాణం, పెన్షన్ల చెల్లింపు, చౌకదుకాణాల్లో వస్తువుల సరఫరా వంటివి ఏవీ ఆగటం లేదే.

గతంలో గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ గ్రామీణ ఉపాధి పథకం పనులకు విడుదల చేయాల్సిన నిధులకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. అయితే ఆ విషయాన్ని మీడియాలో ఎక్కడా వెల్లడించకూడదని షరతు పెట్టింది. అందువలన ఎన్నికలు జరిగితే పనులు ఆగిపోతాయన్నది ఒక ప్రచార అంశమే తప్ప మరొకటి కాదు.

కొన్నిదేశాల్లో ఒకేసారి జాతీయ, ప్రాంతీయ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఆ విధంగా చేసి ఖర్చును ఆదాచేయటం వల్ల అభివృద్ధి సాధించినట్టు ఎక్కడా రుజువు లేదు. ఉదాహరణకు అమెరికాలో 1962-2019 మధ్య 57 ఏండ్లలో 26 సంవత్సరాలు తిరోగమన, 16 సంవత్సరాలు ఒక శాతంలోపు, ఐదు సంవత్సరాలు ఒకటి-రెండు శాతం మధ్య వృద్ధి నమోదైంది. అమెరికాలో ఎన్నికల ప్రకటన నుంచి పోలింగ్‌ రోజువరకు డోనాల్డ్‌ట్రంప్‌ మన దేశంలో మాదిరి ప్రవర్తనా నియమావళితో నిమిత్తం లేకుండా అనేక చర్యలు తీసుకోవటాన్ని చూశాము. అక్కడ రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఎన్నికల కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు, ప్రవర్తనా నియమావళి లేదు. అయినా అక్కడ వృద్ధి రేటు తీరుతెన్నులు ఏమిటో చూశాము. కొన్ని ఐరోపా దేశాలలో నిర్ణీత కాలం వరకు చట్ట సభలు రద్దు కావు, ప్రభుత్వాలు మారుతుంటాయి. అలాంటి దేశాలూ అభివృద్ధి సమస్యలను, సంక్షోభాలను ఎదుర్కొం టున్నాయి.

ఎప్పుడూ ఏదో ఒక ఎన్నికల వాతావరణమే ఉంటోందని కొందరు పెద్దలు చీదరించుకోవటం చూస్తున్నాం. వీరు ఎన్నికలతో నిమిత్తం లేకుండా నిరంతరం కొనసాగుతున్న ఇతర ‘వాతావరణాల’ గురించి పట్టించుకోరు. మహా అయితే ఐదు సంవత్సరాల కాలంలో మూడు సార్లు ఎన్నికలు జరుగుతాయి. ఈ మాత్రానికే చీదరింపులైతే నిరంతరం కొనసాగుతున్న నిరుద్యోగం, దారిద్య్రం, ధరల పెరుగుదల వంటి ఈతిబాధల వాతావరణం సంగతేమిటి ? ఎప్పుడూ ఎన్నికల వాతావరణమే ఉంటోందని చిరాకు పడుతున్న కడుపు నిండిన వారు కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యల మీద చేసే ఆందోళనలను కూడా వ్యతిరేకిస్తున్నారని గుర్తించాలి. సమ్మెలు, బంద్‌లు చేయటం ఎవరికీ సరదా కాదు, అనివార్యంగా చేస్తున్నవే. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కూడా అలాంటివే.

నిజానికి ఇప్పుడు కావాల్సింది ఒకే సారి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యం మరింతగా వర్దిల్లే విధంగా, ధన ప్రలోభాలను గణనీయంగా తగ్గించి, ప్రజాభిప్రాయానికి చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం లభించేందుకు ఉన్నంతలో మెరుగైన దామాషా పద్దతి ఎన్నికల సంస్కరణలు కావాలి. ఒకేసారి ఎన్నికలు జరపాలని సూచన చేసిన పార్లమెంటరీ స్ధాయీ సంఘం నివేదికలో దక్షిణాఫ్రికా, స్విడ్జర్లాండ్‌లను ఉదహరిస్తూ నిర్ణీత తేదీకి అక్కడ ఎన్నికలు జరుపుతారని పేర్కొన్నారు. (అమెరికా కూడా అలాంటిదే.) అయితే ఈ రెండు దేశాల్లో పార్టీల జాబితాలతో దామాషా ప్రాతిపదికన చట్ట సభల్లో సీట్లు కేటాయిస్తారు. ఆ విషయం మాత్రం స్ధాయీ సంఘానికి పట్టలేదు. అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికల్లో 50రాష్ట్రాల్లో రెండు చోట్ల తప్పు మిగిలిన చోట్ల మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్ట్రరల్‌ కాలేజీ ప్రతినిధులను మొత్తంగా కేటాయిస్తారు. అందువలన గత ఎన్నికల్లో మొత్తంగా ఓట్లు తక్కువ తెచ్చుకున్నా అధ్య క్ష పదవిని ట్రంప్‌ గెలిచారు. మన మాదిరి నియోజకవర్గాల ప్రాతిపదిక విధానంలో డబ్బున్న పార్టీలే ప్రాతినిధ్యం పొందగలుగుతున్నాయి. కొన్ని పార్టీలకు వచ్చిన ఓట్ల మేరకు ప్రాతినిధ్యం ఉండటం లేదు. దామాషా ప్రాతినిధ్య విధానంలో డబ్బుతో ఓట్లు కొన్నప్పటికీ అలాంటివారు ఎన్నికయ్యే అవకాశం ఉండదు కనుక ఎవరూ డబ్బు పెట్టరు, నిజమైన ప్రజాభిప్రాయం వెల్లడి కావటానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఉన్న పార్టీలు డబ్బున్న వారికే పెద్దపీట వేస్తూ అధికారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అందుకే దామాషా ప్రాతినిధ్యం(ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తే అన్ని సీట్లు) గురించి వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ మాట్లాడవు.

తరచూ ఎన్నికల వలన ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను రూపొందించే అవకాశాలకు ఆటంకం కలుగతుందని కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో నేటి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు వాదించారు. ఒకే సారి ఎన్నికలు జరిగితే ఇలాంటి అవకాశం ఉండదని చెప్పారు. ఇంకా కొందరు ఇదే విధమైన వాదనలు చేస్తున్నారు. పాలకులు మారినా లక్ష్యాల నిర్దేశం, పధకాలు కొనసాగేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన పెద్దలు దీర్ఘకాలిక విధానాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఇది జనాన్ని తప్పుదారి పట్టించే వ్యవహారమే.

ప్రతిదానికీ ప్రజాస్వామ్య జపం చేసే వ్యక్తులు, శక్తులూ అభివృద్ధి, ఖర్చు తగ్గించాలనే పేరుతో ప్రజాస్వామిక సూత్రాలకే విఘాతం కలిగించే ప్రతిపాదన ముందుకు తెస్తున్నారు. ఇది ఫెడరల్‌ సూత్రాలకు, రాజ్యాంగ మౌలిక స్వభావానికే విరుద్దం. ఏక వ్యక్తి ఆధిపత్యానికి దారి తీస్తుంది.
ఐడిఎఫ్‌సీ అనే ఒక సంస్ధ 1999 నుంచి 2014వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమాచారాన్ని విశ్లేషించింది. ఒకేసారి జరిగితే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఓటర్లు ఒకే పార్టీని ఎంచుకొనేందుకు 77శాతం అవకాశాలుంటాయని పేర్కొన్నది. ఐఐఎం అహమ్మదాబాద్‌ డైరెక్టర్‌గా ఉన్న జగదీప్‌ ఛోకర్‌ జరిపిన విశ్లేషణ కూడా దీన్నే చెప్పింది. 1989 నుంచి ఒకేసారి జరిగిన లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 24 ఉదంతాలలో ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో దాదాపు ఒకే విధమైన శాతాలలో ఓట్లు పొందాయి. కేవలం ఏడు సందర్భాలలో మాత్రమే ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఈ కారణంగానే గతంలో కాంగ్రెస్‌ మాదిరి ప్రస్తుతం దేశవ్యాపితంగా ఉన్న బీజేపీ ఒకేసారి ఎన్నికలు జరిగితే తనకు ఉపయోగమని, ఉన్న అధికారాన్ని మరింతగా సుస్ధిరపరచుకోవచ్చని, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే అవకాశాలను తగ్గిస్తాయని గత ఆరు సంవత్సరాలుగా భావిస్తున్నది. ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సింది ఉంది. అదే జరిగితే రాష్ట్రాలలో, కేంద్రంలో ఏ కారణాలతో అయినా ప్రభుత్వాలు కూలిపోతే నిర్ణీత వ్యవధి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంది. దాని అర్ధం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని అధికారమే పరోక్షంగా ఉంటుంది.

కరోనా వ్యాప్తి ప్రారంభానికి ముందే దేశ ఆర్ధిక వ్యవస్ధ దిగజారింది. ఈ కాలంలో మరింత దిగజారి వరుసగా రెండు త్రైమాస కాలాల్లో తిరోగమన వృద్ది నమోదై తొలిసారిగా దేశం మాంద్యంలోకి పోయింది. వచ్చే ఆరు నెలల కాలంలో కూడా పరిస్ధితి పెద్దగా మెరుగుపడే అవకాశాలు లేవని పాలక పార్టీ పెద్దలకు ముందే తెలుసు. వచ్చే రెండు సంవత్సరాల కాలంలో కూడా పూర్వపు స్దాయికి చేరుకొనే అవకాశాలు కష్టమని అనేక మంది ఆర్ధికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. అదే జరిగితే ఇంతకాలం దేశం వెలిగిపోతోందని బీజేపీ చేస్తున్న ప్రచారం తుస్సుమంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరగటం అనివార్యం. అందువలన ముందుగానే రాజ్యాంగ సవరణల వివాదాన్ని ముందుకు తెచ్చి అభివృద్ధి నినాదం మాటున జమిలి ఎన్నికలకు పోవాలన్న ఆలోచన కనిపిస్తోంది. కరోనా ప్రభావం గురించి దేశమంతా ఆందోళన చెందుతోంటే ఆగస్టు 13న ప్రధాని కార్యాలయం స్దానిక సంస్ధలతో సహా అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా తయారీ సాధ్యా సాధ్యాల గురించి చర్చించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలా చేయాలంటే ముందుగా ఆర్టికల్‌ 243కె, 243జడ్‌, ఏ లకు సవరణలు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగింది. దీనికి ప్రధాని ముఖ్యకార్యదర్శి పికె మిశ్రా అధ్యక్షత వహించారు. ఇప్పుడు ప్రధాని మరోసారి ముందుకు తెచ్చారు. పాలకపార్టీ, అధికార యంత్రాంగంలో జరుగుతున్న ఈ చర్చ, కదలికల కారణంగానే అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్నాయి.

2022నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు నిండుతుంది. ఆ సమయానికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తానని చెప్పిన ప్రధాని ఆ బాటలో తీసుకున్న చర్యలేమీ లేవు. కానీ ఒకే దేశం ఒకే ఎన్నికలంటూ పదే పదే మాట్లాడుతున్నారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఉన్న మెజారిటీ, దేన్నయినా బలపరిచే ఇతర పార్టీలు కూడా ఉన్నందున ఒక్క రోజులోనే కాశ్మీర్‌ రాష్ట్రాన్నే రద్దుచేసినట్లు ఒకేసారి ఎన్నికల కోసం జనాభిప్రాయాన్ని తోసిపుచ్చి రాజ్యాంగ సవరణలు చేయటం నరేంద్రమోడీకి పెద్ద సమస్య కాదు. అలాంటి పరిణామం జరిగినా ఆశ్చర్యం లేదు. అందువలన ఈ నేపథ్యంలో అలాంటి ఎన్నికలకు వ్యతిరేకత తెలపటం తప్ప ఉన్న ఆటంకాలు, లాభనష్టాలు ఏమిటి అని తలలు బద్దలుకొట్టుకోవటం కంఠశోష తప్ప మరొకటి కాదు.

Courtesy Nava Telangana

Search

Latest Updates