ఇది హేతువిరుద్ధతపై సమ్మె

Published on

ప్రభాత్‌ పట్నాయక్‌
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రజలపై సంక్షోభం కారణంగా పడుతున్న భారాలను, కష్టాలను నివారించడంలో ఎంతగా బిజెపి విఫలమౌతుంటే అంతగా వారి దృష్టిని పక్కకు మళ్ళించే హేతువిరుద్ధ చర్చలను ముందుకు తెస్తోంది. తద్వారా వారు తిరిగి తమ సమస్యలపై చర్చ వైపు మళ్ళకుండా అడ్డుకుంటోంది. అందుకోసం హిందూత్వ చర్చను మరింతగా ఎగదోస్తోంది. అందుకు మరిన్ని అభూత కల్పనలను ప్రచారం లోకి తెస్తోంది. మరిన్ని నిరాధారమైన కట్టుకథలను, అవాస్తవాలను ప్రచారం చేస్తోంది.

నవంబరు 26 సమ్మెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశం లోని కార్మికులపై, రైతాంగంపై ముందెన్నడూ లేని విధంగా మోడీ ప్రభుత్వం బరితెగించి సాగించిన దాడులకు ఇది నిరసన. సామ్రాజ్యవాదుల ఎజెండాను మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్నందుకు ఇది నిరసన. అంతే కాదు, మరింత లోతైన కారణాల రీత్యా కూడా ఈ సమ్మె ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ దేశంలో ప్రజానీకం చర్చించే విషయాన్ని పక్కకు మళ్ళించడంలో జయప్రదం కాగలిగారు కాబట్టే హిందూత్వ శక్తులు అధికారం లోకి రాగలిగారు. దాదాపు ఒక శతాబ్దం పాటు ఈ దేశంలో ప్రజల నడుమ చర్చనీయాంశంగా కొనసాగుతూ వచ్చిన అంశాన్ని వాళ్ళు పక్క దోవ పట్టించారు. 1917లో గాంధీజీ చంపారన్‌ పర్యటించారు. అక్కడ రైతుల పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకునే నిమిత్తం ఆయన వెళ్ళారు. అప్పటి నుండీ, జాతీయోద్యమ కాలం అంతా, ఆ తర్వాత స్వాతంత్య్రానంతర కాలంలో కూడా, ఇంకా చెప్పాలంటే, ఈ హిందూత్వ శక్తులు అధికారంలోకి వచ్చే వరకూ, ప్రజల భౌతిక జీవితాలను ఏవిధంగా మెరుగు పరచాలనే అంశం చుట్టూ దేశంలో చర్చ నడిచింది. మార్క్స్‌ మాటల్లో చెప్పాలంటే ”ఇహలోకపు ఆచరణాత్మక జీవితం” గురించిన చర్చ అది. ప్రజల భౌతిక జీవన పరిస్థితులలో ఏవిధంగా మెరుగుదల తీసుకు రావాలన్నది చర్చనీయాంశంగా ఉండింది. రాజకీయ అధికారం కావాలనుకున్న వివిధ రాజకీయ కూటములు తాము అధికారం లోకి వస్తే ఏవిధంగా ఆ మెరుగుదల తీసుకు వస్తామన్నది ప్రతిపాదిస్తూ వచ్చారు. పేదరికాన్ని ఏవిధంగా నిర్మూలించాలి, నిరుద్యోగాన్ని ఎలా రూపుమాపాలి, వృద్ధి ఏ పద్ధతుల్లో సాధించాలి, ఆరోగ్య సంరక్షణ, విద్య తదితర సంక్షేమ విధానాలు ఏరీతిన ఉండాలి వంటి అంశాల చుట్టూ చర్చలు జరుగుతూ వుండేవి.

ఇందిరాగాంధీ అప్రతిష్ట మూటగట్టుకున్న ఎమర్జెన్సీ చీకటి రోజులలో సైతం చర్చలు ప్రధానంగా ఈ అంశాల చుట్టూనే జరిగేవి. ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాలరాసి తన నియంతృత్వ అధికారాన్ని చలాయించడానికి ఆమె పూనుకుంది. అయినప్పటికీ ఆ కాలంలో ఆమె ప్రతిపాదించిన 20 సూత్రాల పథకం తదితర ప్రకటనలన్నీ ప్రజల భౌతిక జీవితాలను ఏవిధంగా మెరుగుపరచనున్నాయో వివరించడం చుట్టూనే తిరిగాయి. అయితే బిజెపి మాత్రం ఇటువంటి చర్చలకు తన వంతుగా ఏ విధంగానూ తోడ్పడలేదు. ఎంతసేపూ తనకు పోషకులుగా ఉన్న కార్పొరేట్లు అందించిన ఆదేశాలను అమలు చేయడమో లేకపోతే ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు వంటి సంస్థల ఆదేశాలను పాటించడమో తప్ప ఆర్థిక విషయాలలో తమకంటూ ఎటువంటి స్వంత విధానాలూ లేని పార్టీ బిజెపి.

దేవాలయాలను నిర్మించడం, మసీదులను ధ్వంసం చేయడం, ఎంతసేపూ మన చుట్టూ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని, వాటిలో మైనారిటీలు భాగస్వాములు అవుతున్నారని గగ్గోలు పెట్టడం, అన్ని చోట్లా విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి పద్ధతుల ద్వారా ప్రజాసమస్యల పరిష్కారం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించి హేతువిరుద్ధమైన ప్రత్యామ్నాయ ఎజండా చుట్టూ ప్రజల మధ్య చర్చను లేవనెత్తడమే తన కార్యక్రమంగా బిజెపి పెట్టుకుంది. చరిత్రకు పుక్కిటి పురాణాలకు మధ్య తేడాను గుర్తించలేనంతగా గందరగోళపరచడం, ఎటువంటి ఆధారాలూ లేకుండానే ఆరోపణలూ, ప్రచారాలూ చేయడం బిజెపి అనుసరించిన ప్రచార వ్యూహం సారాంశం. అటువంటి పద్ధతులను అనుసరిస్తేనే తన విద్వేష, హేతు విరుద్ధ ఎజెండాపై ఎప్పుడూ ప్రజల మధ్య చర్చ జరుగుతూ వుండేట్టు చేయగలదు.
ప్రస్తుతం నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం సంక్షోభంలో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో పడింది. ఇటువంటి సమయంలో ప్రజల మధ్య చర్చ ఈ విధంగా దారి మళ్ళడం కార్పొరేట్‌-ద్రవ్య పెట్టుబడి ఆధిపత్య కూటమికి ఎంతైనా అవసరం, లాభదాయకం. ఇంతవరకూ నయా ఉదారవాద విధానాలు ఈ కూటమి ఆధిపత్యాన్ని సమర్ధిస్తూ ముందుకు తెచ్చిన వాదనలు ఇప్పుడు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఆర్థిక వృద్ధిరేటు బాగా ఉన్నట్టు కనపడిన రోజుల్లో సైతం వృద్ధి ఫలాలు దిగువ స్థాయి పేదలకు ప్రవహిస్తాయన్న ఉదారవాద సిద్ధాంతం ఆచరణలో కానరాలేదు. ఇప్పుడు చూస్తే ఆ వృద్ధి కూడా నయా ఉదారవాద సంక్షోభం కారణంగా కనుమరుగైంది. నిరుద్యోగం మరింత ప్రబలింది. ఇటువంటి సమయంలో ప్రజల దృష్టిని ఈ సమస్యల నుండి పక్కకు మళ్ళించే చర్చ పాలక వర్గాలకు ఎంతైనా అవసరం. అందుకే ఆ వర్గం భారీగా ఆర్థిక తోడ్పాటును అందించి బిజెపిని అధికార పీఠం మీద కూర్చోబెట్టింది.

ఎంతకాలం ఈ హేతువిరుద్ధ, విద్వేషపూరిత ఎజెండాను ప్రజల నడుమ చర్చనీయాంశంగా ఉంచగలుగుతుందో, ఎంత కాలం వరకూ ప్రజల వాస్తవ సమస్యల పరిష్కారం చర్చకు రాకుండా దూరంగా ఉంచగలుగుతుందో అంతకాలం బిజెపి అధికారంలో కొనసాగే వీలుంటుంది. ప్రజా సమస్యల ఎజెండా చుట్టూ ఇంత కాలమూ చర్చ నడిచింది. దాని చుట్టూ వర్గ పోరాటాలు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ అదే ఎజెండా రంగం మీదకు గనుక వస్తే ఇక బిజెపి ఆధిపత్యానికి కాలం చెల్లినట్టే. నయా ఉదారవాద సంక్షోభం, దానికి తోడు ఇప్పుడు మీదబడ్డ కోవిడ్‌-19 సంక్షోభం వలన బిజెపి ఇంకెంతో కాలంపాటు ప్రజా సమస్యల ఎజెండా ను పక్కన పెట్టడం సాధ్యం కాదు. బిజెపి ఎంత ప్రయత్నించినా ఈ ఎజెండా మళ్ళీ, మళ్ళీ ముందుకు తోసుకు వస్తూనే వుంటుంది, బిజెపి ఆధిపత్యాన్ని సవాలు చేస్తూనే వుంటుంది.

వాస్తవానికి 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందే ప్రజా ఎజెండా ముందుకొచ్చింది. డిల్లీకి భారీగా తరలి వచ్చిన రైతులు జరిపిన ప్రదర్శన, దాని తర్వాత మహారాష్ట్ర రైతుల మహా పాదయాత్ర దానికి సంకేతాలు. అయితే ఆ తర్వాత పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి, వెనువెంటనే బాలాకోట్‌ వైమానిక దాడి హిందూత్వ ఎజెండాను తిరిగి రంగం మీదకు తెచ్చాయి. మోడీ ప్రభుత్వానికి రెండో దఫా అధికారం అందించాయి.
ఈ రెండో దఫాలో మరింత క్రూరంగా, ఒక పథకం ప్రకారం ప్రజాస్వామిక హక్కుల పైన, పౌర హక్కుల పైన, ప్రజల జీవన పరిస్థితుల పైన దాడులు జరుగుతున్నాయి. రాజ్యాంగం లోని 370 అధికరణ రద్దు, రాష్ట్రాలకు జిఎస్‌టి పరిహారాన్ని ఎగగొట్టి కేంద్రం మాట తప్పిన వైనం, వివక్షా పూరితమైన పౌరసత్వ చట్ట సవరణ, మూడు వ్యవసాయ చట్టాలు, వందేళ్ళు పోరాడి కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాసిన తీరు కొన్ని కొట్టొచ్చినట్టు కనపడే దృష్టాంతాలు. మార్చి నెలలో కేవలం నాలుగు గంటల వ్యవధి లోనే లాక్‌డౌన్‌ విధించి లక్షలాది వలస కార్మికులను నడిరోడ్డు పైకి నెట్టారు. నిరాధారంగా నిలిచిన శ్రామిక ప్రజలకు సహాయం అందించడంలో ఏ ఇతర బూర్జువా ప్రభుత్వాలూ ప్రదర్శించనంత పిసినారితనాన్ని మోడీ ప్రభుత్వం ప్రదర్శించింది. ఈ ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా, ఎంత అమానవీయంగా వ్యవహరించిందో చెప్పడానికి ఇవి చాలు. నిజానికి ఈ మహమ్మారిని సాకుగా చూపించి శాంతియుతంగా పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలను మూకుమ్మడిగా అరెస్టులు చేసింది. వారిని భయభ్రాంతులను చేసింది. ఎటుతిరిగీ వారు కరోనా విజృంభణ అనంతరం తమ ఆందోళనలను నిలిపివేసి వుండేవారు.

దేశాన్ని అస్థిరత పాలు చేయడానికి కుట్రలు, దేశద్రోహం, మన సంస్కృతిని రక్షించుకోవడం వంటి హేతువిరుద్ధ చర్చలను ముందుకు తెచ్చి తన దుర్మార్గపు చర్యలను సమర్ధించుకుంటున్నది బిజెపి. ప్రజలపై సంక్షోభం కారణంగా పడుతున్న భారాలను, కష్టాలను నివారించడంలో ఎంతగా బిజెపి విఫలమౌతుంటే అంతగా వారి దృష్టిని పక్కకు మళ్ళించే హేతువిరుద్ధ చర్చలను ముందుకు తెస్తోంది. తద్వారా వారు తిరిగి తమ సమస్యలపై చర్చ వైపు మళ్ళకుండా అడ్డుకుంటోంది. అందుకోసం హిందూత్వ చర్చను మరింతగా ఎగదోస్తోంది. అందుకు మరిన్ని అభూత కల్పనలను ప్రచారం లోకి తెస్తోంది. మరిన్ని నిరాధారమైన కట్టుకథలను, అవాస్తవాలను ప్రచారం చేస్తోంది.

ప్రజలను బాగా ఆకట్టుకునే విధంగా మోడీ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతోందని, అయితే అవేవీ వారి సమస్యలను పరిష్కరించేవి కావని అమర్త్యసేన్‌ అన్నారు. ఇందుకోసం మోడీ ప్రభుత్వం రోజుకొక కట్టుకథ అల్లవలసి వస్తోంది. ప్రజల భౌతిక పరిస్థితులు ఎంతగా దిగజారుతూ వుంటే అంతగా ఈ హిందూత్వ శక్తులు వారి దృష్టిని మళ్ళించే కొత్త కొత్త అభూత కల్పనలను సృష్టించవలసి వస్తోంది. మరింత హేతు విరుద్ధంగా చర్చ జరగాలంటే వారికి ఇదే దారి.

లౌకికతత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా హిందూత్వ శక్తులు వ్యవహరిస్తున్న తీరు అంతకంతకూ ఎక్కువ మంది గుర్తిస్తున్నారు. స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, ఇతర రాజ్యాంగ విలువలపై ఆధారపడి ఏర్పడింది. ఈ విలువలన్నీ మౌలికంగా ”ఇహలోకపు జీవితం”పై ఆధారపడి రూపొందినవే. భౌతిక జీవితపు ఆచరణాత్మక సమస్యల చుట్టూ తిరిగేవే. హిందూత్వ శక్తులు తాము రాజ్యాంగానికి కట్టుబడి వున్నామని ఎన్నిసార్లు, ఎంత గొంతు చించుకున్నా వారు ముందుకు తెస్తున్న చర్చ మాత్రం ప్రజాస్వామ్యంతో గాని, లౌకిక తత్వంతో గాని, రాజ్యాంగంతో గాని ఏమాత్రమూ సంబంధం లేనివి.

అయితే, వాళ్ళెంతగా ప్రయత్నిస్తున్నా, ప్రజా సమస్యలు, వాటి పరిష్కారాలకు సంబంధించిన చర్చలు పదే పదే ముందుకు వస్తూనే వున్నాయి. హిందూత్వ ఆధిపత్యం తాత్కాలికమైనదేనని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. బీహార్‌ ఎన్నికలలో నిరుద్యోగ సమస్య ప్రధానంగా తెరమీదకు వచ్చింది. ఎన్‌డిఎ కూటమి భారీగా వనరులను కుమ్మరించినా, ప్రతిపక్ష కూటమి మంచి విజయాలు సాధించింది. వాస్తవానికి మొత్తం ఓట్లలో ప్రతిపక్ష కూటమికే ఎక్కువ ఓట్లు పడ్డాయి. హేతువిరుద్ధ చర్చను వెనక్కి నెట్టగలగడమే బీహార్‌ ఎన్నికలలో వచ్చిన సానుకూల పరిణామం.

నవంబరు 26న తలపెట్టిన సమ్మె ఈ క్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే పోరాటం. హేతుబద్ధమైన చర్చను తిరిగి కేంద్ర స్థానానికి తీసుకు వచ్చేందుకు చేపట్టిన అత్యంత సాహసోపేతమైన చర్య ఇది. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, రాజ్యాంగ విలువలు తిరిగి పునరుజ్జీవం పొందాలంటే హేతుబద్ధమైన చర్చ ముందు కేంద్ర స్థానానికి రావాలి. అందులో జీవితపు ఆచరణాత్మక సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలు వుండాలి. ఆ విధంగా చూసినప్పుడు నవంబరు 26 సమ్మె ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని కూడా రక్షించుకోడానికి జరిగిన సమ్మె అని గుర్తించాలి.

Courtesy Prajashakti

Search

Latest Updates