కొలిక్కిరాలే…

Published on

– మళ్లీ తేల్చని మోడీ సర్కార్‌
– ఏడు గంటలపాటు చర్చ…
– కొనసా.. తున్న మంతనాలు.. 5న మరోసారి భేటీ
– చట్టాల సవరణలకు సిద్ధమన్న కేంద్రం
– చట్టాలు రద్దు చేయాల్సిదే : రైతు నేతల డిమాండ్‌
– ఆందోళన కొనసాగిస్తాం : హన్నన్‌ మొల్లా

న్యూఢిల్లీ : రైతు సమస్యలపై మోడీ సర్కారు ఎటూ తేల్చలేదు. రైతు సంఘాలతో ప్రభుత్వం గురువారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రైతుల డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో ప్రభుత్వ ప్రతిపాదనలకు రైతు సంఘాలు ససేమిరా అన్నాయి. చర్చలు అసంపూర్తిగా ముగియడంతో మళ్లీ మరో దఫా చర్చలు శనివారం నిర్వహించను న్నారు. మూడు రైతు వ్యతిరేక చట్టాల రద్దు, విద్యుత్‌ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రైతు ఉద్యమం నేపథ్యంలో రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చోపచర్చలు చేస్తున్నది. తొలిసారిగా మంగళ వారం చర్చలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఏమీ తేల్చలేదు. మళ్లీ గురువారం నాడిక్కడ విజ్ఞాన భవన్‌లో చర్చలు నిర్వహించింది. కేంద్ర ప్రభు త్వం తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూశ్‌ గోయల్‌, కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోం ప్రకాశ్‌ హాజరయ్యారు. గత సమావేశంలో 35 మంది రైతు సంఘాల నేతలు హాజరైతే, ఈ సమావేశంలో 40 మంది రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. హన్నన్‌ మొల్లా (ఏఐకేఎస్‌), గుర్నామ్‌ సింగ్‌ (బీకేయూ), శివ కుమార్‌ (మధ్యప్రదేశ్‌), మేజర్‌ సింగ్‌ పునివాలా (ఏఐకేఎస్‌, పంజాబ్‌), దర్శన్‌ పాల్‌, జగ్‌మోహన్‌ సింగ్‌, సత్‌నామ్‌ సింగ్‌, బల్బీర్‌ సింగ్‌ రాజేవాలా, జగ్‌జీత్‌ సింగ్‌ దళ్లేవాల్‌ (పంజాబ్‌), కవిత కూరగంటి, రాకేష్‌ తికాయత్‌, హర్బల్‌ సింగ్‌ , అంచావతా, అభిమన్యు కుహర్‌ తదితర నేతలు హాజరయ్యారు.

సుదీర్ఘంగా ఏడు గంటల పాటు జరిగిన సమావేశంలో రైతు సంఘాల నేతలు ఐక్యంగా చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే రైతు సంఘాల నేతలకు నచ్చచెప్పడానికి కేంద్ర మంత్రులు ప్రయత్నించారు. అందుకు రైతు సంఘాల నేతలు అంగీకరించలేదు. తమ ఏకైక డిమాండ్‌ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడమేనని స్పష్టం చేశారు. ఉదయం సమావేశం ప్రారంభమైనప్పుడు రైతు సంఘాల నేతలను వ్యవసాయ చట్టాల్లో క్లాజ్‌లు వారీగా అభ్యంతరాలుంటే చెప్పండని కేంద్ర మంత్రులు అడిగారు. అందుకు స్పందించిన రైతు సంఘాల నేతలు క్లాజుల వారీగా చెప్పేందుకు తాము వెళ్ళామనీ, ఈ చట్టాల ఉద్దేశాలే తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. మధ్యాహ్నం భోజనం తరువాత కేంద్ర మంత్రులు ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. దానికి స్పందనగా రైతు సంఘాల నేతలు ప్రెజెంటేషన్‌ చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు పక్కకు వెళ్లి మాట్లాడుకొని సమావేశానికి వచ్చారు. చట్టంలోని కొన్ని సవరణలు చేస్తామని అన్నారు.

అయితే అందుకు రైతు సంఘాల నేతలు కుదరదని స్పష్టం చేశారు. చట్టాలే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తుంటే, మళ్లీ సవరణలేందుకని ప్రశ్నించారు. చట్టాల మౌలిక ఉద్దేశమే రైతులకు వ్యతిరేకంగా ఉన్నదనీ, అందువల్ల రైతులకు నష్టం చేకూరుతోందని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర జోలికి పోవటం లేదనీ, కనీస మద్దతు ధర అలానే ఉంటుందని కేంద్ర మంత్రులు చెప్పారు. దానికి రైతు సంఘాల నేతలు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. అందుకోసం ప్రత్యేక చట్టం తేవాలని స్పష్టం చేశారు. ఎంఎస్‌పీ ఇప్పుడేదో చేసింది కాదనీ, గతం నుంచి ఇస్తునే ఉన్నారనీ, కానీ దానికి చట్టబద్ధత లేదని రైతు సంఘాల నేతలు తెలిపారు. అయితే చర్చలు ఫలవంతంగా జరగకపోయేసరికి తదపరి చర్చలు డిసెంబర్‌ 5 (శనివారం) నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎంఎస్‌పీ మీద కూడా చర్చించనున్నారు.

ఆందోళన కొనసాగిస్తాం : హన్నన్‌ మొల్లా
కేంద్ర ప్రభుత్వంతో తమ చర్చలు సంపూర్ణంగా ముగియలేదనీ, అందుకే తమ ఆందోళనను కొనసాగిస్తామని ఏఐకేఎస్‌సీసీ నేత హన్నన్‌ మొల్లా స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని రైతు సంఘాల నేతలందరూ ఒకే ఎజెండాతో ఉన్నారనీ, కేంద్ర ప్రభుత్వం వైఖరిపై తాము సంతోషంగా లేమని అన్నారు. చట్టాల్లో ఏడు, ఎనిమిది సవరణలు చేసేందుకు కేంద్రం యోచించిందనీ, అందుకు తాము ఒప్పుకోలేదనీ, వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేసినట్టు తెలిపారు. నేడు (శుక్రవారం) రైతు సంఘాలన్ని సమావేశమై తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

సరైన దిశగా చర్చలు : నరేంద్ర సింగ్‌ తోమర్‌, కేంద్ర మంత్రి
చర్చలు సౌహార్ధభావంతో జరిగాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. రైతు సంఘాల నేతలు తమ అభిప్రాయాలు చెప్పారనీ, తాము తమ అభిప్రాయాలు చెప్పామని తెలిపారు. ప్రభుత్వానికి ఎలాంటి అహం లేదనీ, మనసు విప్పి మాట్లాడుతున్నామని అన్నారు. ఏపీఎంసీ, కనీస మద్దతు ధర, కాంట్రాక్‌ వ్యవసాయం, విద్యుత్‌ బిల్లులపై రైతు సంఘాల నేతలు అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. వాటిని పరిగణలోకి తీసుకున్నామనీ, మళ్లీ శనివారం జరిగే చర్చల్లో చర్చిస్తామని అన్నారు. సమస్యలపై ఒకసారి చర్చలు మొదలు పెట్టిన తరువాత, అది అంతిమంగా పరిష్కారం వరకు వెళ్తుందని అందువల్ల రైతులు ఆందోళన విరమించాలని కోరుతున్నానని అన్నారు.

మీ భోజనం మాకొద్దు…
ఇక భోజన విరామ సమయంలో ప్రభుత్వం అందించే ఆహారాన్ని అన్నదాతలు నిరాకరించారు. తామే వండుకుని తెచ్చుకున్న భోజనాన్ని మాత్రమే స్వీకరించారు. రైతులంతా పొడవైన డైనింగ్‌ టేబుల్‌ దగ్గర తమతో పాటు తెచ్చుకున్న భోజనాన్ని తినగా.. మరి కొందరు రైతులు కింద కూర్చుని భోజనం చేశారు. టీ, కాఫీ, స్నాక్స్‌ కూడా రైతులు తమ వెంట తెచ్చుకు న్నారు. ఈ సందర్భంగా ఓ రైతు సంఘం నాయకుడు మాట్లాడుతూ… ‘వారు మాకు భోజనం, టీ, కాఫీలు ఇవ్వాలని చూశారు. కానీ మేం వాటిని తిరస్కరించాం’ అని తెలిపారు.

Courtesy Nava Telangana

Search

Latest Updates