ఉధృతం..

Published on

– రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు
– ఢిల్లీ సరిహద్దుల్లో 19వ రోజు కొనసాగిన ఆందోళన
– 40 మంది రైతు నేతలు నిరాహారదీక్ష ొ దీక్షలో కూర్చున్న కేజ్రీవాల్‌, మంత్రులు
– రాజస్థాన్‌, యూపీ, మధ్యప్రదేశ్‌ నుంచి ఢిల్లీ దిశగా రైతులు
– శివార్లలో భారీగా భద్రతా బలగాలు
– వందలాది మంది అరెస్టు
– ఎంఎస్‌పీ పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారు : రైతు నేతలు

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో 19 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం సాగిస్తున్న రైతులు సోమవారం తమ పోరును మరింత ఉధృతం చేశారు. వారికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ”సంయుక్త కిసాన్‌ మోర్చా” ఇచ్చిన దేశవ్యాప్త ఆందోళనల్లో భాగంగా సోమవారం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బీహార్‌, పంజాబ్‌, హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల్లో జిల్లా స్థాయిల్లో వందలాది ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. అసోం, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, ఛత్తీస్‌గఢ్‌ల్లో భారీస్థాయిల్లో నిరసనలు జరిగాయి. వందలాది మంది అరెస్టు అయ్యారు. దేశంలో 60 శాతం కంటే ఎక్కువ జిల్లాల్లో లక్షల్లో ప్రజలు బయటకు కొచ్చి ఆందోళనలు చేశారు. మణిపూర్‌లోనూ చాలాచోట్ల నిరసనలు జరిగాయి. రైతుల ఆందోళనకు మద్దతుగా వారణాసిలోని బెనారస్‌ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ) గేట్‌ వద్ద విద్యార్థుల ఆందోళన చేపట్టారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, మంత్రులు దీక్ష చేపట్టారు. ప్రజాసంఘాలు భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి.

19 రోజు కొనసాగిన రైతు ఉద్యమం
ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం 19 రోజు కూడా కొనసాగింది. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలు సింఘూ, టిక్రీ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు ఘాజీపూర్‌, నోయిడా (చిల్లా), పల్వాల్‌లో రైతుల ఆందోళన కొనసాగింది. హర్యానా-రాజస్థాన్‌ సరిహద్దు ప్రాంతం షాజహాన్పూర్‌ సమీపంలో రేవారీ వద్ద కూడా రైతుల ఆందోళన కొనసాగింది. దీంతో ఆయా జాతీయ రహదారులను దిగ్బంధించారు. ఖాజీపూర్‌ సరిహద్దు వద్ద నిరసన తెలిపిన రైతులు మీరట్‌ జాతీయ రహదారిను అడ్డుకున్నారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి పదివేల మంది రైతులు ఢిల్లీ వైపు ఇంకా వస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. రాయబరేలిలో రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌ నేతలు నిర్వహించిన కిసాన్‌ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. యూపీ రాష్ట్రవ్యాప్తంగా సమాజ్‌వాదీ పార్టీ ఆందోళనలు చేపట్టింది.

జాతీయ రహదారుల వెంట పారా మిలటరీ బలగాలు
మరోవైపు ఢిల్లీ శివారు ప్రాంతాల్లో, జాతీయ రహదారుల వెంట కేంద్ర పారామిల టరీ బలగాల్ని మోడీ సర్కార్‌ మోహరిస్తోంది. బలగాల సంఖ్యను రోజు రోజుకీ పెంచుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ వైపునకు వస్తున్న రైతుల్ని జాతీయ రహదార్లపై అడ్డుకుంటోంది. బారికేడ్లను, జలఫిరంగులను, ఇనుపుకంచెలను ఏర్పాటుచేస్తోంది. మొదటి దశలో ఢిల్లీ పోలీసులను అడ్డుగా మోహరించి, అటు తర్వాత రెండో దశలో ర్యాపిడ్‌ యాక్షన్‌, పారా మిలటరీ బలగాల్ని మోహరించారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో హర్యానా-రాజస్థాన్‌ సరిహద్దును పోలీసులు మూసేశారు. ఢిల్లీ-నోయిడా మార్గం మీద ఏర్పాటుచేసిన శిబిరాలను తొలగించేం దుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు వివాదానికి దారితీశాయి. పోలీసుల బలప్రయోగాన్ని చూసి రైతులు ఎక్కడా వెనుకడుగు వేయటం లేదు.

40 మంది రైతు నేతలు నిరాహార దీక్ష
రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. దేశవ్యాప్త ఉద్యమంతో పాటు, ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు రైతు సంఘాల నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు వరకు 40 మంది రైతు సంఘాల నేతలు నిరాహార దీక్షలో కూర్చున్నారు. సింఫ్‌ు సరిహద్దు వద్ద 25 మంది, టిక్రీ వద్ద 10 మంది, ఘాజీపూర్‌ వద్ద 5 గురు రైతు నేతలు నిరాహార దీక్షల్లో కూర్చున్నారు.

ప్రజా సంఘాల భారీ సంఘీభావ నిరసన
ఢిల్లీలో షాహిద్‌ పార్క్‌ వద్ద ప్రజా సంఘాలు, మేథావులు ”ఢిల్లీ ఫర్‌ కిసాన్‌” ఆందోళన నిర్వహించారు. ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, రైతు వ్యతిరేక మోడీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాల హోరెత్తించారు. నిరసన తెలుపుతున్న ఆందోళన కారులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు భారీ స్థాయిలో భారీకేడ్లు, బలగాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ నందితా నారాయణ్‌, జేఎన్‌యూ ప్రొఫెసర్‌ వికాశ్‌ రావల్‌, జెఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌, హన్నన్‌ మొల్లా (ఏఐకేఎస్‌), జెఎస్‌ మజూంధర్‌, అమితవ్‌ గుహ (సీఐటీయూ), అమర్‌ జిత్‌ కౌర్‌ (ఏఐటీయూసీ), నత్తు ప్రసాద్‌ (డిఎస్‌ఎంఎం), మొమూనా మొల్లా, ఆశాశర్మ (ఐద్వా), మయూక్‌ బిశ్వాస్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), విక్రమ్‌ సింగ్‌ (ఏఐఎడబ్ల్యూయూ), అనీరాజా (ఏఎఫ్‌ఐడబ్ల్యూ), సాయిబాలాజీ (ఎఐఎస్‌ఎ) తదితర ప్రజాసంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.

రైతు చట్టాలు ద్రవ్యోల్బణానికి కారణం అవుతాయి: కేజ్రీవాల్‌
రైతు చట్టాలు అమలు జరిగితే తీవ్రమైన అనిశ్చితి, ద్రవ్యోల్బణానికి కారణం అవుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. వీటివల్ల కేవలం రైతులే కాకుండా సామాన్య ప్రజానీకం సైతం ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మంత్రులు, తన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో పాటు ఆయన రైతు ఉద్యమానికి మద్దతుగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయెల్‌ విధాన సభలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఒక రోజు దీక్షలో కూర్చున్నారు. చాలా మంది ఢిల్లీ పౌరులు కూడా ఉపవాసం పాటించారు.

ఎంఎస్‌పీ పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారు : గుర్నమ్‌సింగ్‌
ఎంఎస్‌పీతో పంటల కొనుగోలును కొనసాగిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు గుర్నమ్‌ సింగ్‌ చాదుని విమర్శించారు. కిసాన్‌ నేత రాంపాల్‌ జాట్‌ మాట్లాడుతూ ”ఈ ఉద్యమం రాజకీయం కాదు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అందుకే వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా ఉద్యమాన్ని ఏ రాజకీయ పార్టీ హైజాక్‌ చేయదు” అని అన్నారు.

రైతులతో మళ్ళీ సమావేశం: తోమర్‌
సాగు చట్టాల్లోని అభ్యంతరాలు, ఇబ్బందులపై రైతుల తో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ చర్చలు జరుపుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. రైతుల స్పందన కోసం తాము ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. వారు ఎప్పుడు అన్న విషయం చెబితే కేంద్ర ప్రభుత్వం చర్చలకు సమావేశం నిర్వహిస్తుందన్నారు.

Courtesy Nava Telangana

Search

Latest Updates