ప్రజల మద్దతు పొందిన ఉద్యమం

Published on

- జయతీ ఘోష్‌
– జయతీ ఘోష్‌

రెండు వారాల క్రితం ఢిల్లీ నగర సరిహద్దులో 20లక్షలకు పైగా రైతులు ప్రారంభించిన భారీ ముట్టడిలో మన దేశ రాజధాని ఉంది. రైతు కుటుంబాలకు చెందిన యువకులు, వృద్ధులు, మహిళలతో పాటు, పిల్లలు కూడా ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో ఆరుబయట రోడ్లపై మకాం వేశారు. వైరస్‌ అంటువ్యాధిని కూడా లెక్క చేయకుండా తమకు సంబంధించిన వారినందరినీ వదిలేసి, కొన్ని నెలలకు సరిపడా ఆహార పదార్థాలను వెంట తీసుకొని, సుదీర్ఘ కాలంపాటు ప్రయాణం చేసి వచ్చారు.

ఢిల్లీకి పొరుగునున్న పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన కొన్ని వేల సంఖ్యలో రైతులు, నగరంలో తమ కష్టాలను, బాధలను ప్రజలకు తెలియజేయాలని తమ వాహనాలపై దేశ రాజధాని వైపు వచ్చినప్పుడు ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో, తరువాత ఈ నిరసనలు మరింతగా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఐక్యత చెదిరిపోతున్న ఛాయలు ఏ కోశానా కనిపించడం లేదు. భారతదేశ వ్యాప్తంగా 500పైగా రైతు సంఘాలు, నిరసనకారుల డిమాండ్లకు మరియు డిసెంబర్‌ 8న ”భారత్‌ బంద్‌”కు రైతులిచ్చిన పిలుపుకు మద్దతు పలికాయి. ఈ పిలుపునకు కార్మికసంఘాలు, వివిధ ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

కరోనా మహమ్మారి ముమ్మరవ్యాప్తి కాలంలో రైతులతో, భారత రాజ్యాంగం ప్రకారం వ్యవసాయానికి బాధ్యత వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి సంప్రదింపులు జరుపకుండానే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను హడావుడిగా ఆమోదించిన కారణంగానే ఈ అత్యవసర నిరసనల వెల్లువ ప్రారంభమైంది. పైకి చూడడానికి ఈ చట్టాలు, నిరపాయకరంగా లేదా రైతులకు లాభసాటిగా కూడా కనిపిస్తాయి. అవి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలపై ఉన్న పరిమితులను సడలిస్తూ, నిత్యావసరాల సరుకుల చట్టం 1955 కింద నిల్వ చేసుకోడానికి ఉన్న అవరోధాలను తొలగిస్తూ, రాతపూర్వక ఒప్పందాలపై ఆధారపడి ఒప్పంద వ్యవసాయానికి అనుమతిస్తాయి. ”సమర్థవంతమైన, పారదర్శకమైన, ఎటువంటి అడ్డంకులు లేని” వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే ”పోటీ ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలతో” రైతులు, వ్యాపారులు ఎంపిక స్వేచ్ఛను అనుభవించే ఒక పర్యావరణ వ్యవస్థను సష్టించడమే ప్రభుత్వ లక్ష్యం.

భారతదేశ రైతులు ఈ కొత్త చట్టాలను చూసే దృష్టి చాలా భిన్నంగా ఉంది. ఈ ”ఆధునిక” చట్టాలు, రాజకీయంగా మంచి సంబంధాలు కలిగి ఉన్న వ్యాపార దిగ్గజాల నాయకత్వంలో, భారతదేశ వ్యవసాయంలో దోచుకుతినే కార్పొరేట్‌ వ్యాపారీకరణకు మార్గం సుగమం చేస్తాయని వారు భయపడుతున్నారు. రైతులను దెబ్బతీసే వ్యవసాయ ఉత్పత్తుల లావాదేవీలు, ఒప్పంద వ్యవసాయం, ఉత్పత్తులను నిల్వచేసే పరిమితులపై ఈ చట్టాలు సమర్థవంతంగా నియంత్రణను ఎత్తివేస్తాయని కొందరు వాదిస్తున్నారు. వీటి వల్ల తాము ఘోరంగా దెబ్బతింటామని సన్న, చిన్నకారు రైతులు భయపడుతున్నారు.
బహుశా ఇవి అనేక మంది రైతులకు అంగీకారం కాని ప్రభుత్వ యొక్క చివరి చర్యలు అయి ఉంటాయి.

రైతుల జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుండడం వలన వారి నిరసన ధ్వనులు మరింత ఉధృతం అయ్యాయి. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి ముందే నిజ, వ్యవసాయ ఆదాయాలు నిరంతరం క్షీణిస్తూ ఉండేవి. వాస్తవానికి, ఆయన రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను (వ్యవసాయానికి అయిన మొత్తం ఖర్చుకు 50శాతం అదనంగా కలిపి ఇవ్వడం) కల్పించడం ద్వారా ఐదేండ్లలో వారి ఆదాయాలు రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసిన తర్వాత మొదటిసారి ఎన్నికల్లో విజయం సాధించడంలో రైతులు చాలా కీలకమైన పాత్రను పోషించారు.

కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో మోడీ విఫలం అయ్యాడు. అంతేకాకుండా రైతులు అంతకు ముందున్న ప్రభుత్వం కల్పించిన ధర కంటే (తమ ఉత్పత్తులకు అయ్యే ఖర్చు కంటే కూడా) తక్కువ ధరను ప్రస్తుత ప్రభుత్వంలో పొందారు. వ్యవసాయ రంగానికి మోడీ చేసిన ఇతర అనేక వాగ్దానాల డొల్లతనం కూడా బయటపడడంతో అతని పాలన పట్ల రైతులు విశ్వాసాన్ని కోల్పోయారు.

ఇటీవల కాలంలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పతనం కావడం వలన వ్యవసాయ ఉత్పత్తుల ధరలు బాగా తగ్గి పోయాయి. 2016 నవంబర్‌లో పెద్దనోట్ల రద్దు నిర్ణయం, ఆ తరువాత అనాలోచితంగా జరిగిన జాతీయ వస్తుసేవల పన్ను లాంటి తప్పుడు నిర్ణయాలు, అసంఘటిత రంగానికి చెందిన ఆర్థిక కార్యకలాపాలు నాశనం కావడానికి, ప్రజల జీవనోపాధికి హాని కలిగించడానికి దోహదం చేశాయి.
ప్రభుత్వం ఉపాధిని, డిమాండ్‌ను పునరుద్ధ రించడానికి కోశ విధానాన్ని (Fiscal policy) ఉపయోగించక పోవడం వలన ఆదాయాలు, వినియోగం రెండూ క్షీణించి, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు బాగా తగ్గిపోయాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావం వల్ల, రైతులు వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవడం, మార్కెట్‌కు వాటిని తీసుకుని పోవడం కష్టతరంగా ఉండగా, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 2019లో ఉన్న ధరల స్థాయి కంటే తక్కువ స్థాయిలోనే ఉండిపోయాయి.

ఈ కొత్త చట్టాలు ప్రజా ఆహార సేకరణ వ్యవస్థ యొక్క చావు గంటలను వినిపిస్తాయని రైతులు అనుమానిస్తున్నారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఆ వ్యవస్థ అదుపు చేయడానికి కష్టతరమైన మార్కెట్‌ మార్పులకు వ్యతిరేకంగా రైతులకు కొన్ని ప్రాథమిక రక్షణ చర్యలను సమకూర్చుతుంది. నియంత్రించ బడిన మార్కెట్‌ యార్డుల గుత్తాధిపత్యాన్ని నిలిపి వేసిన బీహార్‌ లాంటి రాష్ట్రాల్లో పండించిన పంటల ధరలు కనీస మద్దతు ధర (MSP) కంటే బాగా తక్కువకు పడిపోయాయి.

కొత్త చట్టాలలోని ఒక చట్టం, కమిషన్‌ ఏజెంట్ల లాంటి ”మధ్య దళారుల” ప్రమేయం లేకుండా చేస్తుంది. కానీ రైతులు అలాంటి వారితో ఏర్పరచుకునే సంబంధాలు (కొనుగోలు చేసే సమయంలో ”క్వాలిటీ కంట్రోల్‌” లాంటి వివిధ పద్ధతులను ఉపయోగించి వారికి చెల్లించ వలసిన మొత్తాన్ని చెల్లించకుండా ఉండే ముక్కూమొహం తెలియని కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధుల కంటే కూడా) అవసరమైనప్పుడు కొన్ని రాయితీలను, సౌకర్యాలను పొందడానికి వీలు కల్పిస్తాయి.

పర్యావరణ అవరోధాలు, ప్రతికూల వాతావరణ మార్పుల ప్రభావం, కలుషిత నీరు, నీటి కొరత, రసాయనిక ఎరువులపై ఆధారపడి చేసే వ్యవసాయం వలన కలిగే భూసార క్షీణత గురించి రైతులు ఆందోళన చెందుతున్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ మోడీ ప్రభుత్వ విధానాలు ఈ సమస్యలను మరింత జటిలం చేస్తాయని వారు భయపడుతున్నారు.

ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం, ప్రజా స్వామ్యయుతంగా చేస్తున్న నిరసనలను పట్టించుకో కుండా కాలయాపన చేసింది కాబట్టి, ఇప్పుడు ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్న రైతులతో మాట్లాడాలను కుంది. మొదట ప్రభుత్వం నిరసన కార్యక్రమాలను పట్టించుకోలేదు. తరువాత రైతులు ప్రమాదకరమైన వ్యతిరేక శక్తుల మార్గదర్శకత్వంలో తప్పుదోవపడు తున్నారని పేర్కొంది. ఆ తర్వాత సిక్కు రైతులు ”జాతి వ్యతిరేకులు” కాబట్టి, వారు ”తీవ్రవాదులు” అని అర్థం వచ్చే విధంగా పేర్కొంటూ, శాంతియుతంగా జరుగుతున్న నిరసనలను అనాగరికంగా అణిచివేసేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వానుకూల ప్రధాన ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు గత ఆరు సంవత్సరాలుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారిపై దూకుడుగా దాడి చేసినట్టే, అవి రైతుల డిమాండ్లను కూడా బలహీనపరచి, వారిని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల ప్రధానమైన డిమాండ్‌ను ఒప్పుకునేందుకు ప్రభుత్వం తిరస్కరిస్తున్నది. ఇప్పటికే కొంతమంది నిరసనకారులు చలిలో చనిపోయారు కాబట్టి, బహిరంగ నిరసనలు నెమ్మదిగా బలహీనపడి నిరుత్సాహంగా ముగుస్తాయని ప్రభుత్వం భావిస్తోందని స్పష్టంగా కనిపిస్తోంది.

కానీ ఇది చట్టాలను, హెచ్చరికలను లెక్కచేయని అహంభావం. భారతదేశంలోని శ్రామికశక్తిలో సుమారు 50శాతం వ్యవసాయంపై ఆధారపడుతున్నది. మూడింట, రెండొంతుల జనాభా (70శాతం గ్రామీణ ప్రజలు) ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ ఆదాయాలపై ఆధారపడుతున్నది. నిరసన చేస్తున్న రైతుల దృఢ నిశ్చయం, విశాల ప్రాతిపదికన వారికి లభిస్తున్న ప్రజల మద్దతు, ఈ సారి ఈ రైతు ఉద్యమం చాలా భిన్నమైనదని సూచిస్తున్నాయి.

Courtesy Nava Telangana

Search

Latest Updates