ఎలక్టోరల్ బాండ్స్.. లోగుట్టు వెనుక..

Published on

– అర్హతలేని పార్టీలకు బాండ్ల ద్వారా నిధులు
– చిరునామా కూడాలేని పార్టీల ఖాతాల్లోకి ..
– విపక్షాల ఓట్లను చీల్చేందుకు ఇదంతా : సామాజిక కార్యకర్త లోకేష్‌ బాత్రా

న్యూఢిల్లీ : మోడీ సర్కార్‌ 2018లో తీసుకొచ్చిన ‘ఎలక్టోరల్‌ బాండ్స్‌’ పథకం లొసుగులమయంగా మారిందనే వాదనలు బలపడుతున్నాయి. అర్హతలేని రాజకీయ పార్టీలకు కూడా బాండ్ల పథకం ద్వారా భారీగా నిధులు పోగేసుకుంటున్నాయి. దీనిపై సామాజిక కార్యకర్త లోకేష్‌ బాత్రా ఆర్టీఐ దరఖాస్తుకు ఎస్బీఐ విడుదల చేసిన సమాచారం వార్తల్లో చర్చనీయాంశమైంది. బాండ్ల ద్వారా అర్హతలేని రాజకీయ పార్టీలకు నిధులు వెళ్లివుండవచ్చు, అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నది తమ వద్ద సమాచారం లేదని ఆర్టీఐ దరఖాస్తుకు ఎస్బీఐ సమాధానమిచ్చింది. బాండ్ల పథకం నిబంధనల ప్రకారం, సార్వత్రిక ఎన్నికలు లేదా చివరిసారి అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీ ఒక్కశాతం ఓట్లు సాధించాలి. అంటే..ఒక రాజకీయ పార్టీకి ఒక్క శాతం కన్నా తక్కువ ఓట్లు వస్తే..బాండ్ల పథకం వర్తించదు. అర్హత ఉందా? లేదా? అని పరిశీలించి బాండ్ల పథకం అమలజేస్తున్నామని ఎస్బీఐ కూడా అధికారికంగా తెలిపింది. అయితే దీనిపై సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా తాజాగా కోరగా..తమ వద్ద ఎలాంటి సమాచారమూ లేదని ఎస్బీఐ వెల్లడించటాన్ని బాత్రా తప్పుబడుతున్నారు. బాండ్ల పథకం అమల్లో ఎన్నో లొసుగులున్నాయని ఆరోపిస్తున్నారు.

అడ్రస్‌ లేని వాటికి కూడా వెళ్తున్నాయి..
ఒక్కశాతం, అంతకన్నా తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలకు భారీగా నిధులు అందుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాల ఓట్లను చీల్చడానికి చిన్న చిన్న పార్టీలకు, అర్హతలేనివాటికి కూడా బాండ్ల పథకంతో నిధులు సమకూరుస్తున్నారని అవగతమవుతున్నది. బాండ్ల ద్వారా నిధులు పొందిన అర్హతలేని రాజకీయ పార్టీల చిరునామాలు కూడా ఎస్బీఐ వద్ద లేవనీ, ఈ పథకంలో అనేక లోగుట్టులు ఉన్నాయనీ, దీనిని వెంటనే ఆపేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.

95శాతం నిధులు బీజేపీకి !
ప్రతిఏటా జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబరు నెలల్లో బాండ్లను కేంద్రం జారీ చేస్తోంది. దేశంలోని 29 ఎస్బీఐ శాఖల్లో మాత్రమే ఈ బాండ్లను అమ్ము తారు. బాండ్ల కొనుగోలుకు చెల్లించిన మొత్తం .. సంబంధిత రాజకీయ పార్టీకి అందుతాయి. జనవరి, 2018 తర్వాత ఇప్పటివరకూ 14సార్లు ఎన్నికల బాండ్లను కేంద్రం జారీచేసింది. 12వేల బాండ్లు అమ్ముడుపోగా, రూ.6480కోట్లు నిధులు అందాయని తెలుస్తోంది ! ఇందులో 95శాతం నిధులు అధికార బీజేపీకే వెళ్లాయని సమాచారం. అర్హతలేని రాజకీయ పార్టీలకు కూడా రూ.వందల కోట్ల నిధులు సమకూరుతున్నాయని సామాజిక కార్యకర్త బాత్రా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం..
సీపీఐ(ఎం), అసోసియేషన్‌ డెమొక్రాటిక్‌ రీఫార్మ్స్‌, కామన్‌ కాజ్‌..వంటి ఎన్జీఓ సంస్థలు ఎన్నికల బాండ్ల పథకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బడా కార్పొరేట్ల నుంచి భారీగా నిధులు స్వీకరించడానికి తీసుకొచ్చిన పథకమని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోడీ సర్కార్‌…ఫైనాన్స్‌ చట్టం ద్వారా బాండ్ల పథకాన్ని తీసుకొచ్చిందనీ, రాజ్యసభ ఆమోదం లేకుండానే చట్టాన్ని తెచ్చారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. రాజకీయాల్లో క్రోనీ క్యాపిటలిజంను పెంపొందించడానికి దోహదపడుతుందని, నిధులు సమకూర్చిన కార్పొరేట్‌ కంపెనీలకు..లబ్ది చేకూర్చే అధికారిక నిర్ణయాలు వెలువడుతాయని ఆరోపణలున్నాయి.

Courtesy Nava Telangana

Search

Latest Updates