ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి మూల్యం చెల్లిస్తున్నదెవరు?

Published on

ప్రభాత్‌ పట్నాయక్‌
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రధాని నరేంద్ర మోడీ నుండి నిర్మలా సీతారామన్‌ దాకా కరోనా వల్ల ఏర్పడ్డ సంక్షోభం నుండి దేశ ఆర్థిక వ్యవస్థ ఏవిధంగా కోలుకుంటోందో వివరిస్తున్నారు. ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు మైనస్‌ 8.6 శాతం ఉంటుందని అంచనా వేసిన రిజర్వు బ్యాంకు సైతం అక్టోబరు వచ్చేసరికి కోలుకోవడం గురించే మాట్లాడుతోంది.

లాక్‌డౌన్‌ పుణ్యమా అని మన ఆర్థిక వ్యవస్థ లోతైన ఊబి లోకి దిగబడిపోయింది. ఎంతో కొంత మేరకు పరిస్థితులు తిరిగి సాధారణ స్థితి దిశగా మారుతున్నాయి గనుక ఏదో ఒక మేరకు ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకోవచ్చు. అయితే అదేమీ ప్రభుత్వం తన గొప్పగా చెప్పుకోదగిన విషయం మాత్రం కాదు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జిడిపి మైనస్‌ 23.0 శాతం వృద్ధి రేటు (గతేడాది మొదటి త్రైమాసికంతో పోల్చినపుడు) నమోదు చేసింది. అటువంటప్పుడు రెండో త్రై మాసికంలో మైనస్‌ 8.6 వృద్ధి రేటు (గతేడాది రెండో త్రైమాసికంతో పోల్చి చూసినపుడు) నమోదు కావడం కూడా ఎంతో కొంతమేరకు సాధారణ స్థితి వైపు అడుగులు పడటం కిందే భావించాలి.

ఇలా అట్టడుగు స్థాయి నుండి పైకి మన ఆర్థిక వ్యవస్థ ఎగబాకుతున్నప్పుడు ఆ మెరుగుదల యొక్క స్వభావం ఏమిటన్నదానిని బట్టి ఈ మెరుగుదల ఎంతవరకూ కొనసాగుతుందన్నది ఆధారపడి వుంటుంది. అనేక మంది కార్మికులను పనుల నుండి తొలగించడం, పనిలో ఉన్నవారి జీతాల రేటు కుదించడం, తద్వారా యజమానుల వద్ద పోగుబడే అదనపు విలువ రేటు పెరగడం- ఈ విధంగా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అనేది జరుగుతోంది. అందుచేత ఇది మధ్యలోనే నిలిచిపోవడం అనివార్యం.

2020-21 సంవత్సరం జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో నమోదైన జిడిపి ని ఆ ముందటి ఏడాది అదే మూడు నెలల కాలంతో పోల్చినప్పుడు మైనస్‌ 8.6 శాతం వృద్ధి రేటు నమోదైనట్టు రిజర్వు బ్యాంకు చెప్పింది. అదే మూడు నెలల కాలానికి దక్షిణాసియా మొత్తంగా (ఇందులో భారత దేశానిదే పెద్ద భాగం) కార్మికుల పని గంటలు 18.2 శాతం తగ్గిపోయాయి (అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాల ప్రకారం). అంటే జిడిపి వృద్ధి పడిపోయినదాని కంటే కార్మికుల పని గంటలు తగ్గిపోయిన శాతం ఎక్కువగా ఉంది. దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే గతంలో ఒక యూనిట్‌ జిడిపి కి అవసరమైన పని గంటల కన్నా ఇప్పుడు అవసరమైన పని గంటలు తగ్గిపోయాయి.

ఇలా పని గంటలు తగ్గిపోడానికి ఏదో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, తద్వారా తక్కువ మానవ శ్రమతో ఉత్పత్తి సాధించగలగడం కారణం కాదు. ఇంత స్వల్ప కాల వ్యవధిలో అటువంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం సాధ్యం కానే కాదు. మరి గతంలో పోల్చినప్పుడు ప్రస్తుత కాలంలో తక్కువ పని గంటలతో ఎక్కువ జిడిపి ఎలా సాధ్యపడింది?

మొదటిది-గతంలో తొలగించడం సాధ్యం కాని కార్మికులను ఇప్పుడు ఖర్చు తగ్గించుకునే పేరుతో తొలగించడం. ఉత్పత్తి తగ్గించుకునే క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులను మాత్రమే గాక రెగ్యులర్‌ ఉద్యోగులను కూడా తొలగించడం జరిగింది. ఒక ఉద్యోగి కాంట్రాక్టు ఉద్యోగి అయినా, రెగ్యులర్‌ ఉద్యోగి అయినా వారి టర్నోవర్‌ (వారి ద్వారా జరిగే ఉత్పత్తి) లో తేడా పెద్దగా ఉండదు. కాని వారి జీత, భత్యాలలో తేడా ఉంటుంది. అందువలన ఒక యూనిట్‌ ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఇప్పుడు గతం కన్నా తగ్గుతుంది.
రెండవది-ఎక్కువ మంది కార్మికులు ఉత్పత్తిలో పాల్గొనే రంగాలలో కన్నా తక్కువ మంది కార్మికులతో ఉత్పత్తి జరిగే రంగాలలో కోలుకోవడం ఎక్కువగా జరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా బాగా దెబ్బ తిన్న అసంఘటిత రంగం ఇంకా కోలుకోనేలేదు. దానితో పోల్చితే తక్కువ మంది కార్మికులతో నడిచే సంఘటిత రంగంలో-అది ప్రభుత్వ రంగం కానీయండి, ప్రైవేటు రంగం కానీయండి- కోలుకున్నది ఎక్కువ.

ఇలా గతం కన్నా తక్కువ కార్మిక శ్రమతో ఎక్కువ జిడిపి ని సాధించడంతో బాటు వేతనాల రేట్లలో కూడా తరుగుదల ఉంది. రిజర్వుబ్యాంకు లెక్కల ప్రకారమే కార్పొరేట్‌ రంగంలో ఖర్చులు తగ్గించుకుంటున్నారు. ఇలా తగ్గించుకునే ఖర్చులలో కార్మికులకిచ్చే వేతనాలు ముఖ్యమైన భాగం. తక్కువ మంది కార్మికులతో పని చేయించుకోవడం, తక్కువ జీతాలతో పని చేయించుకోవడం-ఈ రెండు ప్రక్రియల ద్వారా ఖర్చులు తగ్గించుకుంటున్నారు. కొన్ని కార్పొరేట్‌ రంగాలలో చాలా కాలం తర్వాత నికర లాభాలు కూడా వచ్చాయి. లాక్‌డౌన్‌ కాలంలో నిలిచిపోయిన అమ్మకాలు ఆ తర్వాత కాలంలో పెరగడం, అదే సమయంలో ఖర్చులు తగ్గడం వలన ఈ లాభాలు వచ్చాయి.

అయితే ఇలా అసంఘటిత రంగం కోలుకోకుండా ఉండిపోవడం వలన ఆ రంగంలో ఉపాధి చాలా మేరకు తగ్గిపోయింది. దానితోబాటు సంఘటిత రంగంలో కూడా రెగ్యులర్‌ కార్మికులు కొందరు పనులలో నుండి తొలగించబడినందు వలన, తక్కినవారి జీతాలు కుదించబడినందు వలన కార్మికులకు సగటున ఒక గంటకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. అంటే ఒక వైపున జిడిపి కోలుకుంటూ వుంటే మరో వైపున కార్మికులు మరింత పేదవాళ్ళవుతున్నారన్నమాట. అంటే జిడిపి కోలుకునే క్రమంలో కార్మికుల నుండి యజమానులు రాబట్టుకునే అదనపు విలువ మరింత పెరుగుతున్నదని గమనించాలి.

ఈ నిర్ధారణను ధృవపరిచే రెండు ఆధారాలున్నాయి. రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం 887 లిస్టెడ్‌ కంపెనీల (ఆర్థికరంగం లోని కంపెనీలు మినహా) అమ్మకాలతో పోల్చితే వాటి ఖర్చులు బాగా తగ్గాయి అని, దాని ఫలితంగా గత రెండు త్రైమాసికాలలో ఎండిపోయిన ఈ కంపెనీల లాభాలు ఈ త్రైమాసికంలో బాగా పెరిగాయని తెలుస్తోంది.

ఈ కాలం లోనే ఉపాధి హామీ పథకం కింద దరఖాస్తులు చేసుకున్నవారి సంఖ్య బాగా పెరిగింది. అక్టోబరు నెలలోనైతే ఈ సంఖ్య ఏకంగా 91.3 శాతం పెరిగింది! వేరే ఎక్కడా పనులు దొరకడం లేదని దీనిని బట్టి స్పష్టమౌతోంది. లాక్‌డౌన్‌ కాలంలో వలసలు రివర్సులో-అంటే పట్టణాల నుండి పల్లెలకు-జరిగాయి. ఆర్థిక వ్యవస్థ కొంత కోలుకున్నా దానివలన గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు ఏమాత్రం మెరుగుపడలేదు. అంటే పట్టణాల్లో అసంఘటిత రంగం ఏమీ కోలుకోలేదని స్పష్టం అవుతోంది.

ఇంతగా కార్మికవర్గపు స్థితిగతులు దిగజారినా ఆర్థిక వ్యవస్థ కొంత కోలుకున్నది అంటే తమ అవసరాలను తీర్చుకోడానికి అప్పులు చేసి గాని, కొద్దో, గొప్పో కూడబెట్టుకున్న డబ్బును ఖర్చు చేసి గాని వారు సరుకులు కొనబట్టే సాధ్యపడింది. కాని ఇలా ఎంతో కాలం సాగదు కదా. ఉపాధి అవకాశాలు మెరుగు పడకుండా, ఆదాయాలు పెరగకుండా కార్మికులు వినిమయం ఎంతకాలం కొనసాగించగలుగుతారు? అందుచేత వారి వినిమయం పడిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమమూ నిలిచిపోతుంది.
వామపక్షాలు, మరికొన్ని ఇతర రాజకీయ పార్టీలు, ఆర్థికవేత్తలు, కొన్ని పౌరసంఘాలు పదే పదే మొత్తుకుంటున్నా మోడీ ప్రభుత్వం మాత్రం ప్రజల కొనుగోలుశక్తిని పెంచడానికి చేసిందేమీ లేదు. అలా చేయకపోతే ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మరింత కష్టమౌతుందని చేసిన హెచ్చరికలు చెవిటివాని ముందు శంఖమూదినట్టే అయ్యాయి. తాజాగా ప్రకటించిన దానితో సహా అన్ని ఉద్దీపన పథకాలూ ప్రజలకు ఇచ్చినది చాలా స్వల్పం. కార్పొరేట్లకు మాత్రం మరింత సౌకర్యవంతంగా ఉన్నాయి. అయితే ఆ కార్పొరేట్లకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా, ”ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌” సూచికలో భారత్‌ స్థానం ఎంత మెరుగుపడినా ఈ దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగనంతకాలం సరుకులకు డిమాండు పెరగదు. డిమాండు పెరగనంతకాలం కార్పొరేట్లు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టరు.

ఈ దేశంలో డిమాండు పెరగకపోయినా ఎగుమతులను పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచవచ్చునని అనుకుందామా అంటే ఆ అవకాశాలూ కనిపించడం లేదు. గతంలో అదృశ్యమైన దేశాల్లో సైతం కరోనా మళ్ళీ ప్రత్యక్షం అవుతోంది. అమెరికా వంటి దేశాల్లోనైతే అది ఇంతవరకూ తగ్గుముఖం పట్టిందే లేదు. ఈ పరిస్థితుల్లో ఎగుమతులపై ఆశలు అడియాసలే అవుతాయి.
అందుచేత మన దేశంలో వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచడమొక్కటే ముందున్న మార్గం. అటు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న ప్రజల సంక్షేమానికీ ఇదే మార్గం. అటు ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికీ ఇదే మార్గం. కాని ప్రభుత్వం మాత్రం ఈ దిశగా ఒక అడుగు కూడా వేయడం లేదు. పైగా కార్మికుల నుండి దోచుకునే అదనపు విలువను మరింత పెంచే దిశగానే దాని చర్యలు ఉన్నాయి. ఇది త్వరలోనే ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోవడానికి దారితీస్తుంది.

Courtesy Prajashakti

Search

Latest Updates